కన్నీటి బతుకులకు ఊరట

Families Of  Fisherman Recieved  Pensions In Srikakulam - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : ఏడు నెలలు గడిచాయి.. అయినా వారికి న్యాయం జరగలేదు. ఇంటి యజమానులు పాకిస్థాన్‌ చెరలో ఉన్నారు. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పిల్లలకు చదువులు లేవు. వృద్ధులకు, మహిళలకు ఆసరా కరువు. అసలు తమవారు తిరిగొస్తారో లేదోనన్న ఆవేదన. ప్రభుత్వం తమ మొర ఆలకిస్తుందో లేదోనన్న ఆందోళన. అర్ధ సంవత్సరం దాటినా పాత ప్రభుత్వం పట్టించుకోలేదు.. కొత్త సర్కారైనా మొర వింటుందన్న ఆశతో ‘స్పందన’కు హాజరయ్యారు.. తమ కన్నీళ్లను కాగితంపై పెట్టి కలెక్టర్‌కు అందించారు. ఆశ్చర్యం.. నాలుగు రోజుల్లోనే అధికారులు స్పందించారు. నెలకు రూ.4,500 వంతున ఏడు నెలలకు రావాల్సిన పింఛన్‌ మొత్తం రూ.31,500 ఒకేసారి అందించారు. ఇలా బాధిత 12 కుటుంబాల వారికి సాయం అందింది. పాకిస్థాన్‌ చెర నుంచి శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులను విడిపించడానికి కేంద్ర ప్రభుతానికి లేఖ రాశామని కలెక్టర్‌ నివాస్‌ తెలిపారు. 

గత ఏడాది నవంబర్‌ 11వ తేదీన ఎచ్చెర్ల మండలంలోని కె.మత్స్యలేశం, డి.మత్స్యలేశం, బడివానిపేట, ముద్దాడ తదితర గ్రామాలకు చెందిన 12 కుటుంబాలలోని 15 మంది మత్స్యకారులు పాకిస్థానీ సైనికులకు చిక్కారు. వీరిలో ముగ్గురు బోటు డ్రైవర్లు కాగా మిగిలిన వారు కళాసీలుగా పనిచేసేవారు. వారిని విడిపించేందుకు గత ప్రభుత్వం చొరవ చూపలేదు. బాధితులు అప్పటి నాయకులకు ఆశ్రయించినా కంటితుడుపు చర్యలతో సరిపెట్టారు. కనీసం పింఛను కూడా ఇవ్వలేదు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీవెన్స్‌ సెల్‌ను చిత్తశుద్ధితో నిర్వహించాలని, తక్షణం స్పందించాలని అధికారులకు దిశా నిర్దేశం చేయడంతో వారిలో చిన్న ఆశ కలిగింది. ఈనెల ఒకటో తేదీన జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ‘స్పందన’ కార్యక్రమానికి హాజరై పాకిస్థాన్‌ చెరలో ఉన్న వారిని విడిపించాలని, తమను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. దీనికి వెంటనే స్పందించిన ప్రభుత్వ అధికారులు శుక్రవారం బాధిత కుటుంబాలకు పింఛను అందజేశారు. 

12 మత్య్సకార కుటుంబాలకు చెక్కుల పంపిణీ
పాకిస్థాన్‌ ఆధీనంలో ఉన్న జిల్లాకు చెందిన మత్స్యకారుల కుటుంబాలకు నెలవారీ పింఛన్ల చెక్కులను జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో పంపిణీ చేశారు. మత్స్యకార కుటుంబాలకు నెలకు రూ.4,500ల వంతున రాష్ట్ర ప్రభుత్వం పింఛనును ప్రకటించింది. అందులో భాగంగా 7 నెలలకు రూ. 31,500 వంతున 12 కుటుంబాలకు రూ.3,78,000ల విలువ గల చెక్కులను అందించారు. ప్రభుత్వం నుంచి పింఛను సొమ్ము రావడంలో జాప్యం కావడంతో జిల్లాలో అందుబాటులో ఉన్న నిధులను జిల్లా కలెక్టర్‌ సర్దుబాటు చేశారు. చెక్కులు అందుకున్న వారిలో వాసుపల్లి శామ్యూల్, కేసము యర్రయ్య, బాడి అప్పన్న, సూరాడ అప్పారావు, కోనాడ వెంకటేష్, దుండంగి సూర్యనారాయణ, కేసము రాజు, గనగళ్ల రామారావు, చీకటి గురుమూర్తి, మైలపల్లి సన్యాసిరావు, పెంట మణి, షకియా సుమంత్‌ల కుటుంబాలు ఉన్నాయి. వారితోపాటు మత్స్యశాఖ సంయుక్త సంచాలకుడు వీవీ కష్ణమూర్తి, సంఘ నాయకులు మూగి శ్రీరాములు, వారది యర్రయ్య, మైలపల్లి పోలీసు, మూగి గురుమూర్తి, చింతపల్లి సూర్యనారాయణ, సూరాడ కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుతానికి లేఖ: కలెక్టర్‌ నివాస్‌
పాకిస్థాన్‌ చెరలో ఉన్న జిల్లాకు చెందిన మత్స్యకారుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని కలెక్టర్‌ స్పష్టం చేశారు. పాకిస్థాన్‌ ఆధీనంలో ఉన్న మత్స్యకారుల విడుదలకు అన్ని చర్యలు చేపట్టామని కలెక్టర్‌ తెలిపారు. ‘స్పందన’ కార్యక్రమంలో అందిన అర్జీ ఆధారంగా మత్స్యకారుల కుటుంబాలకు పింఛన్లు వెంటనే చెల్లించామని కలెక్టర్‌ తెలిపారు. మత్య్సకారులుకు వలలు, ఇతర వసతులు కల్పించి కుటుంబాలను ఆదుకొంటామని తెలిపారు.  

నా కుటుంబం నుంచి ముగ్గురు..
పాకిస్థాన్‌ చెరలో మా కుటుంబం నుంచి ముగ్గురు బందీలుగా ఉన్నారు. వారు లేక పూర్తిగా మా కుటుంబం రోడ్డున పడింది. ఏడు నెలలు గడిచాయి. పలుసార్లు అధికారులను, నాయకులను కలసి మా గోడు వినిపించుకొన్నాం. అయినా పరిష్కారం లేదు. భర్త, పిల్లలు లేక దయనీయ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నాను. 
 –సూరాడ ముగతమ్మ 

ఉత్తరాలు కూడా రావడం లేదు
పాకిస్థాన్‌ చెరలో చిక్కిన తరువాత కొన్ని నెలలు ఉత్తరాలు వచ్చేవి. ఇటీవల వారి నుంచి సమాచారం కూడా కరువైయింది. వారి చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని తెలుస్తోంది. వారు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. వారు లేక మేం ఇక్కడ నిరాశ్రయులుగా మారాం. ప్రభుత్వం ఆదుకోవాలి.
 –గనగళ్ల నూకమ్మ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top