అమ్మ లేదు.. నాన్న రాడు | four people died in road accident | Sakshi
Sakshi News home page

అమ్మ లేదు.. నాన్న రాడు

Mar 26 2014 4:25 AM | Updated on Oct 22 2018 7:42 PM

44వ నంబరు జాతీయ రహదారి రక్తమోడింది.. జిల్లాలో రెండు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాతపడ్డారు.. వీరంతా ఇతర జిల్లాల వారే..

44వ నంబరు జాతీయ రహదారి రక్తమోడింది.. జిల్లాలో రెండు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాతపడ్డారు.. వీరంతా ఇతర జిల్లాల వారే.. ఓ సంఘటనలో స్థానికంగా వాతావరణం అనుకూలించక పంటలు పండకపోవడంతో వలస వచ్చి ఇద్దరు మృత్యువాతపడగా, మరో సంఘటనలో దంపతులు తమ స్వగ్రామానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.. దీంతో ఆ కుటుంబాల్లో విషాదం అలుముకుంది..
 

 జడ్చర్ల టౌన్, న్యూస్‌లైన్ : అతను ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీరు.. భార్యాపిల్లలతో కలిసి స్వగ్రామానికి వెళ్లి కొన్ని రోజులపాటు ఇంటి వద్ద తల్లిదండ్రులతో సంతోషంగా గడుపుదామనుకున్నాడు.. అందులో భాగంగా కారులో బయలుదేరగా మార్గమధ్యంలోనే దంపతులను మృత్యువు కబళించింది.. అదృష్టవశాత్తు ఇద్దరు చిన్నారులు మాత్రమే త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.. హృదయ విదారకమైన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం వాల్మీకిపురం గ్రామపంచాయతీ పరిధిలోని ఎర్తమానుపల్లికి చెందిన కిషన్‌కుమార్‌రెడ్డి (35) హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు.
 
 ఈయనకు భార్య శ్రీదేవి (30), కుమార్తె పరిణీతి, కుమారుడు చేతన్ ఉన్నారు. కొన్నాళ్లుగా భార్యాపిల్లలతో కలిసి నగరంలోనే నివాసముంటున్నాడు. ఈ క్రమంలోనే స్వగ్రామంలో ఉంటున్న తన తల్లిదండ్రులతో కొన్ని రోజుల పాటు సంతోషంగా గడుపుదామని తలంచాడు. దీంతో కారులో నలుగురూ మంగళవారం మధ్యాహ్నం బయలుదేరారు. 44వ నంబరు జాతీయ రహదారిపై జడ్చర్ల మండలం గొల్లపల్లి శివారులోకి చేరుకోగానే అదుపుతప్పి బోల్తాపడటంతో దంపతులకు తీవ్ర, చిన్నారులకు స్వల్పగాయాలయ్యాయి.
 
 ఇది గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే దంపతులు మృతి చెందారు. ఈ విషయమై పోలీసులకు సమాచారమివ్వడంతో సంఘటన స్థలాన్ని సీఐ జంగయ్య పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు దుర్మరం చెందడంతో చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారింది.
 
 జడ్చర్ల టౌన్, న్యూస్‌లైన్ :వారు వర్షాభావ పరిస్థితులతో పంటలు పండక నాలుగు రాళ్లు సంపాదించుకుందామని బతుకుబండి లాగుదామని అనంతరం జిల్లా నుంచి పాలమూరుకు వలస వచ్చారు.. జిల్లాలోని వివిధ గ్రామాల్లో తిరుగుతూ నైటీల వ్యాపారం చేసుకుంటున్నారు.. ఇక్కడా అది అంతంతమాత్రమే సాగటంతో మరో జిల్లాకు వెళదామనుకున్నారు.. అంతలోనే జరిగినరోడ్డు ప్రమాదంలో ఇద్దరి బతుకులు ‘తెల్లారి’పోగా, మరో ముగ్గురికి  గాయాల్యయి.. హృదయ విదారకమైన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.
 
 అనంతపురం జిల్లా గుత్తి మండలం చర్లోనిపల్లికి చెందిన సూర్యనారాయణ (45), సూర్యప్రకాష్ (20), అంకన్న, సుధాకర్ వృత్తిరీత్యా రైతులు. ఈసారి వర్షాభావ పరిస్థితులతో వారు తమకున్న పొలాల్లో వేసిన పంటలు సరిగా పండలేదు. దీంతో ఇతర జిల్లాలకు వలస వెళ్లి నైటీల వ్యాపారమైనా చేసి జీవనం సాగిద్దామనుకున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 22వ తేదీ రాత్రి పెబ్బేరుకు చేరుకుని సోమవారం సాయంత్రం వరకు వివిధ గ్రామాలు తిరిగారు. అయితే వ్యాపారం సరిగా సాగకపోవటంతో అర్ధరాత్రి జడ్చర్ల క్రాస్‌రోడ్డుకు చేరుకున్నారు. అక్కడి నుంచి నల్లగొండ జిల్లాకు బయలు దేరేందుకు సుమారు రెండు గంటలకు బాలానగర్ నుంచి మిర్యాలగూడకు క్రషర్ చిప్స్‌ను తీసుకెళున్న లారీలో ఎక్కారు. పట్టణ శివారులోకి వెళ్లగానే వాహనం అదుపుతప్పి బోల్తాపడటంతో సూ ర్యనారాయణ, సూర్యప్రకాష్ అక్కడికక్కడే మృతిచెందారు. ఇదే ప్రమాదంలో మిగతా ఇద్దరితో పాటు డ్రైవర్ వెంకట్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.
 
 స్థానికులు గమనించి వెంటనే క్షతగాత్రులను బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారమివ్వడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం ఉదయం బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఇక్కడికి చేరుకుని బోరుమన్నారు. మృతుల్లో సూర్యప్రకాష్‌కు వివాహం కాలేదు. సూర్యనారాయణకు భార్య సుంకమ్మతో పాటు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అనంతరం డ్రైవర్‌ను జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement