నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టు


కాకినాడ క్రైం, న్యూస్‌లైన్ : ఫైనాన్స్ వ్యాపారం ముసుగులో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. శనివారం కాకినాడలోని తూర్పుగోదావరి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఎన్.శివశంకర్ రెడ్డి వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. తణుకుకు చెందిన వల్లూరి రాజశేఖర్ వడ్రంగి పని, వస్త్ర వ్యాపారం, రోల్డ్‌గోల్డ్ వస్తువుల వ్యాపారం చేసి నష్టాల పాలయ్యాడు. దీంతో అతడు మండపేటకు మకాం మార్చాడు. అనపర్తి మండలం కుతుకులూరు కాలనీకి చెందిన మేడపాటి శ్రీనివాసరెడ్డి ఫైనాన్స్, ఇన్‌స్టాల్‌మెంట్ వ్యాపారాలు చేసి నష్టపోయాడు. కొద్దికాలం క్రితం రాజశేఖర్‌తో శ్రీనివాసరెడ్డికి పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ నకిలీ కరెన్సీ చలామణితో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఏడు నెలల క్రితం జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన నకిలీ కరెన్సీ నోట్లు మార్చే ధన్‌బాద్‌రెడ్డి రాజశేఖర్‌కు పరిచయమయ్యాడు.

 

 రాజశేఖర్, శ్రీనివాసరెడ్డి అతడితో రూ.47 వేలు అసలు కరెన్సీకి లక్ష రూపాయల నకిలీ కరెన్సీ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ధన్‌బాద్ రెడ్డి నుంచి దఫదఫాలుగా నకిలీ కరెన్సీ తీసుకువచ్చి మహేంద్రవాడకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి మల్లిడి కుమార్ రెడ్డి (మణికంఠ)కు, రామవరం కాలనీకి చెందిన ఫైనాన్స్ వ్యాపారి కర్రి వెంకట రెడ్డికి ఇచ్చి అసలు నగదు తీసుంటున్నారు. ఫైనాన్స్ వ్యాపారులు కొంతకాలంగా వారి వద్ద నుంచి నకిలీ కరెన్సీని తీసుకుని మారుస్తున్నారు. ఈ నేపథ్యంలో   శుక్రవారం రాత్రి మండపేట బస్టాండ్ సమీపంలో రాజశేఖర్, శ్రీనివాసరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధన్‌బాద్ రెడ్డి, మల్లిడి కుమార్ రెడ్డి, కర్రి వెంకట రెడ్డి పరారీలో ఉన్నారు.   
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top