దర్శకుడినంటూ వివాహితకు వంచన...
సినీదర్శకుడినని మాయమాటలు చెప్పి ప్రేమవివాహం చేసుకొని.. ఆ తర్వాత డబ్బు దండుకొని ముఖం చాటేశాడో ఘనుడు.
పెళ్లి చేసుకొని భార్యను వదిలేసిన ఘనుడు
సినీదర్శకుడినని మాయమాటలు చెప్పి ప్రేమవివాహం చేసుకొని.. ఆ తర్వాత డబ్బు దండుకొని ముఖం చాటేశాడో ఘనుడు. ఆ మోసగాడిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణాజిల్లా గుడివాడ పట్టణానికి చెందిన మహిళ (29)కి గతంలో పెళ్లైంది. భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం బంజారాహిల్స్ రోడ్ నెం.10లోని గౌరీశంకర్ కాలనీ నివాసి బత్తుల దైవకృపరాజు(32)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. తాను సినీదర్శకుడినని, ప్రేమిస్తున్నానని రాజు ఆమెను వలలో వేసుకున్నాడు. దీంతో ఆమె తన భర్తకు విడాకులిచ్చి 2009 జనవరి 21న రాజును విజయవాడ దుర్గగుడిలో పెళ్లి చేసుకుంది.
త్వరలోనే ఓ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నానని నమ్మించి ఆమె వద్ద నుంచి సుమారు రూ. 5 లక్షలు దండుకున్నాడు. కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. తాను ఇంకో పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి జులై నెలలో రాజు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతని సెల్‌ఫోన్‌కు కాల్ చేస్తే అందుబాటులోకి రావడంలేదు. ఎంతకూ అతను తిరిగి రాకపోవడంతో తనను మోసం చేసి వెళ్లిపోయాడని బాధితురాలు గ్రహించింది. అతని గురించి ఆరా తీయగా దర్శకుడు కాదని.. కారు డ్రైవర్ అని తెలిసింది. దీంతో బాధితురాలు ఆదివారం బంజారాహిల్స్ ఠాణాకు వచ్చి.. ప్రేమ, పెళ్లి పేరుతో తన వంచించిన రాజుపై చీటింగ్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


