కస్తూర్బాల్లో కష్టాల చదువు!

Girls Suffering in kasthurba Gandhi School kurnool - Sakshi

డార్మెట్రీల్లేక తరగతిగదుల్లోనే పడక  

తిరగని ఫ్యాన్లు... అందని దుప్పట్లు  

దోమలతో సతమతమవుతున్న విద్యార్థినులు

ప్రహరీలకు నోచుకోని 17 పాఠశాలలు

కర్నూలు, జూపాడుబంగ్లా: నిరుపేద బాలికలకు విద్యనందిస్తున్న కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఏడేళ్లు గడిచినా నేటికీ   సరైన తరగతి గదుల్లేవు. డార్మెట్రీ, ల్యాబ్, లైబ్రేరీ, ఫ్యాన్లు, డెస్కులు వంటి  వసతుల్లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 53 కస్తూర్బాగాంధీ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 9,852 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ ఏడాది విద్యాసంవత్సరం ముగియవస్తున్నా  దుప్పట్లు, కార్పెట్లు సరఫరా చేయలేదు. దీంతో చలికి విద్యార్థినులు వణికిపోతున్నారు. ఫ్యాన్లు తిరగకపోవటంతో దోమలకాటుకు గురైన విద్యార్థినులు అస్వస్థతకు గురవుతున్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడుబంగ్లా,  పగిడ్యాల, పాములపాడు, కొత్తపల్లి, మిడ్తూరు మండలాల్లో కస్తూర్భాగాంధీ పాఠశాలలుండగా వాటిల్లో 885 మంది విద్యార్థినులు అసౌకర్యాల మధ్యన విద్యను అభ్యసిస్తున్నారు. 

నేలబారు చదువులు
జిల్లాలోని 45 కస్తూర్బా పాఠశాలల్లో చాలీచాలని గదులతో పాటు డార్మెట్రీల్లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యను అభ్యసించిన గదుల్లోనే రాత్రివేళ నిద్రించాల్సిన దుస్థితి నెలకొంది. అరకొరగా ఉన్న తరగతి గదుల్లో డెస్కుల్లేకపోవటంతో విద్యార్థినులు ఉదయం నుంచి సాయంత్రం వరకు బండలపైనే కూర్చొని విద్యను అభ్యసిస్తుండటంతో విద్యార్థినులు అధికంగా వెన్నునొప్పి బారిన పడ్తున్నారు. 

అందని దుప్పట్లు
 ఈ ఏడాది విద్యాసంవత్సరం ముగియవస్తున్నా..కస్తూర్భాగాంధీ పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థినులకు కప్పుకోవటానికి దుప్పట్లు, కిందపర్చుకోవటానికి కార్పెట్లు మంజూరు కాలేదు. విద్యార్థినులు తప్పనిసరైన పరిస్థితుల్లో ఇళ్ల నుంచి దుప్పట్లు తెచ్చుకొన్నారు. తరగతి గదుల్లో ఉన్న ఫ్యాన్లు మరమ్మతులకు గురికాటంతో చలికి, దోమలదాటికి తట్టుకోలేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దోమకాటుకు గురైన విద్యార్థినులు విషజ్వరాల బారిన పడ్తున్నారు. జిల్లాలోని 17 కస్తూర్బాగాంధీ పాఠశాలలకు ప్రహారీల్లేవు. దీంతో తరగతిగదుల్లోంచి బయటకు వచ్చేందుకు విద్యార్థినులు జంకుతున్నారు. దీనికి తోడు ఆటస్థలాల్లేక విద్యార్థినులు ఆటలకుదూరమవుతున్నారు. 

సరైన బడ్జెట్‌ కేటాయింపు లేదు
కస్తూర్బాగాంధీ పాఠశాలల్లో కొంత మేర అసౌకార్యలున్న మాటవాస్తవమే. సరైన బడ్జెట్‌ లేకపోవటం వల్ల పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించలేకపోతున్నాం. 17పాఠశాలలకు ప్రహారీలు మంజూరయ్యాయి. త్వరలో నిర్మింపజేస్తాం. మూడు పాఠశాలల్లో డార్మెట్రీల్లేవు. మరమ్మతులకు గురైన ఫ్యాన్లు వెంటనే మరమ్మత్తులు చేయించాలని సూచించాం. దుప్పట్లు త్వరలో పంపిణీ అయ్యేలా చేస్తాం.
 – నాగేశ్వరి, కస్తూర్బా పాఠశాలల డీసీడీఓ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top