ప్రాణాలే...ఫణం..! | Sakshi
Sakshi News home page

ప్రాణాలే...ఫణం..!

Published Fri, Feb 28 2014 3:40 AM

formers are attempting suicide very hugely

‘పంటకు నీరు పెట్టేందుకు వెళ్లిన తన భర్త తిరిగొస్తాడా...?’ ఆ ఇంటి ఇల్లాలికి గుండెల్లో ఎక్కడో సందేహం. ‘అప్పుడే అరక పట్టిన తమ యజమాని..ఇదేంటీ నేలతల్లి ఒడిలో అలా విగతజీవుడై ఒరిగి పోయాడు’ ...మాట రాకపోయినా మనసు భాష  తెలుసుకున్న బసవడి సందేహం. అయ్యొస్తడని...ఆశతో ఎదురు చూసే చిన్నారులకు...పాడెక్కిన నాన్నను చూసి పెదవే పలకని దుఃఖం. అప్పులు కుప్పల్లో కూరుకున్న కొడుకు...ఇక మీకూ  నాకూ రుణం సరి..అని చివరి సందేశమిచ్చి లోకాన్నే వీడితే తట్టుకోలేక పొర్లి పొర్లి ఏడుస్తున్న తల్లిదండ్రులు. ఇదీ జిల్లాలో రైతుల దుస్థితి. హృదయాలు పగిలే వాస్తవం. సాయం చేయకుండా చేతులెత్తేస్తున్న యంత్రాంగం తీరు.
 
 సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో రోజు రోజుకూ పెరుగుతున్న అన్నదాతల ఆత్మహత్యల పరంపర కలవర పరుస్తోంది. రైతును అన్ని విధాలుగా ఆదుకున్న మహానేత వైఎస్సార్ మరణం తర్వాత రైతుకు అడగడుగునా కష్టాలు ,కడగండ్లు ఎదుర్కోవటం మినహాయించి గత్యంతరం లేని పరిస్థితి నెలకొంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక  తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. సాగు కోసం తెచ్చిన అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో  పభుత్వం ఎలాంటి దయ చూపడం లేదు.  
 
 ఒకే నెలలో ఇంతమందా...?
 శివరాత్రి రోజైన గురువారం జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని బల్మూర్ మండలం కోండనాగుల గ్రామ శివారు జజాల చెంచుకాలనీకి చెందిన రై తు రాయం హుస్సేన్(35) అప్పుల బాధ భరించలేక  ఆత్మహత్య  చేసుకున్నాడు.   బిజినేపల్లి మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన కౌలు రైతు అతినారపు తిరుమలయ్య(45)పంట పెట్టుబడి కోసం తెచ్చిన రూ.లక్ష  తీర్చలేక  బుధవారం ఊరి చివరలో ఉన్న చెట్టుకు ఉరివేసుకుని విగతజీవుడయ్యాడు. హైదరాబాద్‌కు వలస వెళ్లి  మేస్త్రీ పనిచేస్తున్న తిరుమలయ్య సొంత తమ్మునికి చెందిన నాలుగెకరాల భూమి కౌలుకు తీసుకుని ఈ ఏడాది  పత్తి పంట సాగు చేశాడు . ఇటీవలనే రెండో కూతురుకు పెళ్లి నిశ్చయం కావటానికి తోడు,పంటకు తెచ్చిన అప్పును ఎలా తీర్చాలనే అందోళనతో అతను ఈ లోకాన్ని వీడాడు.దీనికి ముందు రోజు  ఇదే మండంలోని వసంతాపూర్‌కు చెందిన కౌలు రైతు పగుడాల శేఖర్(32),మహబూబ్‌నగర్ మండలం జైనల్లీపూర్‌కు నిమ్మకాయల రాములు(40) పంటకు తెచ్చిన అప్పులు తీర్చలేక జీవితాలను చాలించారు.
 
 ఈ నెల 22న వనపర్తి మండలం చిట్యాలకు చెందిన కోండన్న,  5వ తేదీన  బిజినేపల్లి మండలం గంగారంకు  చెందిన భార్యభర్తలు చంద్రకళ,జగన్‌రెడ్డిలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా  చంద్రకళ వృతి చెందింది. వీరే కాకుండా ఫిబ్రవరిలోనే తాడూరు,కల్వకుర్తి,పెద్దమందడి,ఖిల్లాగణపురం, బిజినేపల్లి,నవాబుపేట,వనపర్తి, అచ్చంపేట తదితర ప్రాంతాల్లో 9 మంది ఇవే కారణాలతో బలవన్మరణం చెందారు.
 
 వీరి గోడు పట్టదా...
 వేరుశనగ,పత్తి తదితర పంట ఉత్పత్తులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభించక  పోయినప్పటీకి పట్టించుకొనే వారే కరవయ్యూరు.పల్లీకి  గిట్టు బాటు ధర కల్పించాలని గత కోద్ది రోజులుగా జడ్చర్ల, వనపర్తి,అచ్చంపేట, నాగర్‌కర్నూల్,గద్వాల్, దేవరకద్ర,నారాయణపేట్ తదితర మార్కెట్ యార్డుల్లో రైతులు అందోళన బాట పట్టారు. జడ్చర్లలో ఒకడుగు ముందుకేసిన రైతులు  విధ్వంసానికి పాల్పడ్డారు. దీన్ని ప్రజాప్రతినిధులు గానీ, అధికారులు గానీ పట్టించుకున్న దాఖలాలు లేవు.
 
 మార్కెట్‌లో ఇదీ సంగతి...
 జిల్లాలో అన్నదాత పరిస్థితి....  అమ్మబోతే అడవి కొనబోతే కొరివి చందంగా మారింది. భూగర్బజలాలు అడుగంటిపోయిన పాలమూరులో రైతులు ఆరుతడి పంటలపై మక్కువతో  వేరుశనగ పంటసాగును గణనీయంగా పెంచారు. గత పదేళ్ళ కిందట  15వేల హెక్టారుల వరకు వేరుశనగ పంటను సాగుచేసిన రైతులు  ప్రస్తుతం 1.05 లక్షల హెక్టారులకు పెంచారు.
 
 ఎకరం వేరుశనగ పంట సాగు కోసం రూ.20 వేలు నుంచి రూ.24 వేల వరకు రైతులు ఖర్చు చేసినప్పటికీ .. ఈ ఏడాది పంటకు వచ్చిన వివిధ తెగుళ్ల కారణంగా ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్లు దిగుబడి కావాల్సిన వేరుశనగ ఐదారు క్వింటాళ్లకే పరిమితి కావటంతోపంటకు పెట్టిన  పెట్టుబడి రావటం లేదని రైతులు ఆవేద వ్యక్త చేస్తున్నారు. పత్తి పంట పరిస్థితి కూడా ఇందుకు తీసిపోని విధంగానే ఉంది.  జిల్లాలో రబీ సీజన్‌లో మొత్తంగా 2,34,969 హెక్టార్లలో రైతులు వివిధ పంటలు సాగు చేయగా...ఒక్క వేరుశనగ పంటను మాత్రం 105499 హెక్టార్లలో సాగుచేశారు.  
 
 దళారులదే భోజ్యం...
 మార్కెట్లలో పల్లీ గింజల ధర పడిపోయిందన్న సాకుతో  దళారులు  గిట్టుబా టు ధరను కల్పించకపోగా ప్రభుత్వ ప్రకటించిన కనీస మద్దతు ధరతోనైనా  కొనుగోళ్లు చేయడం లేదు. గత ఏడాది ఇదే సీజన్‌లోని ఫిబ్రవరిలో పల్లి క్వింటాల్ ధర రూ. 4,500 నుంచి రూ.5,500 వరకు పలకగా ప్రస్తుతం  జిల్లాలోని పలుమార్కెట్లలో పల్లీ ధర రూ. 2,500 కు మించి పలకడం లేదు.
 
 ఫలితంగా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  జిల్లాలో 18వ్యవసాయ మార్కెట్లుండగా పలు మార్కెట్లకు రైతులు ఐదు లక్షల క్వింటాళ్లకు పైగా వేరుశనగ  పంటను తరలించారు. ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం ఎక్కడా కొనుగోలు చేయలేదు. రైతులు క్వింటాలుకు రూ.1500 వంతున సుమారుగా రూ. 7.5 కోట్ల వరకు వేరుశనగపైనే  నష్టపోవల్సిన పరిస్థితి ఏర్పడిందని అంచనా వేస్తున్నారు. ఆదుకునేందుకు  సత్వరమే మార్కెట్లలో ప్రభుత్వ సంస్థల ద్వారా  పల్లి పంట కొనుగోళ్లు చేపట్టాలని కోరుతున్నారు.
 

Advertisement
Advertisement