ఆగని వర్షం.. తీరని కష్టం

Godavri River Flow In Continues Floods Situation In East Godavari - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : వరద గోదావరి ఉగ్రరూపం వారం రోజుల తరువాత మంగళవారం నాటికి కాస్త శాంతించినా.. వర్షం మళ్లీ ప్రారంభమవడంతో ఇటు ఏజెన్సీ, అటు కోనసీమలోని పలు ప్రాంతాల ప్రజలు భయాం దోళనల్లోనే ఉన్నారు. కోనసీమలోని లంకల్లో వాణిజ్య పంటలు నీట మునిగి వారం రోజులు దాటిపోవడంతో తీవ్రంగా నష్టపోతామనే ఆందోళనలో రైతులున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాలైన కొత్తపేట, ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం, మామిడికుదురు, అల్లవరం, రావుపాలెం, తాళ్లరేవు, కె గంగవరం తదితర మండలాల్లో ఇప్పటికీ వందలాది ఇళ్లు వరద ముంపులోనే ఉన్నాయి. ధవళేశ్వరం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టినా ప్రమాదం పూర్తిగా వీడలేదని జలవనరుల శాఖ అంచనా వేస్తోంది. భద్రాచలంలో రాత్రి 8 గంటలకు గోదావరి నీటిమట్టం 39.10 అడుగులుండగా ఒకటో నంబర్‌ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించగా, ధవళేశ్వరంలో ఒకటో నంబర్‌ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అదే ధవళేశ్వరం వద్ద మంగళవారం తెల్లవారుజామున గోదావరి 12.10 అడుగులుండగా సుమారు 12 గంటలపాటు అదే కొనసాగింది.

రాత్రి 8 గంటలకు 12 అడుగులుగా నమోదవగా 10.35 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేశారు. వరద ప్రస్తుతం తగ్గుముఖం పట్టినా అటు ఏజెన్సీ, ఇటు కోనసీమలో ముంపు వీడటానికి నాలుగైదు రోజులు పడుతుంది. వరద తీవ్రత ఏజెన్సీ ప్రాంతంతో పాటు కోనసీమ ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. దేవీపట్నం మండలంతోపాటు కోనసీమలోని గోదావరి తీర ప్రాంతాలు, లంక గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఏజెన్సీలోని దేవీపట్నం మండలంలో వరద ఉధృతి తగ్గకపోగా మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో ప్రజల ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులుగా నీటిలో నానుతుండటంతో ఇళ్లు కూలిపోతాయని ముంపు ప్రాంతాల్లో ఉన్న వారు కలవరపడుతున్నారు. కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి వరద పరిస్థితి, పునరావాస ఏర్పాట్లను అధికారులతో సమీక్షించారు. భారీ నీటిపారుదలశాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఏజెన్సీలో వరద పరిస్థితిని పరిశీలించేందుకు బుధవారం వస్తున్నారు.

మంత్రి మధురపూడి ఎయిర్‌పోర్టుకు వచ్చి అక్కడి నుంచి గండిపోశమ్మ ఆలయం మీదుగా దేవీపట్నం వెళతారు. ఏజెన్సీలోని దేవీపట్నం మండలంలో గోదావరి వరద ఉధృతి తగ్గింది. ఎగువ నుంచి వరద ఉధృతి తగ్గడంతో దేవీపట్నంలో వరద తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కానీ ఎగువన మహారాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరద పూర్తిగా తగ్గుతుందనే నమ్మకం కలగడం లేదని అధికారులు చెబుతున్నారు. భద్రాచలంలో వరద తగ్గుముఖం పట్టినా దేవీపట్నం మండలంలోని ముంపు గ్రామాల్లో ఇంకా నీరు వదల్లేదు. దీంతో వరద బాధితులు పునరావాస కేంద్రాలకే పరిమితమయ్యారు. రంపచోడవరం ఐటీడీఏ పీఓ నిశాంత్‌కుమార్‌ ఆధ్వర్యంలో పునరావాస కేంద్రాలను పరిశీలించారు. విలీన మండలాల్లో కూడా ఇంకా వరద ముంపు వీడలేదు. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.

కోనసీమలో...
కోనసీమలోని కొత్తపేట, రావుపాలెం, ఆలమూరు, కె గంగవరం, ముమ్మిడివరం తదితర మండలాల్లోని లంకల్లో వాణిజ్య పంటలు పూర్తిగా ముంపులో ఉన్నాయి. ముంపు వచ్చి వారం రోజులు గడిచిపోవడంతో పంటలకు తీవ్ర నష్టం వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గురజాపు లంక, కమిని, లంకాఫ్‌ ఠానేల్లంక తదితర ప్రాంతాల్లో వరద ఉధృతికి లంకలు గోదాట్లో కలిసిపోయాయి. వరద తగ్గితే ఈ కోత మరింత పెరుగుతుందంటున్నారు. కొత్తపేట నియోజకవర్గంలో ఊబలంక, రావులపాలెం, కొమరాజులంక, వశిష్ట గోదావరి చేరి ఉన్న ఎల్‌ పోలవరం, పొడగట్లపల్లి, గోపాలపురం, బడుగువానిలంక చుట్టూ వరదనీరు చేరింది.  మడికి, మూలస్థాన అగ్రహారం, జొన్నాడ, చొప్పెల్ల, పిచ్చుకలంక, వద్దిపర్రు, రాజవరం, ఆత్రేయపురం, వెలిచేరు, వాడపల్లి గ్రామాలలో అరటి, కంద, పసుపు, బొప్పాయి పంటలతో పాటు పశుగ్రాసం వరదనీటిలో మునిగిపోయాయి. రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లిలంక, అప్పనరామునిలంక, సఖినేటిపల్లి లాకుపేట, రామరాజులంక, గ్రామాల్లో వరద  ప్రభావం తీవ్రంగా ఉంది.  

సుమారు వెయ్యికి పైగా  ఇళ్లు జల దిగ్బంధంలో ఉండటంతో దైనందిన కార్యక్రమాలు నిలిచిపోయాయి.  దిండి, శివకోడు, రాజోలు  బాడవలలో  పలు నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి. పి.గన్నవరం నియోజకవర్గం ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, బూరుగులంక, అరిగెలవారిలంక, కె.ఏనుగుపల్లి, మానేపల్లి శివారు చివాయిలంక, జొన్నల్లంక, మొండెపులంక, నాగుల్లంక చివారు కాట్రగడ్డ, అప్పనపల్లి, బి.దొడ్డవరం, పెదపట్నంలంక, పెదపట్నం గ్రామాలతో పాటు పాశర్లపూడి, పాశర్లపూడిలంక మత్స్యకార పేట వాసులు, అయినవిల్లి మండల పరిధిలోని వీరవల్లిపాలెం, అయినవిల్లిలంక, పొట్టిలంక, తొత్తరమూడి గ్రామ పరిధిలోని కె.పెదలంక, కొండుకుదురులోని గుణ్ణంమెరక ప్రాంతాల ప్రజలు వరదతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అల్లవరం మండలం బోడసకుర్రు పల్లిపాలెంలో మత్స్యకారులకు చెందిన 60 ఇళ్లు వరద ముంపులో చిక్కుకున్నాయి.

సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ బాధితులను పరామర్శించారు. ఉగాది నాటికి వరద బాధితులందరికీ ఇళ్లు స్థలాలు పంపిణీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.  ముమ్మిడివరం మండలం  గౌతమి, వృద్ధ గౌతమి నదీపాయల మధ్య ఉన్న లంక గ్రామాలు గోదావరి ఆటుపోట్లు మధ్య తల్లడిల్లి పోతున్నాయి.  సలాదివారి పాలెం, శేరిల్లంక గ్రామాలలో సుమారు 40 ఎకరాల విలువైన వ్యవసాయ భూములు నదీకొతకు గురై  అండలుగా జారి గోదావరిలో కలిసిపోయాయి. లంకాఫ్‌ ఠానేల్లంక, గురజాపు లంక గ్రామాలను వరదనీరు ముంచెత్తింది. కె.గంగవరం మండలం కోటిపల్లి మత్స్యకార కాలనీలో గోదావరి పక్కనే ఉన్న ఇళ్లు కొంత మేర పాక్షికంగా దెబ్బతిన్నాయి. లంక భూముల్లో ఉన్న బొప్పాయి తోటలకు నష్టం వాటిల్లింది. కపిలేశ్వరపురం మండలం కేదారిలంక, అద్దంకివారిలంక, వీధివారిలంక, నారాయణలంక, పల్లపులంక గ్రామాల్లో పంటపొలాలను వరదనీరు చుట్టుముట్టింది.

గ్రామాల్లోని పశువులను మెరక ప్రాంతాలకు తరలించారు. అరటి, కూరగాయలు, బొప్పాయితోటలు ముంపు బారిన పడ్డాయి. ధనమ్మమర్రి సమీపంలోని ఇటుకల బట్టీలవరకు వరదనీరు ముంచెత్తింది.  రాజమహేంద్రవరం రూరల్‌ కాతేరు గోదావరి వద్ద ఉన్న జల్లకాలువ గేటు మూసివేయడంతో కాలువలో నీరు వెనక్కి ప్రవహిస్తుంది. తొర్రేడు, కోలమూరు తదితర గ్రామాల్లోని సుమారు 100 హెక్టార్లలో వరిపొలం ముంపునకు గురైంది. ధవళేశ్వరం సాయిబాబాగుడి ఆవకాలువ గేటు మూసివేయడంతో రాజమహేంద్రవరం నగరం నుంచి వచ్చే మురుగునీరు వెనక్కి తన్నడంతో బొమ్మూరు నేతాజీనగర్‌ ప్రాంతం ముంపులో ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top