గ్యాస్ ఏజెన్సీల మంజూరుకు రాజకీయ గ్రహణం! | Gas agencies distributing political issue | Sakshi
Sakshi News home page

గ్యాస్ ఏజెన్సీల మంజూరుకు రాజకీయ గ్రహణం!

Sep 13 2014 3:20 AM | Updated on Sep 2 2017 1:16 PM

గ్యాస్ ఏజెన్సీల మంజూరుకు రాజకీయ గ్రహణం పట్టింది. దీంతో కొత్త ఏజెన్సీల ఏర్పాటు కోసం మూడు చమురు కంపెనీలు ఇచ్చిన నోటిఫికేషన్ రెండేళ్లుగా కార్యరూపం దాల్చడంలేదు.

రెండేళ్లుగా కార్యరూపం దాల్చని నోటిఫికేషన్
ఏపీ, తెలంగాణల్లో 499 ఎల్‌పీజీ ఏజెన్సీల కేటాయింపుపై నీలినీడలు
రాజకీయ పలుకుబడితో అడ్డుపడుతున్న పాత ఏజెన్సీల నిర్వాహకులు

 
విజయవాడ బ్యూరో: గ్యాస్ ఏజెన్సీల మంజూరుకు రాజకీయ గ్రహణం పట్టింది. దీంతో కొత్త ఏజెన్సీల ఏర్పాటు కోసం మూడు చమురు కంపెనీలు ఇచ్చిన నోటిఫికేషన్ రెండేళ్లుగా కార్యరూపం దాల్చడంలేదు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 499 కొత్త ఏజెన్సీల మంజూరుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎల్‌పీజీ కొత్త ఏజెన్సీలు ఏర్పాటు చేస్తే తమ ఆదాయానికి గండి పడుతుందని భావించిన పాత డీలర్లు అడ్డుపడుతుండటంతో ఈ వ్యవహారం కొలిక్కిరావట్లేదని తెలుస్తోంది. ఈ వ్యవహారం ఇప్పుడు కేంద్ర పెట్రోలియం శాఖ పరిధిలోకి చేరింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓఎల్ కంపెనీలు 499 కొత్త ఏజెన్సీల డీలర్‌షిప్‌ల కోసం 2012లో నోటిఫికేషన్ జారీ చేశాయి. అప్పట్లో పాత డీలర్లు రాజకీయ పలుకుబడితో దానిని రద్దు చేయించగలిగారు. తర్వాత అవే ఏజెన్సీలకు సంబంధించి 2013 సెప్టెంబర్ 15న మరోసారి నోటిఫికేషన్ జారీ అయింది.

కొత్త ఏజెన్సీల కోసం వేలసంఖ్యలో ఔత్సాహికులు దరఖాస్తు చేశారు. అయితే కొత్త ఏజెన్సీలిస్తే తాము తీవ్రంగా నష్టపోతామంటూ పాత ఏజెన్సీల నిర్వాహకులు అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు. వీరి వాదనను పెట్రోలియం శాఖతోపాటు మూడు చమురు కంపెనీలు తోసిపుచ్చాయి. ‘‘గతంలో ఐదారు వేలు వంటగ్యాస్ కనెక్షన్లున్న పాత ఏజెన్సీల్లో ఇప్పుడు 25 వేల నుంచి 40 వేల వరకు పెరిగాయి. అందువల్ల వినియోగదారులకు సకాలంలో గ్యాస్ సిలిండర్లు అందట్లేదు. వీలైనంత ఎక్కువ ఏజెన్సీలు ఏర్పాటు చేసి వినియోగదారులకు భారాన్ని తగ్గించాలన్నదే మా ఉద్దేశం’’ అని పేర్కొంటూ వాదనలు వినిపించాయి. దీంతో ఎల్‌పీజీ కొత్త ఏజెన్సీల నియామకాన్ని సమర్థిస్తూ గత నెలలో హైకోర్టు తీర్పు చెప్పింది.

పట్టువదలని పాత డీలర్లు..: హైకోర్టు తీర్పుచెప్పినా పాత ఏజెన్సీల నిర్వాహకులు పట్టువదల్లేదు.  ఏకంగా కేంద్రంలోని పెద్దలపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. తమకు మద్దతుగా ఏపీ, తెలంగాణల్లో 30 మంది ఎంపీల సంతకాలను సైతం సేకరించి కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్రప్రధాన్‌కు సమర్పించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఏజెన్సీల ఏర్పాటు ఇప్పుడు కేంద్రం నిర్ణయంపై ఆధారపడి ఉంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement