జిల్లాలో సాగునీరు వనరుల్లో ఒకటైన డిండి రిజర్వాయర్ ఈ ఏడాది పూర్తిస్థాయిలో నీటితో నిండినా జిల్లా రైతులకు మాత్రం పంటలు పండించుకునే అదృష్టం లేకుండాపోయింది.
ఉప్పునుంతల, న్యూస్‌లైన్: జిల్లాలో సాగునీరు వనరుల్లో ఒకటైన డిండి రిజర్వాయర్ ఈ ఏడాది పూర్తిస్థాయిలో నీటితో నిండినా జిల్లా రైతులకు మాత్రం పంటలు పండించుకునే అదృష్టం లేకుండాపోయింది. నల్గొండ జిల్లాతో పాటు పాలమూరు రైతులకు నీరందించే లక్ష్యంతో నాలుగేళ్ల క్రితం చేపట్టిన కుడికాల్వ ఆధునికీకరణ పనులు నాసిరకంగా చేపట్టడం, కాల్వ చివరి వరకు పనులను పూర్తి చేయకపోవడంతో ప్రాజెక్టు నీరంతా వృథాగా పోతుంది.
మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల సరిహద్దులో నిర్మించిన డిండి ప్రాజెక్టును 14ఏళ్ల క్రితం అలుగు ఎత్తు పెంచడంతో పాటు కుడికాల్వ ద్వారా జిల్లాలోని కొంత ఆయకట్టుకు నీరందేలా పనులు చేపట్టారు. ఇందులో భాగంగానే మండలంలోని లత్తీపూర్, గువ్వలోనిపల్లి శివారులోని 330 ఎకరాలకు సాగునీరందే విధంగా మర్రికుంట వరకు మట్టికాల్వలను తీశారు. నాలుగేళ్ల క్రితం ఏడు కిలోమీటర్ల దూరం ఉన్న ఈ మట్టికాల్వ ఆధునికీకరణ కోసం జపాన్ రూ.1.50 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఈ నిధులతో ఐదుకిలోమీటర్ల మేర కాల్వను ఆధునికీకరణ పనులు చేపట్టారు.
అందులో కొంతదూరం ఇంతకుముందు రాళ్లతో కట్టిన పాతకాల్వ మరమ్మతుతో పాటు మట్టికాల్వను కాంక్రిట్ పనులు చేశారు. పాతకాల్వకు అక్కడక్కడ సిమెంట్ పూతలు పూశారని రైతులు ఆరోపిస్తున్నారు. కాంక్రిట్ పనులు నాసిరకంగా చేపట్టడంతో కాల్వలకు పగుళ్లు వచ్చాయి. మరో రెండు కిలోమీటర్ల మేర మట్టికాల్వను ఆధునీకరించకుండానే వదిలేశారు. నల్గొండ జిల్లాకు చెందిన ఇరిగేషన్ అధికారులు, ఇతర ప్రాంతానికి చెందిన కాంట్రాక్టరు కావడంతో పనులు నామమాత్రంగా చేసి దులుపుకున్నారు. దీంతో నాలుగేళ్లు కూడా దాటనిదే కాంక్రిట్‌కాల్వలు పగుళ్లు వచ్చాయి. దీంతో కాల్వవెంట నీరు ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు.
ఆయకట్టు రైతుల మండిపాటు
పనులకు పర్యవేక్షించే అధికారులు నల్గొండ జిల్లా వారు కావడం, ఏమాత్రం పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పనులు చేసి డబ్బులు దండుకున్నారని గువ్వలోనిపల్లికి చెందిన ఆయకట్టు రైతులు మండిపడుతున్నారు. పూర్తిస్థాయిలో కాలువ ఆధునీకరణకు నిధులు మంజూరయ్యావని అధికారులు తొలుత ప్రకటించినా తర్వాత నిధులు లేవని మిగిలిపోయిన పనులు చేపట్టకుండా నిర్లక్ష్యం చేశారని వాపోతున్నారు. కాల్వ పనుల్లో నాణ్యతలోపించిన విషయాన్ని నల్గొండ ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఐదేళ్ల వరకు కాంట్రాక్టరుకే బాధ్యత ఉంటుందని చెప్పి చేతులు దులుపుకున్నారని ఆరోపిస్తున్నారు. డిండి ప్రాజెక్టు నిండినా తమ పొలాలకు నీరందని స్థితిలో కాల్వలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిపోయిన కాల్వలను ఆధునీకరించి తాము పంటలు పండించుకునే శ్రద్ధ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.