విశాఖలో టీడీపీకి షాక్‌!

Former TDP MLA SA Rahman Has Resigned From The Party - Sakshi

పార్టీకి అర్బన్‌ అధ్యక్షుడు రెహమాన్‌ రాజీనామా

కార్య నిర్వాహక రాజధాని ప్రతిపాదనపై హర్షం

చంద్రబాబు నిర్ణయానికి నిరసనగా పార్టీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటన

తాను చరిత్రహీనుడిని కాదలచుకోలేదని వ్యాఖ్య

అమరావతి రైతులకు బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌

మహారాణిపేట(విశాఖపట్నం): టీడీపీ విశాఖ అర్బన్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ చైర్మన్‌ ఎస్‌ఏ రెహమాన్‌ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేశారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను చంద్రబాబు వ్యతిరేకించడానికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. తాను చరిత్ర హీనుడిగా మిగలదల్చుకోలేదని, చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ నుంచి వైదొలగుతున్నట్లు తెలిపారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించాల్సిందిగా టీడీపీ ఆదేశించిందని, స్థానికంగా ఉంటూ విశాఖ అభివృద్ధిని ఎలా వ్యతిరేకిస్తామని ప్రశి్నంచారు. జాతీయ పౌరపట్టిక (ఎన్‌ఆర్‌సీ)పై చంద్రబాబు ద్వంద్వ వైఖరి కూడా తన రాజీనామాకు కారణమన్నారు.  

విశాఖకు నిధులు రాకుండా అడ్డుకున్న బాబు
విశాఖను కార్య నిర్వాహక రాజధానిగా జీఎన్‌ రావు కమిటీ ప్రతిపాదించడాన్ని స్వాగతిస్తున్నట్టు రెహమాన్‌ పేర్కొన్నారు. చంద్రబాబు తన హయాంలో విశాఖకు చేసిందేమీ లేదని విమర్శించారు. విశాఖ ఎక్కడ అభివృద్ధి చెందుతుందోనని నగర కార్పొరేషన్‌కు కేంద్రం నుంచి నిధులు కూడా రాకుండా చేశారని ధ్వజమెత్తారు. లోకేష్‌ రాజకీయాల్లోకి ప్రవేశించాక చంద్రబాబు మరింత దిగజారిపోయారని, పార్టీ పూర్తిగా నాశనమైందని చెప్పారు. అమరావతిలో రాజకీయ డ్రామాలు నడిపిస్తున్న చంద్రబాబు ఇప్పటికైనా తప్పుడు రాజకీయాలు ఆపి అక్కడి రైతులకు క్షమాపణ చెప్పాలని రెహమాన్‌ డిమాండ్‌ చేశారు.

రైతుల నుంచి 33 వేల ఎకరాలు తీసుకుని ఐదేళ్లు అధికారంలో ఉన్నా రాజధాని నిరి్మంచలేనందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఏ వర్గానికీ ఆయన మేలు చేయలేదన్నారు. అందుకే ఎన్నికల ముందు పసుపు – కుంకుమ పేరుతో డబ్బులు మళ్లించినా మహిళలు టీడీపీకి కాకుండా వైఎస్సార్‌సీపీకే ఓటు వేశారని చెప్పారు. తాను ఎన్టీఆర్‌ అభిమానినని, చంద్రబాబును నమ్మి తమ జీవితాలను ఫణంగా పెట్టి పాపం చేశానని రెహమాన్‌ పేర్కొన్నారు. విశాఖలో రాజధాని ఏర్పాటుపై చంద్రబాబుతో పాటు కొందరు టీడీపీ నేతలు కులాల ప్రస్తావన తేవటాన్ని ఖండించారు.  

జగన్‌కు మైనారిటీలు రుణపడి ఉంటారు
ఎన్‌ఆర్‌సీ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించడాన్ని రెహమాన్‌ స్వాగతించారు. రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీ అమలు చేయబోమని ప్రకటించిన సీఎంకు మైనారీ్టలంతా రుణపడి ఉంటారన్నారు. సీఎంపై విమర్శలు చేయాలంటూ చంద్రబాబు ఆదేశించారని, మైనార్టీలకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న సీఎం ప్రకటనను తాము ఎలా వ్యతిరేకిస్తామని ప్రశి్నంచారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top