పరిమళించిన మానవత్వం

Frinds And Railway Keymen Helps Train Accident Injured Person Srikakulam - Sakshi

రైలు నుంచి జారిపడిన వలస కూలీ

ఆదుకున్న రైల్వే కీ మెన్,తోటి స్నేహితులు

పలాస: జీవనోపాధి కోసం చెన్నైకు వలస వెళ్తూ ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడిన ఆ యువకుడిని రైల్వే కీ మెన్, తోటి స్నేహితులు కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. త్రిపురలోని అగర్తలాకు చెందిన వలస కూలీ టి.ఎన్‌.రియాన్స్‌ వివేకా ఎక్స్‌ప్రెస్‌లో చెన్నైకు బట్టల మిల్లులో పనిచేయడానికి తోటి స్నేహితులతో కలిసి వెళ్తున్నాడు. సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో సుమ్మాదేవి – పలాస రైల్వే స్టేషన్‌ల మధ్య ప్రమాదవశాత్తు జారిపడిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న అతని నలుగురు స్నేహితులు పలాస రైల్వే స్టేషన్‌లో దిగి అర్ధ రాత్రి సమయంలో రైలు పట్టాలపై నడుచుకుంటూ అతన్ని వెతకడానికి బయలుదేరారు. పలాస నుంచి కొర్లాం (బారువా) రైల్వే స్టేషన్‌ వరకు నడుచుకుంటూ వెళ్లారు.

అయినా అతని ఆచూకీ లభించకపోవడంతో అదే రైలు పట్టాలపై తిరిగి పలాస వైపు వచ్చారు. అప్పటికి తెల్లవారింది. ఈ సమయంలో పలాస నుంచి సుమ్మాదేవి స్టేషన్ల మధ్య కీ మెన్‌గా పనిచేస్తున్న వంకల కృష్ణారావు తన విధుల్లో భాగంగా రైలు పట్టాలపై నడుచుకుంటూ వస్తున్నారు. పలాస మండలం ఎంకాయ చెరువు సమీపంలో పట్టాల పక్కన ఉన్న తుప్పల్లో తీవ్ర గాయాలతో రియాన్స్‌ పడి ఉండటాన్ని చూశారు. ఈ విషయాన్ని పలాస రైల్వే స్టేసన్‌ మేనేజర్‌కు సమాచారం అందించారు. రియాన్స్‌ ఇచ్చిన సమాచారం మేరకు అతని స్నేహితులకు ఫోన్‌ చేశారు. అప్పటికి అతని స్నేహితులు వెతుక్కుంటూ నీలావతి రైల్వే గేటు సమీపంలో ఉన్నారు. దీంతో కృష్ణారావు తన తోటి ఉద్యోగులు రవి, జగన్‌లకు బైకులిచ్చి పంపించారు. వారిని అక్కడకు తీసుకొని రావడంతోపాటు 108కు కూడా సమాచారం ఇచ్చారు. సుమారు కిలో మీటరు దూరం రియాన్స్‌ స్నేహితులు అతన్ని వీపుమీద మోసుకుంటూ 108 వద్దకు తీసుకువెళ్లారు. పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం రియాన్స్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పలాస రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ కోదండరావు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రమాదంలో ఇరుక్కున్న వలస కూలీతోపాటు అతన్ని స్నేహితులు పడిన శ్రమ, స్నేహబంధాన్ని చూసిన వారి హృదయాలు ద్రవించాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top