సోషల్‌ వర్క్‌కు ఐదు శాతం మార్కులు | Sakshi
Sakshi News home page

సోషల్‌ వర్క్‌కు ఐదు శాతం మార్కులు

Published Tue, Oct 17 2017 1:33 AM

Five percent marks for social work - Sakshi

సాక్షి, అమరావతి: ఇక నుంచి విద్యార్ధులకు సామాజిక సేవ (సోషల్‌ వర్క్‌)ను తప్పనిసరి చేసి ఐదు శాతం మార్కులు కేటాయించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. విద్యార్ధులపై ఒత్తిడి కలిగించి ఆత్మహత్యలకు పురిగొల్పేలా ఉన్న ప్రస్తుత కార్పొరేట్‌ విద్యావిధానంలో మార్పులపై సూచనలు చేసేందుకు ఒక కమిటీని నియమిస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తూనే విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచటంపై కమిటీ సూచనలు చేస్తుందన్నారు. రాష్ట్రంలోని ముఖ్యమైన కార్పొరేట్‌ కళాశాలల ప్రతినిధులతోపాటు అధికారులు ఈ కమిటీలో ఉంటారని చెప్పారు.

ఇటీవల  వరుసగా విద్యార్ధుల ఆత్మ హత్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి సోమవారం కార్పొరేట్, ప్రైవేట్‌ కళాశాలల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. మార్కులు, గ్రేడ్లు కోసం ఆరాటపడుతూ విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్న బట్టీ విధానాలను విడనాడాలని సూచించారు.  విద్యార్ధులను ఒట్టి మరమనుషులుగా మార్చే ప్రస్తుత కార్పొరేట్‌ విద్యా విధానాన్ని సహించబోనని స్పష్టం చేశారు. విద్యార్ధులను వేధించే పద్దతులను తక్షణం విడనాడాలని, నాలుగైదు రోజుల్లో మార్పు తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించకుంటే కఠిన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. నెలకు ఒక సారి ఈ కమిటీతో, మూడు నెలలకు ఒకసారి అన్ని కళాశాలల ప్రతినిధులతో సమీక్షిస్తానని సీఎం చెప్పారు.    

గడువులోగా 28 ప్రాజెక్టులు పూర్తి కావాలి
ప్రాధాన్య ప్రాజెక్టులుగా గుర్తించిన 28 ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. నవంబర్‌లోగా హంద్రీ–నీవా రెండో దశలో భాగమైన మడకశిర బ్రాంచ్‌ కెనాల్, అడవిపల్లి రిజర్వాయర్, పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

Advertisement
Advertisement