breaking news
leaders adhikaraparti
-
ఇక్కడ పోస్టులు అమ్మబడును!
► పెద్దాస్పత్రిలోపారిశుద్ధ్య పోస్టుల పందేరం ►ఒక్కో పోస్టుకు రూ.30 వేలకు బేరం ► ఆస్పత్రిలో కీలక వ్యక్తుల పాత్ర కర్నూలు (హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పారిశుద్ధ్య కార్మికుల పోస్టుల పందేరానికి తెరలేచింది. ఒక్కోపోస్టుకు రూ.30 వేల చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో ఆస్పత్రిలోని కొందరు కీలక వ్యక్తులు చక్రం తిప్పుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ నెల నుంచి ఆస్పత్రిలో పారిశుద్ధ్య పనులను రాష్ట్ర ప్రభుత్వం ఏ1 సంస్థకు అప్పగించింది. గతంలో ఈ పనులను ఏజిల్ సంస్థ నిర్వహించేది. అప్పట్లో ఈ సంస్థకు నిర్వహణ కింద నెలకు రూ.35 లక్షలను ఇచ్చేవారు. ప్రస్తుత కార్మికుల సంఖ్యను 180 నుంచి 300లకు పెంచడం, వేతనాలు కూడా పెరగడంతో నిర్వహణ మొత్తాన్ని రూ.58 లక్షలకు పెంచారు. అయితే ఆశావహుల కన్ను కార్మికుల పోస్టులపై పడింది. వారం రోజుల నుంచి ఈ పోస్టుల విషయమై పలువురు ఆస్పత్రి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలిసింది. తెలిసిన వారిని, పైరవీలు చేసే వారిని కలిసి పోస్టు ఇప్పించాలని కోరుతున్నట్లు సమాచారం. ఆశావహుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని పైరవీకారులు చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. అధికారపార్టినేతల ఒత్తిళ్లు ఒకేసారి ఆస్పత్రిలో 100 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికుల పోస్టులను ఔట్ సోర్సింగ్ కింద ఏ1 సంస్థ భర్తీ చేయనుందని ప్రచారం జరగడంతో అధికార పార్టీ నాయకుల కన్ను వీటిపై పడింది. చోటామోటా నాయకులు రంగప్రవేశం చేసి ఆసుపత్రి అధికారులపై ఒత్తిళ్లు చేస్తున్నట్లు సమాచారం. పోస్టులను తమవారికే ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. నాయకులు ఇదే అదనుగా ఆశావహుల నుంచి రూ.15 వేల నుంచి రూ.30వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా పోస్టులను భర్తీ చేసే అధికారం తమకు లేదని, అది పూర్తిగా ఏ1 సంస్థ చూసుకుంటుందని అధికారులు తప్పించుకుంటున్నట్లు సమాచారం. చక్రం తిప్పుతున్న కీలక వ్యక్తులు పోస్టుల భర్తీ విషయంలో కొందరు కీలక వ్యక్తులు చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. తాము చెప్పిన వారికే పోస్టులు ఇవ్వకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులు పడతారని బెదిరిస్తున్నట్లు తెలిసింది. ఒక్కో పోస్టుకు రూ.30 వేల చొప్పున ఇవ్వాలని ఆశావహులను డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పదేళ్ల క్రితం ఈ పోస్టులను రూ.10 వేల చొప్పున కొందరు అధికారులు అమ్ముకున్నారని, రెండేళ్ల క్రితం కూడా రూ.20 వేల వరకు అమ్ముడయ్యాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రూ.30 వేలకు తగ్గకూడదని కీలక వ్యక్తులు నిర్ణయించినట్లు సమాచారం. ఏ1 సంస్థతో ఒప్పందం కాలేదు ఆసుపత్రిలో పారిశుద్ధ్య పనులకు సంబంధించి ఏ1 సంస్థతో ఇప్పటి వరకు ఎలాంటి ఎంఓయూ జరగలేదు. ఆ తర్వాత కూడా పారిశుద్ధ్య కార్మికుల నియామకాలను ఏ1 సంస్థ మాత్రమే చేపడుతుంది. ఆసుపత్రి కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే మధ్యవర్తుల మాటలను నమ్మి మోసపోవద్దు. - డాక్టర్ వీరాస్వామి, ఆసుపత్రి సూపరింటెండెంట్ -
నింపు.. పంపు
ఇసుక దందాలను సహించను.. డ్వాక్రా మహిళలు తప్పా, ప్రైవేటు వ్యక్తులు ఇసుక తవ్వకాలు నిర్వహించరాదు.. మంత్రులు జిల్లాల్లో జరుగుతున్న పరిస్థితులను పట్టించుకొండి. - ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టీకరణ... సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలకు భిన్నంగా జిల్లాలో ఇసుక అక్రమరవాణా చోటుచేసుకుంటోంది. డ్వాక్రా గ్రూపుల మాటున కొందరు, ఇసుక డంప్‌ల వేలం ద్వారా ఇంకొందరు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. జిల్లాలో నిత్యం అరకోటికి పైగా అధికార పార్టీ నేతల జేబుల్లోకి చేరుతోంది. ప్రకృతి సంపదను దోచుకునేందుకు అధికారపార్టీ నేతలు కావడమే ఏకైక అర్హతగా కొందరికి పెట్టుబడి అవుతోంది. పాపాఘ్ని, పెన్నా, చెయ్యేరు నదుల ద్వారా ఇసుక అక్రమరవాణాకు అడ్డు అదుపు లేకుండా నిర్విరామంగా చేపడుతున్నారు. వెఎస్సార్ జిల్లాలోని తెలుగుతమ్ముళ్లు ఇసుక అక్రమరవాణాను ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. పెట్టుబడి లేని ఆదాయం కావడంతో విజృంభిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇసుకను అందుబాటులోకి తేవాలనే తలంపుతో డ్వాక్రా సంఘాలకు ఆ బాధ్యతలను అప్పగించారు. వారి మాటున కొందరు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. జిల్లా కేంద్రంలో టన్ను రూ.వెయ్యి తో వికయిస్తున్న నేతలు బెంగుళూరుకు కూడా తరలిస్తున్నారు. అక్కడ టన్ను రూ.2వేలు పలుకుతుండటంతో ఎక్కువగా అటువైపు మొగ్గుచూపెడుతున్నారు. నిత్యం వందకు పైగా లారీలు జిల్లా నుంచి తరలివెళ్తున్నా నిలువరించే నాధుడే కరువయ్యారు. పెట్టుబడిలేని వ్యాపారం.... వైఎస్సార్ జిల్లాలో జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు, రాజంపేట నియోజకవర్గాలకు చెందిన అధికార పార్టీ నేతలు కొందరు ఇసుకనే నమ్ముకొని అక్రమార్జనకు పాల్పడుతున్నారు. డ్వాక్రా గ్రూపులకు ఇసుక రీచ్‌లు ఇవ్వడం ఒక వరం అవుతుండగా ఇసుక డంప్‌లను వేలంలో విక్రయించి, ఆమాటున నదులను లూఠీ చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు వేలంలో విక్రయించి, ఉన్న డంప్‌లను అలానే ఉంచి, ఆపర్మిట్లతో ఇసుకను తరలిస్తున్నారు. బెంగుళూరులో ఒక లారీ ఇసుక రూ.60వేలు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఆమేరకు కొండాపురం, కమలాపురం, ప్రొద్దుటూరు నుంచి యధేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు. చెన్నై పట్టణానికి రాజంపేట నుంచి తరలిస్తున్నారు. పెట్టుబడిలేని వ్యాపారం కావడంతో అవకాశం ఉన్నచోట, కండబలం ఉన్న నాయకులు ఇసుక అక్రమ ఆదాయం వైపు మొగ్గు చూపుతున్నారు. పక్కాగా సహకరిస్తున్న యంత్రాంగం.... ఇసుక డంప్‌ను అధికారపార్టీ నేతలకు అనువైన ప్రాంతానికి చేర్చడం, అక్కడ డంప్ ఉన్నట్లు అధికారులకు తెలియజెప్పడం, ఆ డంప్‌ను వేలంలో దక్కించుకోవడాన్ని క్రమం తప్పకుండా కొందరు నాయకులు పాటిస్తున్నారు. వేలంలో దక్కించుకున్న పర్మిట్ల ఆధారంగా నదుల్లోంచి ఇసుకను తరలిస్తున్నారు. నకిలీ పర్మిట్లు సృష్టించి ఇవ్వడంలో రెవిన్యూ యంత్రాంగం సహ కరిస్తోంది. జిల్లాలో ఇరువురు ఆర్డీఓలు సైతం అక్రమ పర్మిట్లు అందించడంలో సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇరువురు రెవిన్యూ కార్యదర్శులను సస్పెండ్ చేయడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నాం.. అవకాశం వచ్చినప్పుడన్నా నాలుగురాళ్లు పోగు వేసుకోకపోతే ఎలా అంటూ తెలుగుదేశం పార్టీ నేత ఒకరు అభిప్రాయపడటం గమనార్హం.