మండల పరిధిలోని సంకిలి చక్కెర కర్మాగారం ప్రధాన గేటు ఎదురుగా ఆదివారం పాలకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, వ్యాన్ ఢీకొన్న ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
రేగిడి: మండల పరిధిలోని సంకిలి చక్కెర కర్మాగారం ప్రధాన గేటు ఎదురుగా ఆదివారం పాలకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, వ్యాన్ ఢీకొన్న ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ఇన్‌చార్జి ఎస్సై ఎం.చంద్రమౌళి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రేగిడి మండలం పెదశిర్లాం గ్రామానికి చెందిన పెళ్లి వారు పాలకొండ మండలం ఓనె గ్రామానికి పిలుపులు నిమిత్తం ప్రైవేట్ వాహనంలో బయల్దేరారు. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం నుంచి పాలకొండ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, వీరు ప్రయాణిస్తున్న వాహనం ఢీకొన్నాయి.
ఈ ఘటనలో పెదశిర్లాం గ్రామానికి చెందిన సీహెచ్ నీలవేణి, సీహెచ్ చిన్నమ్మడు, రెడ్డి సూరీడమ్మ, రెడ్డి జయలకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 ద్వారా రాజాం సామాజిక ఆస్పత్రికి, అక్కడ నుంచి ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో పాలకొండ–విశాఖ ప్రధాన రహదారిలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. పాలకొండ సీఐ సూరినాయుడు, ఇన్‌చార్జి ఎస్సై మీసాల చంద్రమౌళి, రేగిడి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. కేసు నమోదు చేశారు.