ఇదీ జగనన్న ఏలు‘బడి’  | Government School Re Opened In YSRCP Government | Sakshi
Sakshi News home page

మూతపడ్డ పాఠశాల పునఃప్రారంభం:

Jun 22 2019 10:40 AM | Updated on Sep 18 2019 2:52 PM

Government School Re Opened In YSRCP Government - Sakshi

పాఠశాలలో చేరిన విద్యార్థులు 

సాక్షి, (పశ్చిమ గోదావరి) : పెదపాడు: 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం గ్రామంలోని పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉందన్న నెపంతో పాఠశాలను మూసివేసింది. అయితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొందరు యువకులు ఎంతో ఉత్సాహంతో ఆ పాఠశాల పునఃప్రారంభానికి నడుం కట్టారు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు వై.సురేష్‌ సహాయంతో ఇంటింటికీ తిరిగారు. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని కోరారు. పెరిగిన ఫీజుల భారంతోపాటు, జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకంపై ప్రజల్లో అవగాహన కలగడం, ప్రభుత్వ పాఠశాలలోనే ఉచితంగా ఇంగ్లిషు చదువులు లభిస్తుండడం, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలపై ఉత్సుకత చూపించారు.

దీనికి ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ప్రోత్సాహం తోడవడంతో పాఠశాలను పునఃప్రారంభం చేసేందుకు సన్నాహాలు చేశారు. ఈ నెల 11న పాఠశాలను అబ్బయ్యచౌదరి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసి పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు పంపిణీ చేశారు. దీంతో ఒక్కసారిగా పాఠశాలకు పూర్వ వైభవం వచ్చింది. గ్రామానికి చెందిన 105 మంది చిన్నారులను తమ తల్లిదండ్రులు పాఠశాలలో చేర్పించారు.  

భరోసా కల్పిస్తున్న ఉపాధ్యాయులు
గ్రామంలోని చిన్నారుల తల్లిదండ్రులకు పిల్లల చదువులపై ఉపాధ్యాయుడు సురేష్, ప్రధానోపాధ్యాయుడు కృష్ణమోహన్‌ భరోసా కల్పించడంపై విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తున్నారు. చెప్పిన విధంగానే విద్యార్థులను తీర్చిదిద్ధుతామని భరోసా ఇస్తున్నారు. అలాగే ప్రభుత్వం అందించిన యూనిఫాం, షూలతో కార్పొరేట్‌ పాఠశాలలను తలపిస్తోంది.

యువకులు, విద్యావేత్తల సహాయం
గ్రామంలో యువకులు, విద్యావేత్తలు పాఠశాల అభివృద్ధికి సహాయం చేస్తున్నారు. ఉచిత నోట్‌ పుస్తకాల పంపిణీ, వాటర్‌ ట్యాంకు ఏర్పాటు, మైదానం అభివృద్ధి చేశారు. దీంతో పాటు దూరప్రాంత చిన్నారులకు ఆటోసౌకర్యం ఏర్పాటు చేశారు. దీనికి గ్రామంలో కొంతమంది యువత ఆర్థిక సహాయం చేస్తోంది. 

హామీ ఇవ్వడంతో ఆసక్తి
ప్రైవేటు పాఠశాలల కంటే ఉత్తమ విద్యతో పాటు, ఆటపాటలను నేర్పిస్తామని తల్లిదండ్రులకు భరోసా కల్పించాము. అలాగే పాఠశాలలో ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలపై అవగాహన కల్పించాం. దీంతో తల్లిదండ్రులు తమ చిన్నారులను పాఠశాలలో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం 105 మంది చేరారు. ఇంకా చేరే అవకాశం ఉంది.    
– వి.కృష్ణమోహన్, ప్రధానోపాధ్యాయుడు

అవగాహన కల్పించాం
పాఠశాలను తెరిపించాలని అడిగిన మీదట అడ్మిషన్‌లు రాయాలని ఎంఈఓ ఆదేశించారు. దీంతో ఇంటింటికీ తిరిగి పిల్లల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, చదువులపై అవగాహన కల్పించాం. దీంతో అధిక సంఖ్యలో విద్యార్థులు చేరారు. అలాగే పాఠశాల పునఃప్రారంభానికి ఎమ్మెల్యే సహకరించి తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చారు.
– వై.సురేష్, పాఠశాల ఉపాధ్యాయుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement