సర్కారు కచేరీ... విలాసాల వాకిలి...

Government Offices Becoming Entertaining Centers In Vizianagaram - Sakshi

ప్రభుత్వ కార్యాలయాలను కొందరు ప్రబుద్ధులు విలాసాల వేదికగా మార్చేస్తున్నారు. మందు కొట్టి ఎంచక్కా... విధులకు హాజరవుతూ కార్యాలయాల గౌరవాన్ని మంటగలుపుతున్నారు. విచక్షణ మరచి పై అధికారులపై రంకెలేయడం... ఐటెమ్‌సాంగ్స్‌కు చిందులేయడం హీరోయిజంగా భావిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలు ఉద్యోగుల్లో క్రమశిక్షణారాహిత్యాన్ని బయటపెడుతున్నాయి. ఓ వైపు ప్రజాసంక్షేమంకోసం ప్రభుత్వం పాటుపడు తూ... పాలనలో దూసుకుపోతుంటే... జిల్లా అధికారులు సైతం అందరూ మారాలని ఉద్బోధిస్తుంటే... వీరు మాత్రం ఇంకా పాతవాసనలతో మెలుగుతూ... పాలనకు చెడ్డపేరు తీసుకువస్తున్నారు.

సాక్షి, విజయనగరం : పూర్వం మహరాజుల కాలంలో ‘కచేరి’లనేవి ఉండేవి. రాజ్యానికి సంబంధించిన పాలనాపరమైన అంశాలపై రాజ ఉద్యోగులు ఇక్కడి నుంచే సమీక్షించేవారు. ఇక్కడే ఆట, పాట, విందు వంటి సకల సదుపాయాలూ ఉండేవి. కాలక్రమంలో ఈ కచేరీలే ప్రభుత్వ కార్యాలయాలుగా పరిణామం చెందాయి. అయితే పూర్వంలా కాకుండా కొన్ని మార్పులు చోటు చేసుకుని ప్రజోపయోగ కార్యకలాపాలు నిర్వహించడానికి మాత్రమే ఈ కార్యాలయాల్లో ఉద్యోగులు పనిచేయాలనే నిబంధనలు వచ్చాయి.

కానీ ఇంకా అక్కడక్కడా కొందరు ఉద్యోగులు ఇంకా తమ కార్యాలయాలను ‘కచేరి’లుగానే భావిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు ఉద్యోగులు చేస్తున్న నిర్వాకాలు మొత్తం వ్యవస్థకే మచ్చతెచ్చేవిలా ఉంటున్నాయి. మారాలి..మారాలి అని సీఎం దగ్గర్నుంచి జిల్లా కలెక్టర్‌ వరకూ ఓ వైపు సమీక్షలు పెట్టి పదేపదే చెబుతున్నా కొందరిలో మార్పు రావడం లేదు.

తాజాగా బొబ్బిలి పంచాయతీరాజ్‌ శాఖ సీనియర్‌ అసిస్టెంట్‌ ఫుల్లుగా మద్యం సేవించి తన పై అధికారైన అసిస్టెంట్‌ ఇంజనీర్‌ను నోటికొచ్చినట్లు తిట్టాడు. అడ్డొచ్చిన వారిపైనా తిట్ల దండకం అందుకున్నాడు. జిల్లాలో గతంలోనూ చాలా విభాగాల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువై ఇలాంటి సంఘటనలే బయటపడ్డాయి.

అసలేం జరిగిందంటే...
బొబ్బిలి మండలపరిషత్‌ ఆవరణలోని పంచాయతీరాజ్‌ కార్యాలయంలో కురుపాం నుంచి వచ్చి రెండున్నరేళ్లుగా డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న సీని యర్‌ అసిస్టెంట్‌ చప్ప లకు‡్ష్మనాయుడు మంగళవారం మద్యంసేవించి వీరంగం సృష్టించారు. ఉదయం 9 గంటలకే కార్యాలయానికి చేరుకున్న ఆయన అప్పటికే కార్యాలయంలో ఉన్న సిబ్బంది తో కొద్దిపాటి వివాదానికి దిగారు.

