కస్టడీకి గణేష్‌ డ్రైవర్‌ చంద్రశేఖర్‌? | Ganesh driver Chandrasekhar for custody | Sakshi
Sakshi News home page

కస్టడీకి గణేష్‌ డ్రైవర్‌ చంద్రశేఖర్‌?

Aug 31 2017 5:46 AM | Updated on Nov 6 2018 4:42 PM

కస్టడీకి గణేష్‌ డ్రైవర్‌ చంద్రశేఖర్‌? - Sakshi

కస్టడీకి గణేష్‌ డ్రైవర్‌ చంద్రశేఖర్‌?

రికార్డుల ట్యాంపరింగ్‌లో కీలక నిందితుడైన ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్‌ జీఎల్‌ గణేశ్వరరావు(గణేష్‌) డ్రైవర్‌ దామోదర చంద్రశేఖర్‌ను కస్టడీ కోరుతూ సిట్‌.. కోర్టులో పిటీషన్‌ వేసింది.

 గణేష్‌ ఆగడాలపై నిజాలు రాబట్టే ప్రయత్నం
 నేడో రేపో కోర్టు నుంచి ఉత్తర్వులు


సాక్షి, విశాఖపట్నం: రికార్డుల ట్యాంపరింగ్‌లో కీలక నిందితుడైన ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్‌ జీఎల్‌ గణేశ్వరరావు(గణేష్‌) డ్రైవర్‌ దామోదర చంద్రశేఖర్‌ను కస్టడీ కోరుతూ సిట్‌.. కోర్టులో పిటీషన్‌ వేసింది. ఒకటి రెండ్రోజుల్లో ఆయన్ని కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. అంతకుముందు గణేష్‌ను ఆరు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని సిట్‌ పోలీసులు విచారించారు.

నకిలీ డాక్యుమెంట్లు, రికార్డుల ద్వారా సుమారు 3,900 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు చేతుల మారడంలో గణేష్‌ కీలకపాత్ర పోషించాడని అతడ్ని అరెస్ట్‌ చేసిన సమయంలో సీపీ యోగానంద్‌ ప్రకటించారు. వందలాది పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్‌ డీడ్స్, తహసీల్దార్ల సంతకాలు, 1బీ రిజిస్ట్రార్లు, ఎఫ్‌ఎంబీలు, 200 మందికి పైగా ప్రైవేటు వ్యక్తుల ఫొటో ఆల్బమ్‌ ఇలా పెద్ద ఎత్తున విలువైన రికార్డులను గణేష్‌ డ్రైవర్‌ చంద్రశేఖర్‌ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ రికార్డులతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అసలు చంద్రశేఖర్‌తో తనకు ఎలాంటి పరిచయం లేదని కస్టడీలో సిట్‌ పోలీసుల ఎదుట గణేష్‌ స్పష్టం చేసినట్టు తెలియవచ్చింది. ఆరు రోజుల పాటు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా.. తనకు సంబంధం లేదని గణేష్‌ సమాధానాలు చెప్పినట్టుగా సిట్‌ వర్గాల సమాచారం. ఆశించిన స్థాయిలో కీలక సమాచారం రాబట్టలేకపోవడంతో లై డిటెక్టర్‌ పరీక్ష ద్వారా నిజాలు రాబట్టాలన్న ఆలోచన సిట్‌ చేసింది. ఆ దిశగా కోర్టు అనుమతికోరేందుకు కూడా సిద్ధపడింది.

మరోపక్క గణేష్‌ డ్రైవర్‌గా పనిచేసినట్టుగా చెబుతున్న చంద్రశేఖర్‌ నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు ఐదు రోజుల కస్టడీ కోరుతూ కోర్టులో పిటీషన్‌ వేసినట్టుగా చెబుతున్నారు. కస్టడీ కోరిన విషయం వాస్తవమేనని, అయితే కోర్టు నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రానందున ఈరోజు సిట్‌ కస్టడీకి చంద్రశేఖర్‌ను అప్పగించలేదని జైలు వర్గాలు తెలిపాయి. అగనంపూడిలోని చంద్రశేఖర్‌ ఇంటి వద్ద లభించిన రికార్డులు, డాక్యుమెంట్లు ఎక్కడ నుంచి వచ్చాయి? వీటిని దాచేందుకు గణేష్‌ ఎందుకు చంద్రశేఖర్‌ ఇంటిని ఎంచుకున్నాడు? ఎన్నాళ్ల క్రితం దాచాడు? వీటిని ఉప యోగించి గణేష్‌తో కలిసి ఏం చేసారు? వంటి సమాచారాన్ని చంద్రశేఖర్‌ నుంచి రాబట్టేందుకు సిట్‌ ప్రయత్నిస్తోంది.

సిట్‌ కొనసాగింపుపై జారీ కానీ జీవో
సిట్‌ కొనసాగింపుపై బుధవారం కూడా జీవో జారీ కాలేదు. అయినా విచారణను మాత్రం ఎక్కడా ఆపడం లేదని, తమ పని తాము చేసుకుపోతున్నామని సిట్‌ వర్గాలు చెబుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement