‘అమ్మ’లు ఆగ్రహించారు | funds not released under the janani suraksha yojana scheme | Sakshi
Sakshi News home page

‘అమ్మ’లు ఆగ్రహించారు

Jan 24 2014 11:29 PM | Updated on Mar 28 2018 10:59 AM

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు చేయించుకోవడం క్షేమం, పైగా జననీ సురక్ష యోజన కింద డబ్బులు కూడా ఇస్తామన్న ప్రభుత్వం మాట తప్పింది.

తాండూరు టౌన్, న్యూస్‌లైన్:  ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు చేయించుకోవడం క్షేమం, పైగా జననీ సురక్ష యోజన కింద డబ్బులు కూడా ఇస్తామన్న ప్రభుత్వం మాట తప్పింది. గ్రామీణ ప్రాంత మహిళలకు రూ.వెయ్యి, పట్టణ ప్రాంతం వారికి రూ.600లు నజరానా ఇస్తున్నామంటున్న ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైనట్టు శుక్రవారం జిల్లా ఆస్పత్రి వద్ద మహిళల ఆందోళనతో బట్టబయలైంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు చేయించుకున్నందుకు చెప్పిన ప్రకారం డబ్బులు ఇవ్వకపోవడంతో తల్లులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సుమారు 200మందికి పైగా బాలింతలు చంటిపిల్లల సహా ఆస్పత్రిలోని పీపీ (పోస్ట్‌పార్ట్) యూనిట్‌కు వచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేచి చూసినా ఆస్పత్రి సిబ్బంది ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. దీంతో ఓపిక నశించిన బాలింతలు చిన్నపిల్లలను చంకన వేసుకొని ఆస్పత్రి ఎదుట నడిరోడ్డుపై గంటసేపు బైఠాయించి నిరసన తెలిపారు.
 దీంతో అటువైపుగా వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రసూతి డబ్బుల కోసం మూడు నెలలుగా తిరుగుతున్నా రేపుమాపంటూ అధికారులు తిప్పుంటున్నారని పలువురు మహిళలు ఆరోపించారు. ఊళ్ల నుంచి నెలకు నాలుగుసార్లు ఆస్పత్రి రావడం వల్ల ప్రయాణ ఖర్చులు భారమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

 బాలింతలకు వెంటవెంటనే డబ్బులు ఇవ్వాలని ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. డబ్బులు ఇచ్చేదాకా రోడ్డుపై నుంచి కదిలేది లేదని భీష్మించుకున్నారు. సమాచారం తెలిసిన పట్టణ ఎస్సై ప్రణయ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పీపీ యూనిట్ ఇన్‌చార్జి డాక్టర్ శ్రీనివాస్ అందుబాటులో లేకపోవడంతో సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం వారంలో ఒకరోజు కేవలం వందమంది బాలింతలకు చెక్కులు అందజేస్తున్నారు. మిగిలిన వారు కనీసం మూడుసార్లయినా ఆస్పత్రి చుట్టూ తిరగాల్సి వస్తోంది. తాజాగా శుక్రవారం ఆస్పత్రి అకౌంట్‌లో కేవలం రూ.60వేలు మాత్రమే ఉన్నాయి.

దీంతో జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటరమణప్ప బాలింతలకు వద్దకు వెళ్లి మాట్లాడారు.  వచ్చే శుక్రవారం అందరికీ డబ్బులు అందేలా చూస్తానని హామీ ఇవ్వడంతో బాలింతలు ఆందోళన విరమించారు. అయితే బాలింతల వివరాలను ఉన్నతాధికారులకు పంపి నిధులు మంజూరు చేయించుకోవడంలో పీపీ యూనిట్ ఇన్‌చార్జి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కనీసం బ్యాంకు నుంచి చెక్కుబుక్కులు తెప్పించుకోవడంలోనూ విఫలమయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు.
 
 వారానికోసారి వస్తున్నా...
 కాన్పు అయి నెలరోజులు దాటింది. ఇంకా డబ్బులు ఇవ్వలేదు. వారానికోసారి వచ్చి పోతున్నా. ఎందుకు తిప్పుకుంటున్నరో అర్థం కావట్లే. నెల రోజు బాలింతను ఇట్లా తిప్పుకోవడం ఏంది? వీళ్లకు కనికరం లేదా? వచ్చిపోవుడుకే చాలా పైసలు అయితన్నయ్. - సాలమ్మ, తాండూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement