ఇక్కడ పోస్టులు అమ్మబడును! | government posts for sales | Sakshi
Sakshi News home page

ఇక్కడ పోస్టులు అమ్మబడును!

Jun 9 2016 3:47 AM | Updated on Sep 4 2017 2:00 AM

ఇక్కడ పోస్టులు అమ్మబడును!

ఇక్కడ పోస్టులు అమ్మబడును!

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పారిశుద్ధ్య కార్మికుల పోస్టుల పందేరానికి తెరలేచింది.

పెద్దాస్పత్రిలోపారిశుద్ధ్య పోస్టుల పందేరం  
ఒక్కో పోస్టుకు రూ.30 వేలకు బేరం
ఆస్పత్రిలో కీలక వ్యక్తుల పాత్ర

 
కర్నూలు (హాస్పిటల్):
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పారిశుద్ధ్య కార్మికుల పోస్టుల పందేరానికి తెరలేచింది. ఒక్కోపోస్టుకు రూ.30 వేల చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో ఆస్పత్రిలోని కొందరు కీలక వ్యక్తులు చక్రం తిప్పుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ నెల నుంచి ఆస్పత్రిలో పారిశుద్ధ్య పనులను రాష్ట్ర ప్రభుత్వం ఏ1 సంస్థకు అప్పగించింది. గతంలో ఈ పనులను ఏజిల్ సంస్థ నిర్వహించేది. అప్పట్లో ఈ సంస్థకు నిర్వహణ కింద నెలకు రూ.35 లక్షలను ఇచ్చేవారు. ప్రస్తుత కార్మికుల సంఖ్యను 180 నుంచి 300లకు పెంచడం, వేతనాలు కూడా పెరగడంతో నిర్వహణ మొత్తాన్ని రూ.58 లక్షలకు పెంచారు. అయితే ఆశావహుల కన్ను కార్మికుల పోస్టులపై పడింది. వారం రోజుల నుంచి ఈ పోస్టుల విషయమై పలువురు ఆస్పత్రి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలిసింది. తెలిసిన వారిని, పైరవీలు చేసే వారిని కలిసి పోస్టు ఇప్పించాలని కోరుతున్నట్లు సమాచారం. ఆశావహుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని పైరవీకారులు చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది.
 
 అధికారపార్టినేతల ఒత్తిళ్లు
ఒకేసారి ఆస్పత్రిలో 100 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికుల పోస్టులను ఔట్ సోర్సింగ్ కింద ఏ1 సంస్థ భర్తీ చేయనుందని ప్రచారం జరగడంతో అధికార పార్టీ నాయకుల కన్ను వీటిపై పడింది. చోటామోటా నాయకులు రంగప్రవేశం చేసి ఆసుపత్రి అధికారులపై ఒత్తిళ్లు చేస్తున్నట్లు సమాచారం. పోస్టులను తమవారికే ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. నాయకులు ఇదే అదనుగా ఆశావహుల నుంచి రూ.15 వేల నుంచి రూ.30వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా  పోస్టులను భర్తీ చేసే అధికారం తమకు లేదని, అది పూర్తిగా ఏ1 సంస్థ చూసుకుంటుందని అధికారులు తప్పించుకుంటున్నట్లు సమాచారం.
 
చక్రం తిప్పుతున్న కీలక వ్యక్తులు
పోస్టుల భర్తీ విషయంలో కొందరు కీలక వ్యక్తులు చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. తాము చెప్పిన వారికే పోస్టులు ఇవ్వకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులు పడతారని బెదిరిస్తున్నట్లు తెలిసింది. ఒక్కో పోస్టుకు రూ.30 వేల చొప్పున ఇవ్వాలని ఆశావహులను డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పదేళ్ల క్రితం ఈ పోస్టులను రూ.10 వేల చొప్పున కొందరు అధికారులు అమ్ముకున్నారని, రెండేళ్ల క్రితం కూడా రూ.20 వేల వరకు అమ్ముడయ్యాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రూ.30 వేలకు తగ్గకూడదని కీలక వ్యక్తులు నిర్ణయించినట్లు సమాచారం.
 
 
 ఏ1 సంస్థతో ఒప్పందం కాలేదు

ఆసుపత్రిలో పారిశుద్ధ్య పనులకు సంబంధించి ఏ1 సంస్థతో ఇప్పటి వరకు ఎలాంటి ఎంఓయూ జరగలేదు. ఆ తర్వాత కూడా పారిశుద్ధ్య కార్మికుల నియామకాలను ఏ1 సంస్థ మాత్రమే చేపడుతుంది. ఆసుపత్రి కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే మధ్యవర్తుల మాటలను నమ్మి మోసపోవద్దు. - డాక్టర్ వీరాస్వామి, ఆసుపత్రి సూపరింటెండెంట్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement