ఫీజు బకాయి పేరుతో హాల్‌టికెట్‌ ఆపలేరు | - | Sakshi
Sakshi News home page

ఫీజు బకాయి పేరుతో హాల్‌టికెట్‌ ఆపలేరు

Feb 20 2026 6:40 AM | Updated on Feb 20 2026 6:40 AM

ఫీజు బకాయి పేరుతో హాల్‌టికెట్‌ ఆపలేరు

ఫీజు బకాయి పేరుతో హాల్‌టికెట్‌ ఆపలేరు

వెబ్‌సైట్‌తోపాటు వాట్సాప్‌ ద్వారా పొందే సదుపాయం ప్రిన్సిపాల్‌ సంతకం, కళాశాల స్టాంప్‌ కూడా అవసరం లేదు డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌ టికెట్‌తో పరీక్ష కేంద్రాలకు వెళ్లొచ్చు ఈ నెల 23 నుంచి ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు గుంటూరు జిల్లాలో 87 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు హాజరుకానున్న 68,941 మంది విద్యార్థులు

గుంటూరు ఎడ్యుకేషన్‌ : ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షలు రాసేందుకు విద్యార్థులు తాము డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌ టిక్కెట్‌తో నేరుగా పరీక్ష కేంద్రాలకు వెళ్లొచ్చు. ఫీజు బకాయిల పేరుతో హాల్‌ టిక్కెట్‌ను కళాశాలల యాజమాన్యాలు నిరాకరించేందుకు వీల్లేకుండా ఇంటర్మీడియెట్‌ విద్యామండలి మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెల 23వ తేదీ నుంచి జరగనున్న పబ్లిక్‌ పరీక్షలకు గుంటూరు జిల్లావ్యాప్తంగా 87 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలకు 68,941 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో జూనియర్‌ ఇంటర్‌ 35,485, సీనియర్‌ ఇంటర్‌ 32,184 మంది విద్యార్థులతోపాటు గతంలో ఒకసారి తప్పిన విద్యార్థులు 1,272 మంది ఉన్నారు. పరీక్షల వ్యవధి దగ్గర పడుతున్న దృష్ట్యా, విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకునే పనిలో నిమగ్నమైన ప్రైవేటు జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు హాల్‌ టిక్కెట్లను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసిన సంఘటనలు ఏటా చోటు చేసుకుంటున్నాయి. ఆయా సమస్యలపై దృష్టి సారించిన ఇంటర్మీడియెట్‌ బోర్డు హాల్‌ టిక్కెట్లను విడుదల చేసి వాటిని బోర్డు వెబ్‌సైట్‌లో ఉంచింది.

హాల్‌ టిక్కెట్లు పొందేందుకు

ఇంటర్‌ ప్రథమ సంవత్సర పరీక్షలు రాస్తున్న విద్యార్థులు http://bie.ap.gov.in సైట్‌లో లాగిన్‌ కావాలి. టెన్త్‌ హాల్‌ టిక్కెట్‌ నంబరు ఎంటర్‌ చేసి ఇంటర్‌ హాల్‌ టిక్కెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థులు ప్రథమ సంవత్సర హాల్‌ టిక్కెట్‌ నంబరు, ఆధార్‌, పుట్టిన తేదీ వివరాలతో హాల్‌ టిక్కెట్‌ పొందవచ్చు. మనమిత్ర వాట్పాప్‌ నంబరు 95523 00009 కు ‘ఏజీ’ అని మెసేజ్‌ పంపడం ద్వారా హాల్‌ టిక్కెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ప్రిన్సిపాల్‌ సంతకం లేకున్నా ఓకే

వెబ్‌సైట్‌, వాట్సాప్‌ ద్వారా హాల్‌ టిక్కెట్లు పొందిన విద్యార్థులు తమ వ్యక్తిగత వివరాలతోపాటు పరీక్షల షెడ్యూల్‌, సబ్జెక్టుల వివరాలను సరి చూసుకోవాలి. హాల్‌ టిక్కెట్‌పై సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌ సంతకం, కళాశాల స్టాంప్‌ అవసరం లేకుండా నేరుగా పరీక్షలు రాసేందుకు హాజరు కావచ్చు. హాల్‌ టిక్కెట్‌పై ఇచ్చిన పరీక్ష కేంద్రానికి ముందుగానే స్వయంగా వెళ్లి పరిశీలించాలి. తద్వారా పరీక్షలు జరిగే రోజుల్లో తమ ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి చేరుకునేందుకు ఇబ్బందులు పడకుండా చూసుకోవచ్చు. దీంతోపాటు పరీక్ష సమయానికి కనీసం అరగంట ముందుగానే విద్యార్థులు వారికి కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్మీడియెట్‌ బోర్డు విడుదల చేసిన మార్గదర్శకాల్లో పొందుపర్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement