నట్టేట ముంచిన సర్కారు | farmers get struggle with sarkar | Sakshi
Sakshi News home page

నట్టేట ముంచిన సర్కారు

Feb 28 2014 1:58 AM | Updated on Sep 4 2018 5:07 PM

కరువు బారిన పడిన లక్షలాది రైతులను రాష్ట్ర ప్రభుత్వం నట్టేట ముంచింది. గత ఏడాది ఖరీఫ్‌లో వర్షాభావం వల్ల ఏడు జిల్లాల్లోని 127 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి.

సాక్షి, హైదరాబాద్: కరువు బారిన పడిన లక్షలాది రైతులను రాష్ట్ర ప్రభుత్వం నట్టేట ముంచింది. గత ఏడాది ఖరీఫ్‌లో వర్షాభావం వల్ల ఏడు జిల్లాల్లోని 127 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గం సభ్యులు సమైక్య ముసుగులో ప్రజలను మభ్యపెట్టడంపైనే దృష్టి సారించి కరువు రైతులను పట్టించుకోవడం మరిచిపోయారు. దీనిపై ‘కరువు రైతులను గాలికి వదిలేసిన సర్కారు’ అంటూ ‘సాక్షి’ ప్రచురించడంతో... ఖరీఫ్ సీజన్ ముగిసిపోయిన ఆరు నెలల తర్వాత ప్రభుత్వంలో కదలిక వచ్చింది. గత నెలలో కరువు మండలాలను ప్రకటిస్తూ జీవో జారీ చేసింది. దీనివల్ల బ్యాంకులు కరువు మండలాల్లోని రైతుల రుణాలను రీషెడ్యూల్ చేస్తాయని భావించారు. అయితే ఖరీఫ్ సీజన్ ముగిసిన ఆరు నెలల తరువాత ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించడంతో బ్యాంకులు రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేయడానికి ప్రతిబంధకంగా మారింది.
 
 ఖరీఫ్ సీజన్ ముగిసిన 90 రోజుల్లోగానే ఆర్‌బీఐ మార్గదర్శక సూత్రాల మేరకు రుణాలను రీ షెడ్యూల్ చేయడానికి అవకాశం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలలు తరువాత గానీ కరువు మండలాలను ప్రకటించకపోవడంతో ఇప్పుడు బ్యాంకులు రుణాల రీషెడ్యూల్ చేయలేని పరిస్థితి నెలకొంది.  90 రోజుల నిబంధనలను సడలించి కరువు రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేయాల్సిందిగా ఆర్‌బీఐని కోరేందుకు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రాజీనామా చేయడానికి వారం రోజుల ముందు నుంచి వందల సంఖ్యలో ఫైళ్లను పరిష్కరించడంపైన దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కరువు రైతుల విషయాన్ని విస్మరించారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల మంత్రులు కూడా కరువు రైతుల విషయాన్ని పట్టించుకోలేదు. డిసెంబర్‌లోగా కరువు మండలాలను ప్రకటించి ఉంటే రుణాలు రీ షెడ్యూల్‌కు సమస్య వచ్చేది కాదని, జనవరిలో ప్రకటించడంవల్ల ఇప్పుడు సమస్య వచ్చిందని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇప్పుడు అధికార యంత్రాంగం కూడా పూర్తిగా విభజనపని, ఎన్నికల పనిలో నిమగ్నమైందని, కరువు రైతుల గురించి ఆలోచించే పనిలో ఎవరూ లేరని ఉన్నతాధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement