ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరగాలంటూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మార్పు’ కార్యక్రమం వల్ల గర్భిణులకు ఇబ్బందులు తప్పడం లేదు.
ఇదేం ‘మార్పు’
Sep 4 2013 4:04 AM | Updated on Sep 1 2017 10:24 PM
బాల్కొండ, న్యూస్‌లైన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరగాలంటూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మార్పు’ కార్యక్రమం వల్ల గర్భిణులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతినెల ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు మండల పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 7, 8, 9 నెలల గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతినెల వైద్య పరీక్షలు జరిపించుటకు గ్రామాల్లో ఉన్న ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు గ ర్భిణులను ఆస్పత్రులకు తీసుకొస్తారు. ఇంటి నుంచి ఆస్పత్రికి వచ్చేటప్పుడు 108 వాహనంలో ఉచితంగా తీసుకువస్తారు. అయితే వైద్య పరీక్షల అనంతరం ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లడానికి ప్రయాణ సౌకర్యాన్ని కల్పించకుండా అధికారులు చేతులు దులుపుకుంటున్నారు.
దీంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలి నడకన కొందరు, ఆటోల్లో మరికొందరు స్వగ్రామాలకు వెళుతున్నారు. అధికారులు తమ రికార్డులు మెరుగు పరుచుకోవడం కోసం మార్పు కార్యక్రమం విజయవంతం కావడానికి గతంలో ఇంటింటికి తిరిగారు. గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేయించుకోవాలని సూచించారు. కానీ నిండు గర్భిణులను ఆస్పత్రి వరకు తీసుకెళ్లి తిరుగు ప్రయాణంలో పడే ఇబ్బందులను మాత్రం పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 9 నెలలు నిండిన గర్భిణులకు కూడా అవస్థలు తప్పడం లేదు. ఇదేమి ‘మార్పు’ అని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
చార్జీలు చెల్లించలేమంటున్న ఏఎన్‌ఎంలు
గర్భిణులను ఆస్పత్రికి తీసుకొచ్చిన ఏఎన్‌ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, ఆశ వర్కర్లు కొన్ని సందర్భాల్లో ఆటోల్లో, బస్సుల్లో చార్జీలు చెల్లించి గర్భిణులకు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ చార్జీలు భరించలేమని చెబుతున్నారు. అసలే కాంట్రాక్ట్ ఉద్యోగులు. వేతనాలు ఏడాదికోసారి ఇస్తారు. వాటిలో నుంచి ప్రతినెల రూ. 100 నుంచి రూ.200 సొంతంగా భరించి గర్భిణులకు చార్జీలు చెల్లిస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారుకూడా మిన్నకుండటంతో గర్భిణులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ప్రయాణ సౌకర్యాలను కల్పించాలని గర్భిణులు కోరుతున్నారు.
Advertisement
Advertisement