ఈ లోగా తెర్లాంకు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి జేఈ కుప్ప రమేష్‌ కోసం రాగా ఆయనతోనూ వాదనకు దిగారు. 10గంటల సమయంలో ఏఈ కుప్పరమేష్‌ కార్యాలయానికి వచ్చి తన పనిచేసుకుం టూ, తెర్లాం నుంచి వచ్చిన మాజీ ప్రజాప్రతినిధితో మాట్లాడుతున్న సమయంలో లక్ష్మున్ననాయుడు వారివద్దకు వెళ్లి రాజకీయాలను ప్రస్తావిస్తూ కావాలనే గొడవకు దిగారు. పని సమయంలో మనకు రాజకీయాలెందుకు..? తాగి కార్యాలయానికి రావడమెందుకు...? అని ఏఈ రమేష్‌ వారించేందుకు ప్రయత్నించగా.. ‘‘ఎవడు రాజకీయాలు మాట్లాడారు..? ఎవడు తాగి వచ్చాడు...?’’ అంటూ అతనిపై నోరేసుకుని పడిపోయాడు.

ఈ విషయం తెలిసి ‘సాక్షి’ అక్కడకు చేరుకుని ఆ దృశ్యాలను కెమెరాలో బంధించింది. అయినా అతను తగ్గలేదు. ఈ లో గా వచ్చిన మిగతా సిబ్బంది కూడా ఏఈతో వివాదమెందుకంటూ లక్ష్మున్నానాయుడుకు సర్దిచెప్పాలని చూశారు. ఆయన ఇంకా రెచ్చిపోయి ‘ఎవడికి ఏఈ..? మీకు ఏఈ అయితే నాకు ఎక్కువ కాదు’ అంటూ  దుర్భాషలాడారు. దీనిపై ఆవేదన చెందిన ఏఈ రమేష్‌ కొద్దిసేపు కార్యాలయం బయటకు వచ్చి నిలబడి, అట్నుంచి అటే ఆయన ఫీల్డుకు వెళ్లిపోయారు. 

కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లిన ‘సాక్షి’
ఈ సంఘటనను వీడియో, ఫొటోలు వంటి ఆధారాలతో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ హరిజవహర్‌లాల్‌ దృష్టికి ‘సాక్షి ప్రతినిధి’ తీసుకువెళ్లడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. పూర్తి వివరాలు తెలుసుకుని వెంటనే నివేదిక ఇవ్వాల్సిందిగా జిల్లా పరిషత్‌ సీఈఓ టి.వెంకటేశ్వరరావును కలెక్టర్‌ ఆదేశించారు. సీఈఓ వెంకటేశ్వరరావు వెంటనే పంచాయతీరాజ్‌ డీఈ డబ్ల్యూ.వి.ఎన్‌.ఎస్‌.శర్మకు ఫోన్‌చేసి వివరాలు అడిగారు. వివాదం జరిగిన సమయంలో తాను కార్యాలయంలో లేనని, ఇద్దరి నుంచి సమాచారం తీసుకుని అందిస్తానని చెప్పిన డీఈ కొంత సమయం తర్వాత జరిగిన దానిపై సీఈఓకు వివరణ అందజేశారు. 

గతంలోనూ ఇలాంటి సంఘటనలు
జిల్లాలో ఇలాంటి ఉదంతాలు కొత్త కాదు. గతంలో మెరకముడిదాం మండలంలో జగన్నాథరాజు ఎంపీడీఓగా  పనిచేశారు. ఈయన ఒకరోజు రాత్రి 10 గంటలు సమయంలో మండల పరిషత్‌ కార్యాలయంలో తన సీటులో కూర్చొని మందుతాగుతూ పనిచేస్తున్నారని విలేకరులకు తెలిసి వెళ్లగా అక్కడ ఆయన మద్యం సేవిసూŠత్‌ మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించిన బిల్లులపై సంతకా>లు చేస్తూ కనిపించారు.

దానిపై అప్పుడు కూడా  ‘సాక్షి పత్రిక ప్రధాన సంచికలో వార్త ప్రచురించడంతో జగన్నాథరాజుపై అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అదే కార్యాలయంలో గతంలో పనిచేసిన సీనియర్‌ అసిస్టెంట్, టైపిస్ట్‌ కంప్యూటర్‌లో నీలిచిత్రాలు తిలకిస్తూ విలేకరులకు పట్టబడ్డారు. వీరిపై చర్యలు తీసుకోవాలని అప్పటి జిల్లాపరిషత్‌ సీఈఓ ప్రయత్నించినప్పటికీ నాడు అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు సీఈఓపై ఒత్తిడి చేయడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top