గిరమ్మ ఆత్మఘోష

Giramma Lift Irrigation Project Has Been Soul With Keen - Sakshi

సాక్షి, ద్వారకాతిరుమల : గిరమ్మ ఎత్తిపోతల పథకం ఆత్మ ఘోషిస్తోంది. ఏళ్లు గడుస్తున్నా రైతులకు చుక్క నీరందించలేకపోయానని ఆవేదన చెందుతోంది. ఆ పాపం పాలకులదేనని గిరమ్మ చెప్పలేకపోయినా, బాధిత రైతులు మాత్రం గొంతెత్తి చాటుతున్నారు. పాలకుల నిర్లక్ష్యమే పథకానికి శాపమని అంటున్నారు. ద్వారకాతిరుమల మండలం సీహెచ్‌ పోతేపల్లిలోని గిరమ్మ చెరువు నీటిని ఎత్తిపోతల ద్వారా 7 వేల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు.

2003 నవంబర్‌ 12న అప్పటి, ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు పథకం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. శంకుస్థాపన చేసింది చంద్రబాబే అయినా దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే పంప్‌ హౌస్, పైప్‌లైన్, కాలువ నిర్మాణ పనులన్నీ జరిగాయి. 2010 ఆగస్టులో పథకానికి ట్రైల్‌ రన్‌ కూడా వేశారు. అయితే వైఎస్సార్‌ హఠాన్మరణంతో పథకం పనులు అటకెక్కాయి. ఇదిలా ఉంటే కాలువ నిర్మాణానికి భూములు ఇవ్వమంటూ కొందరు రైతులు కోర్టును ఆశ్రయించడంతో పనులు పూర్తిగా నిలిచిపోయాయి.

కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం, తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం పథకంపై నిర్లక్ష్యం వహించడంతో దాదాపు రూ.8 కోట్లు ఖర్చుతో చేసిన పనులు నిరుపయోగంగా మారాయి. ఇదిలా ఉంటే కోర్టును ఆశ్రయించిన రైతులు ఇటీవల భూములివ్వడంతో కాలువ తవ్వకం పనులు పూర్తిచేసిన అధికారులు ట్రైల్‌రన్‌ కూడా వేశారు. అయితే ఈస్టు యడవల్లి–దొరసానిపాడు గ్రామాల మధ్య సుమారు 3 కిలోమీటర్లు మేర కాలువకు బదులు నిర్మించిన అండర్‌గ్రౌండ్‌ పైప్‌లైన్‌ నీటి ఒత్తిడి తట్టుకోలేక, ధ్వంసం కావడంతో పథకం మళ్లీ మూలకు చేరింది. 

7 వేల ఎకరాలకు..
ద్వారకాతిరుమల, కామవరపుకోట మండలాల్లోని పలు గ్రామాల్లో ఉన్న దాదాపు 7 వేల ఎకరాలకు ఈ పథకం ద్వారా సాగునీరు అందించవచ్చు. ద్వారకాతిరుమల మండలంలోని సీహెచ్‌ పోతేపల్లి, మద్దులగూడెం, కొమ్మర, కోడిగూడెం, దొరసానిపాడు, కామవరపుకోట మండలంలోని ఈస్టు యడవల్లి, వెంకటాపురం, తాడిచర్ల తదితర ప్రాంతాల్లోని పొలాలకు సాగునీరు అందాల్సి ఉంది. అయితే పథకం శంకుస్థాపన జరిగి 15 ఏళ్లు గడిచినా వినియోగంలోకి రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

పథకం : గిరమ్మ ఎత్తిపోతల పథకం
ప్రాంతం : సీహెచ్‌ పోతేపల్లి, ద్వారకాతిరుమల మండలం
శంకుస్థాపన : 2003 నవంబర్‌ 12
వ్యయం : రూ.8 కోట్లు
సాగు లక్ష్యం : 7 వేల ఎకరాలు  


పూడుకుపోతున్న కాలువ  

ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువు
2003లో టీడీపీ హయాంలో ప్రారంభమైన గిరమ్మ ఎత్తిపోతల పథకం ఇప్పటివరకు రైతులకు అక్కరకు రాలేదు. పథకాన్ని దాదాపుగా పూర్తిచేసిన ఘనత దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికే దక్కింది. కొద్దిపాటి పనులు పూర్తిచేస్తే పథకం పూర్తవుతుంది. రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే టీడీపీ నేతలు దీనిపై ఏమాత్రం దృష్టి సారించలేదు. ఇటీవల ద్వారకాతిరుమల మండలంలో జరిగిన ప్రజాసంకల్పయాత్రలో గిరమ్మ పథకం గురించి వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వివరించాం 
– యాచమనేని నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్, సీహెచ్‌ పోతేపల్లి 

కాలువలు పూడుకుపోతున్నాయ్‌
గిరమ్మ ఎత్తిపోతల పథకంలో భాగంగా తవ్విన కాలువలు పలు ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైనట్టు తెలుస్తోంది. మరికొంత మేర పూడుకుపోయి కాలువ వెడల్పు తగ్గిపోయాయి. ఇంకా ఆలస్యమైతే కాలువ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. 2003లో పథకానికి శంకుస్థాపన చేసిన చంద్రబాబు ప్రస్తుతం అధికారంలో ఉన్నా దీనిపై దృష్టి సారించలేదు. కాలువలు, పంప్‌హౌస్‌ యంత్రాలు నిరుపయోగంగా మారాయి. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తేనే రైతులకు మేలు జరుగుతుందని భావిస్తున్నాం. 
– బసివిరెడ్డి వెంకటరామయ్య, రైతు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top