కత్తితో పొడిచి భర్తను చంపిన భార్య
మంగళగిరి టౌన్: భర్తను భార్య కత్తితో పొడిచి హత్య చేసి న సంఘటన మంగళగిరి పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం... మంగళగిరి పట్టణ పరిధిలోని టిడ్కో గృహ సముదాయంలో బీ13 బ్లాక్‌లో అహమ్మద్ (28), క్రాంతి దంపతులు నివాసం ఉంటున్నారు. ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అహమ్మద్ ఏసీ మెకానిక్‌గా, క్రాంతి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల పలుమార్లు గొడవలు పడి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినట్లు సమాచారం. కౌన్సెలింగ్ ఇచ్చి పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వేర్వేరుగా ఇద్దరూ ఉపవాసాలు ఉంటూ రోజూ భక్తి గీతాలు వినేవారు. క్రాంతి తన ఫోన్‌లో దేవుడి పాటలు వింటుండగా అహమ్మద్ సౌండ్ తగ్గించమని చెప్పాడు. ఎంతకీ వినకపోవడంతో గురువారం మధ్యాహ్నం వాగ్వివాదం చెలరేగింది. గొడవ తీవ్రరూపం దాల్చడంతో క్రాంతి వంటగదిలోని కూరగాయలు కోసే కత్తితో క్షణికావేశంలో భర్తను పొడిచింది. అహమ్మద్ సొమ్మసిల్లి పడిపోయాడు. క్రాంతి వెంటనే అతడి తల్లికి ఫోన్ కాల్ చేసింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చినకాకానిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి 108లో తీసుకువెళ్లారు. తర్వాత విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగానే అహమ్మద్ మృతి చెందాడు. మంగళగిరి పట్టణ పోలీసులకు మృతుడి బంధువులు ఫిర్యాదు చేశారు. క్షణికావేశమే కారణమా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనా అనే కోణంలో పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్రాంతిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు పట్టణ పోలీసులు తెలిపారు.


