పచ్చ మోసం

Farmers Criticize On Chandrababu Government YSR Kadapa - Sakshi

రైతులకు మేం చేసినంతగా ఏ ప్రభుత్వం చేయలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గొప్పలు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రభుత్వం చేసేదొకటి చెప్పేదొకటని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పథక సబ్సిడీలు పెంచామని పైకి చెబుతున్నా అది రైతు దరి చేరిందెక్కడని ప్రశ్నిస్తున్నాయి. ఉద్యాన రైతులకు విరివిగా పథకాలు వినియోగించుకోవడానికి అవకాశాలు కల్పించామని మంత్రి ఊదరగొడుతుంటారు. కానీ చేతల్లో మాత్రం చూపించకపోవడం గమనార్హం.

కడప అగ్రికల్చర్‌ : ఉద్యాన రైతులు ఏడాది కాలంగా పండ్లతోటల సాగు, పాత తోటల పునరుద్ధరణ, యాంత్రీకరణ పథకం, పంట రక్షణ చర్యలు ఊతకర్రలతో పంటలసాగు ఇలా పలు పథకాలను వినియోగించుకున్నారు. కానీ ఏడాది కావస్తున్నా ఆయా పథకాలకు సబ్సిడీ రుణం విడుదల కాకపోవడంతో లబోదిబోమంటున్నారు. తమ వాటా చెల్లించాలని దరఖాస్తులు పంపే సమయంలో చెప్పారని, పథకం మంజూరయ్యాక మీ ఖాతాల్లో సబ్సిడీ రుణం పడుతుందన్నారు. ఇంత వరకు తమ అకౌంట్లలో ఒక్క రూపాయి కూడా పడలేదని ఆయా తోటల రైతులు చెబుతున్నారు. ఇంత అధ్వానంగా ఏ ప్రభుత్వంలోనూ లేదని నిప్పులు చెరుగుతున్నారు. అసలే కరువు పరిస్థితుల్లో అల్లాడుతున్న తమకు ప్రభుత్వం ఇట్లా చేయొచ్చునా అని ప్రశ్నిస్తున్నారు.

ఉద్యాన శాఖలో అమలవుతున్న పథకాలు.. జిల్లాలో 2018–19 సంవత్సరానికి ఉద్యాన తోటల సాగుకు మొక్కల పెంపకం, వాటి పరికరాలు, నూతన పండ్లతోటల సాగు, మొదటి, రెండో, మూడో సంవత్సరాల్లో సాగు చేసిన తోటల నిర్వహణ, ముదురు, పాత తోటలనుసాగులోకి తీసుకువచ్చే పునరుద్ధరణ పథకం, కొమ్మల కత్తరింపు, మల్చింగ్, సస్యరక్షణ, ప్యాక్‌ హౌస్‌లు, కోత అనంతరం చేపట్టాల్సిన పద్ధతులు, శీతలీకరణ గిడ్డంగులు, ఉద్యాన యాంత్రీకరణ పనిముట్లు, పండ్లతోటలకు రక్షక కవచాలు, నీటి ఎద్దడి నుంచి కాపాడే జీబా వంటి 21 రకాల స్కీములు సమీకృత ఉద్యాన అభివృద్ధి పధకం, రాష్ట్రీయ కృషి వికాష్‌ యోజన, రాష్ట్ర ప్రణాళిక కింద పధకాలు అమలవుతున్నాయి.

రైతులకు రావాల్సిన బకాయి రూ.14.71 కోట్లు..
జిల్లాలో ఆయా పథకాల కింద రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, పులివెందుల, ముద్దనూరు, మైదుకూరు, బద్వేలు, కడప, రాజంపేట, రైల్వేకోడూరు ఉద్యా న డివిజన్లలోని 41 మండలాల్లో ఉద్యాన తోటలు 1.80 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ఇందులో కొన్ని కొత్త తోటలు కాగా, మిగిలినవి పాతవి, కూరగాయ తోటలు ఉన్నాయి. వీటి సాగు కోసం రైతులు సమీకృత ఉద్యాన అభివృద్ధి, రాష్ట్రీయ కృషి వికాష్‌ యోజన, రాష్ట్ర ప్రణాళిక పథకాల కింద దరఖాస్తు చేసుకుని తోటలను సాగు చేసుకున్నారు. కొందరు బ్యాంకుల్లో, ప్రైవేటుగా వడ్డీలకు రుణాలు తెచ్చుకుని పండ్ల, కూరగాయల తోటల ను సాగు చేసుకున్నారు. కానీ ప్రభుత్వం నుంచి సబ్సిడీ రుణం ఇంత వరకు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మరో వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తే మా డబ్బులు రావేమోనని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రైతులంటే ప్రభత్వానికి చిన్నచూపు
మామిడి పాత తోటలు పునరుద్ధరించుకోమని చెప్పారు. ఒక్కో రైతుకు ఐదు ఎకరాల వరకు అనుమతిచ్చారు. ఆ ప్రకారం తాను పాత తోటలను కొమ్మలను కత్తిరించుకుని మళ్లీ సాగులోకి తెచ్చుకున్నాను. ఎరువులు, పురుగు మందులకు సొమ్ములు చెల్లిస్తామన్నారు. దీని కోసం బ్యాంకులో అప్పుగా రుణం తీసుకున్నాం. అప్పు తీర్చుద్దామంటే ప్రభుత్వం సబ్సిడీ మొత్తం విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తోంది. రైతులంటే ప్రభుత్వానికి చిన్నచూపు తగదు. –పచ్చిపాల రంగారెడ్డి, మామిడి రైతు, దిగువబత్తినవాండ్లపల్లె, లక్కిరెడ్డిపల్లె మండలం

ప్రభుత్వానికి నివేదికలు పంపాం...
జిల్లాలో రావాల్సిన ఉద్యాన పంటల సబ్సిడీ రుణం విడుదల చేయాలని ప్రభుత్వానికి నివేదికలు పంపాం. కొంత కాలంగా ఈ సమస్య ఉంది. అయినా ప్రభుత్వం నుంచి నిధులు రాగానే రైతుల ఖాతాలకు వెళతాయి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. –ప్రసాద్, డిప్యూటీ డైరెక్టర్, జిల్లా ఉద్యాన శాఖ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top