అయ్యో అన్నదాతా..!

Farmer Commits Suicide Attempt in Vizianagaram - Sakshi

సీఎం చెప్పినా సమస్య పరిష్కరించని అధికారులు

ప్రభుత్వ తీరును నిరసిస్తూ రైతు ఆత్మహత్యాయత్నం

నాలుగేళ్లుగా తిరిగినా ఫలితం లేదు : బాధిత రైతు

విజయనగరం, సీతానగరం/పార్వతీపురం: మాది రైతు సంక్షేమ ప్రభుత్వమని.. అన్నదాత అభివృద్ధే తమ ధ్యేయమని గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ నాయకులకు రైతుల ఆత్మహత్యాయత్నాలు కనబడడం లేదు. తనకు రుణం ఇమ్మని అడగలేదు.. భూమి మంజూరు చేయమనీ ఆ రైతు అడగలేదు. కేవలం తన భూ సమస్య పరిష్కరించమని మాత్రమే కోరాడు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశంలోనే తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొని పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించి సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇది జరిగి నాలుగేళ్లు గడుస్తున్నా ఆ సమస్య నేటికీ పరిష్కారం కాలేదు. దీంతో అధికారుల తీరును నిరసిస్తూ బాధిత రైతు మరోసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. సీతానగరం మండలం చినబోగిలి గ్రామానికి చెందిన గుణుపూరు రాము అనే రైతు తన  84 సెంట్ల భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులను కోరాడు. కాని అధికారులు స్పందించలేదు.

దీంతో 2015లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామంలో ‘నీరు – చెట్టు’ కార్యక్రమంలో పాల్గొనగా.. బాధిత రైతు రాము తన సమస్యను ఏకంగా ముఖ్యమంత్రికే చెప్పుకునేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విసిగిపోయిన రైతు రాము తన వెంట తెచ్చుకున్న పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  దీంతో చంద్రబాబునాయుడు రైతు సమస్య తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ అధికారులు అదే నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ సమస్యను పరిష్కరించలేదు. దీంతో ఎప్పటికీ తన సమస్య పరిష్కారం కాదనే బెంగతో గురువారం స్థానిక రాష్ట్రీయ రహదారికి ఆనుకుని ఉన్న కాశీపేట వాటర్‌హెడ్‌ ట్యాంక్‌ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కలెక్టర్, సబ్‌ కలెక్టర్‌ వచ్చి తన సమస్యను పరిష్కరిస్తేనే కిందకు దిగుతానని.. లేని ఎడల దూకి చనిపోతానని స్పష్టం చేస్తూ ట్యాంక్‌పై కూర్చున్నాడు.

అధికారుల్లో అలజడి...
రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నాడన్న విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ డి. బాపిరాజు, ఎస్సై ఎస్‌. కృష్ణమూర్తి తక్షణమే చేరుకుని అగ్నిమాపక, 108 సిబ్బందిని రప్పించారు. సమస్యను పరిష్కరిస్తామని కిందకు దిగాలని కోరినా రైతు ఒప్పుకోలేదు. దీంతో కొంతమంది రామును కిందకు దించేందుకు ట్యాంక్‌ పైకి ఎక్కేందుకు వెళ్లగా.. తనతో తెచ్చుకున్న పురుగు మందును తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే బాధిత రైతును కిందకు దించి పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే బాధిత రైతు ఆస్పత్రిలో మాట్లాడుతూ, అధికారుల చుట్టూ నాలుగేళ్లుగా తిరిగినా ఫలితం లేకపోయిందన్నారు. పైగా స్థానిక నాయకులు, అధికారులు తనను బెదిరిస్తున్నారని.. అందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని చెప్పారు.  ఈ సంఘటనపై ఔట్‌పోస్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top