సిలిండర్‌ ధర... పేలుతోంది

Gas Cylinder Price hikes - Sakshi

రూ.1010కి చేరిన వంటగ్యాస్‌ ధర

కొనలేక సతమతమవుతున్న వినియోగదారులు

తూర్పుగోదావరి,కాకినాడ సిటీ: అక్టోబర్‌ నెలలో మళ్లీ రూ.2.94 ధర పెరగడంతో ప్రస్తుతం గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1010కి చేరింది. సిలిండర్‌ ధర ఇంత భారీగా పెరగడం ఇదే ప్రథమం. అదే పనిగా సిలిండర్‌ ధర ప్రతి నెలా పెరుగుతుండడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వం నుంచి వివిధ గ్యాస్‌ ఏజెన్సీల ద్వారా సిలిండర్‌ సరఫరాకు ప్రస్తుతం ధర రూ.980, ఇతర ఛార్జీలు రూ.30 కలిపి రూ.1010కి చేరింది. రోజు రోజుకూ పెరుగుతున్న వంట గ్యాస్‌ ధరలతో సామాన్యుడి జేబుకు చిల్లుపడుతోంది. జిల్లాలో 79 గ్యాస్‌ ఏజెన్సీలున్నాయి. ఈ ఏజెన్సీల్లో 15,89,740 మంది వినియోగదారులున్నారు. వీరిలో ‘దీపం పథకం’ ద్వారా వంట గ్యాస్‌నువాడుతున్న పేదలు 8 లక్షల 92వేల మందికి పైగా   ఉన్నారు. తాజాగా పెరిగిన ధరతో రూ.614 సబ్సిడీ సిలిండర్‌కు వినియోగదారులు చెల్లించాల్సి వస్తోంది. 2014తో పోలిస్తే రూ.216 అధికం. సబ్సిడీయేతర సిలిండర్‌ వినియోగదారులు రూ.980 ఖర్చు చేయాల్సి వస్తోంది. సరఫరా చేసినందుకు ఏజెన్సీని బట్టి రూ.30 నుంచి రూ.60 వరకూ ఇవ్వాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు.

తప్పని వాతలు...
జీఎస్టీ అమలు చేస్తున్న సమయంలో వంట గ్యాస్‌పై పన్ను విధించేదిలేని కేంద్రం మాట ఇచ్చింది. దీంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే సబ్సీడీ సిలిండర్‌పైనే ప్రతి నెలా ధర పెంచుతూ ప్రజలపై మోయలేని భారం వేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలే నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలు వచ్చి ఆకాశాన్నంటుతున్న తరుణంలో వంట గ్యాస్‌ ధరలు సైతం అమాంతం పెరుగుతుండడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీపం పథకం అంటూ అందరికీ గ్యాస్‌ సిలిండర్లు ఇచ్చి ఇలా మంటలు పెట్టడం సరికాదని వాపోతున్నారు. ఇలాగే పెంచుకుంటూ పోతే కట్టెల పొయ్యిమీదే వంట చేయాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

2014 నుంచి ఇప్పటి వరకు రూ. 216 పెంపు...
ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాత రూ. 216 గ్యాస్‌ ధర పెరిగింది. 2014లో రూ.414 ఉంటే ప్రస్తుతం సబ్సిడీతో వినియోగదారులు రూ.630 చెల్లించాల్సి వస్తోంది.
సబ్సిడీ పూర్తిగా తొలగించుకునేందుకు ప్రభుత్వం ధరలు పెంచుతోందని ప్రజలు, వివిధ రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి. అసలే పెట్రోలు, డీజిల్‌ ధరలు సామాన్యుడిపై గుదిబండలా మారగా గ్యాస్‌ ధరలు కూడా పెరగడంతో విలవిల్లాడుతున్నారు.

గ్యాస్‌ ధరలు తగ్గించాలి...
గ్యాస్‌ ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. ఇలా అయితే సామాన్యులు ఎలా బతకాలి. నిత్యావసర ధరలూ ఆకాశన్నంటిన నేపథ్యంలో గ్యాస్‌ సైతం పెరగడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ప్రభుత్వం స్పందించి ధర తగ్గించాలి.   – వై. దుర్గాభవాని, ఉండూరు

సబ్సిడీ వెంటనే జమ చేయాలి
గ్యాస్‌ సిలిండర్‌ ధర భారీగా పెంచడం వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సిలిండరుకు ప్రభుత్వం చెల్లించే సబ్సిడీ నెలల తరబడి వినియోగదారుల ఖాతాలకు జమ కావడం లేదు. సిలిండరు కొనుగోలు చేసిన వెంటనే సబ్సిడీ జమ చేస్తే కొంత మేర ఆర్థిక భారం తగ్గుతుంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.– కెఎస్‌ శ్రీనివాస్,  సీపీఎం జిల్లా కార్యదర్శి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top