శ్రీవారికి నూతన ప్రధాన అర్చకులు | Sakshi
Sakshi News home page

శ్రీవారికి నూతన ప్రధాన అర్చకులు

Published Sat, May 19 2018 3:22 AM

Four Chief Priest took charge in TTD - Sakshi

సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి పూజా కైంకర్యాల నిర్వహణకోసం కొత్తగా నలుగురు ప్రధాన అర్చకులు నియమితులయ్యారు. అనూహ్య పరిణామాల మధ్య గొల్లపల్లి కుటుంబం నుంచి వేణుగోపాల దీక్షితులు, పైడిపల్లి కుటుంబం నుంచి కృష్ణ శేషసాయి దీక్షితులు, పెద్దింటి వంశం నుంచి శ్రీనివాస దీక్షితులు, తిరుపతమ్మ కుటుంబం నుంచి గోవిందరాజ దీక్షితులను ఆలయ ప్రధాన అర్చకులుగా నియమిస్తూ టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. టీటీడీలో 65 ఏళ్లు దాటిన అర్చకులను విధుల నుంచి తొలగించి ఉద్యోగ విరమణ వర్తింపజేయాలన్న నిర్ణయం నేపథ్యంలో ఆలయ ప్రధానార్చక కుటుంబాలకు చెందిన రమణ దీక్షితులు, నరసింహదీక్షితులు, శ్రీనివాస దీక్షితులు, నారాయణ దీక్షితుల స్థానంలో వీరిని నియమించారు.

ఆ మేరకు వీరు నలుగురూ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మొదటిరోజు వంతుగా ప్రధానార్చక విధుల్లో ఉన్న వేణుగోపాల దీక్షితులు శుక్రవారం ఉదయం స్వామివారికి పూర్ణాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం నూతన ప్రధాన అర్చకులు ఆనంద నిలయానికి పక్కనే ఉన్న వైఖానస అర్చక నిలయంలో మీడియాతో మాట్లాడారు. వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ.. 65 ఏళ్లు దాటాక అర్చకులకు రిటైర్‌మెంట్‌ ఇవ్వాలని టీటీడీ నిర్ణయించడం శుభపరిణామమన్నారు. దీనివల్ల భవిష్యత్‌ తరాల వారికీ స్వామివారిని సేవించే భాగ్యం దొరుకుతుందన్నారు.

కృష్ణ శేషసాయి దీక్షితులు మాట్లాడుతూ.. టీటీడీలో చోటు చేసుకున్న మార్పులను స్వాగతిస్తున్నామన్నారు. కాగా, వేంకటేశ్వరస్వామి నైవేద్య సమర్పణలో ఎలాంటి లోటు లేదని జియ్యంగార్లు పేర్కొన్నారు. టీటీడీ అధికారులు, అర్చకుల వివాదం నేపథ్యంలో పెద్దజియ్యర్, చిన్నజియ్యర్‌లు తిరుమలలోని తిరుమలాంబి వద్ద మీడియా ముందుకు రావడం సంచలనం కలిగించింది. 

Advertisement
Advertisement