‘సహృదయ’ ఆవేదన!

GGH Authorities Fail To Pay Salaries To Sahrudaya Trust Medical Staff - Sakshi

జీజీహెచ్‌లో ‘సహృదయ’ సిబ్బంది వెతలు

సక్రమంగా వేతనాలు ఇవ్వని అధికారులు

నాలుగేళ్లు గుండె ఆపరేషన్లు చేసిన సహృదయ ట్రస్ట్‌

ఆపరేషన్లతో జాతీయస్థాయిలో జీజీహెచ్‌కు గుర్తింపు

సాక్షి, గుంటూరు: సహృదయ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నవ్యాంధ్రప్రదేశ్‌లో  మొదటిసారిగా గుంటూరు జీజీహెచ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్లు చేసి జాతీయస్థాయిలో జీజీహెచ్‌కు గుర్తింపు తీసుకొచ్చారు. వైద్యరంగంలో సుమారు 65 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన జీజీహెచ్‌లో తొలిసారిగా బైపాస్‌ సర్జరీలు చేసి చరిత్ర సృష్టించారు. సేవా భావంతో పేదలకు కార్పొరేట్‌ వైద్యసేవలను అందించి దేశంమొత్తం జీజీహెచ్‌ గురించి చర్చించుకునేలా చేసిన సహృదయ ట్రస్ట్‌ వైద్య సిబ్బందికి సక్రమంగా వేతనాలు ఇవ్వకుండా ఆస్పత్రి అధికారులు ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

మాతృ సంస్థకు సేవ చేయాలని.. 
సహృదయ హెల్త్, మెడికల్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ను 2007లో ప్రారంభించిన డాక్టర్‌ గోఖలే జీజీహెచ్‌లో 2015 మార్చి నుంచి 2019 మార్చి వరకు ట్రస్ట్‌ ద్వారా సేవలను అందించారు. తాను చదువుకున్న మాతృసంస్థకు తన వంతు సేవ చేయాలని ప్రముఖ గుండెమార్పిడి శస్త్రచికిత్స నిపుణులు, సహృదయ ట్రస్ట్‌ నిర్వాహకులు డాక్టర్‌ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే ముందుకొచ్చారు. ప్రభుత్వ పెద్దల వరకు తానే తిరిగి వైద్యసేవలు అందించేందుకు అవకాశం ఇవ్వాలని 2014లో కోరారు. ఈ లోగా రాష్ట్రం విడిపోవటంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా కూడా గుండె ఆపరేషన్లు చేసే సౌకర్యాలు లేకపోవటంతో నాటి ప్రభుత్వం సహృదయ ట్రస్ట్‌కు జీజీహెచ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు మూడేళ్లపాటు ఒప్పందం చేసుకుంది. దీంతో ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 2015 మార్చి నుంచి 2019 మార్చి వరకు సుమారు 580 మందికి గుండె ఆపరేషన్లు చేసి వారి ప్రాణాలు కాపాడారు. 

నలుగురికి గుండె మార్పిడి ఆపరేషన్లు.. 
బైపాస్‌ సర్జరీలో ఆస్పత్రికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తేవటమే కాకుండా 2016 మే 20న గుంటూరు స్వర్ణభారతినగర్‌కు చెందిన డ్రైవర్‌ ఉప్పు ఏడుకొండలు అనే వ్యక్తికి గుండె మార్పిడి ఆపరేషన్‌ చేశారు. ఈ ఆపరేషన్‌తో జాతీయస్థాయిలో గుండెమార్పిడి ఆపరేషన్‌ చేసిన ఐదో ప్రభుత్వ ఆస్పత్రిగా గుంటూరు జీజీహెచ్‌ రికార్డు సృష్టించింది. తదుపరి 2016 అక్టోబర్‌ 4న హీరామతిభాయ్‌కి గుండె మార్పిడి ఆపరేషన్‌ చేశారు. 2018 ఏప్రిల్‌ 1న విజయవాడ క్రిష్ణలంకకు చెందిన డిగ్రీ విద్యార్థి గుంటూరు సురేష్‌కు గుండె మార్చారు. నెల్లూరుకు చెందిన హరిబాబుకు 2018 నవంబర్‌లో గుండె మార్పిడి చేశారు. ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నాలుగు గుండె మార్పిడి ఆపరేషన్లు జరిగాయి.  

సేవల కొనసాగింపునకు గత ప్రభుత్వం విముఖత.. 
టీడీపీ ప్రభుత్వం సహృదయ ట్రస్ట్‌తో పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌ షిప్‌ విధానంలో మూడేళ్లపాటు 2015లో ఒప్పందం చేసుకుంది. 2018 మార్చితో ప్రభుత్వంతో ట్రస్ట్‌ చేసుకున్న ఒప్పందం గడువు ముగియటంతో తిరిగి తమ వైద్యసేవలను కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని ట్రస్ట్‌ వారు ప్రభుత్వాన్ని లిఖిత పూర్వకంగా కోరారు. ప్రభుత్వం హామీ ఇవ్వకపోటంతో ట్రస్ట్‌ వైద్యులు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు 2019 మార్చిలో ప్రకటించారు. 2019 ఏప్రిల్‌ 1 నుంచి గుంటూరు జీజీహెచ్‌ వైద్యులే గుండె ఆపరేషన్లు చేస్తామని ప్రకటించారు.

వేతనాలు ఇవ్వని ఆస్పత్రి అధికారులు.. 
కాగా సహృదయ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రిక్రూట్‌ అయిన 45 మంది స్టాఫ్‌నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, నాల్గోతరగతి ఉద్యోగులు ఇతర వైద్య సిబ్బంది ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. నాలుగేళ్ల పాటు గుండెజబ్బుల వైద్య విభాగంలో డాక్టర్‌ గోఖలే వద్ద శిక్షణ తీసుకుని పనిచేసిన వైద్య సిబ్బందిని నేడు ఇతర వార్డులకు విధులు నిర్వహించేందుకు పంపిస్తున్నారు. జీజీహెచ్‌ వైద్యులు ఆపరేషన్లు చేయటం ప్రారంభించి మూడునెలలు గడిచినా నలుగురికి మాత్రమే గుండె ఆపరేషన్లు జరిగాయి. దీంతో ఆస్పత్రికి వస్తున్న రోగులు వైద్య సేవల్లో తీవ్ర జాప్యాన్ని తట్టుకోలేక గుండె జబ్బు ముదిరిప్రాణాలు పోతాయనే భయంతో ప్రైవేటు ఆస్పత్రులకు పోతున్నారు. జిల్లా కలెక్టర్‌ ఈ విషయాలపై దృష్టి సారించి పేద రోగుల గుండెలు గాల్లో కలిసి పోకుండా గుండె ఆపరేషన్లు సకాలంలో జరిగేలా చూడాలని పలువురు రోగులు కోరుతున్నారు.

నిధులు ఇవ్వని గత ప్రభుత్వం..
గుండె మార్పిడి ఆపరేషన్లు నాలుగు చేసినా గత ప్రభుత్వం ట్రస్ట్‌కు నిధులు ఇవ్వలేదు. టీడీపీ ప్రభుత్వం ఉచితంగా ఎన్‌టీఆర్‌ వైద్యసేవ ద్వారా జీజీహెచ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్లు చేయిస్తున్నామని పలుమార్లు ప్రకటించి సామాజిక మాధ్యమాల్లో సైతం ప్రసారం చేసింది. దీంతో సుమారు 25 మందికి పైగా నిరుపేదలు గుండె మార్పిడి ఆపరేషన్లు చేయించుకునేందుకు తమ పేర్లు నమోదు చేయించుకుని సిద్ధంగా ఉన్నారు. నాటి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోటంతో గుండె మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు నిధులు లేక ట్రస్ట్‌ వారు ఆపరేషన్లు నిలిపివేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top