ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ..
ఒంగోలు టౌన్ : ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్రశాఖ పిలుపు మేరకు జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు బుధవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. స్థానిక అంబేద్కర్ భవన్ నుంచి ప్రదర్శనగా బయల్దేరి కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు పూనూరి నరేంద్ర మాట్లాడారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ తమ ద్వారే సాధ్యమవుతుందని చంద్రబాబు చెప్పారని, టీడీ పీ అధికారంలోకి వస్తే వర్గీకరణ చేసి మాదిగలకే పెద్ద మాదిగ అవుతానని హామీ ఇచ్చారని, హామీని ఇప్పుడు నెరవేర్చాలని నరేంద్ర కోరారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు.
గతంలో యూపీఏ ప్రభుత్వం మాదిగలపై వివక్ష చూపిందని, అందుకు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగల యుద్ధభేరీ చూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఆందోళనలో జిల్లా అధికార ప్రతినిధి సండ్రపాటి కాలేబుమాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చాట్ల డానియేల్‌మాదిగ, తిరువీధుల బాబూమాదిగ, రాష్ట్ర కార్యదర్శి తాతపూడి ప్రభుదాస్ మాదిగ, నాయకులు అంగలకుర్తి ప్రసాద్, కందుకూరి కృపాకర్, గర్నెపూడి యోహాన్, కర్ణప్రసాద్, మందా సుకుమార్, దుద్దుకూరి అనీల్, అట్లూరి వెంకటేశ్వర్లు, శేషం మోషే బంకా యోబు, రాచేటి ప్రసాద్, దుడ్డు పోతురాజు, మహిళా నాయకురాలు దాసరి మేరీ, జిల్లా కన్వీనర్ ఎన్.నాగలక్ష్మి, ఇండ్లా సంపూర్ణ పాల్గొన్నారు.
పెద్ద సంఖ్యలో మొహరించిన పోలీసులు
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు పెద్ద సంఖ్యలో మొహరించారు. రెండు గేట్ల ముందు బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా శాంతిభద్రతలు పరిరక్షించారు.