ఉత్సాహంగా..రేస్‌

F1H2O World Championship : Today final contest - Sakshi

ఎఫ్‌1,హెచ్‌2ఓ క్వాలిఫయింగ్‌ రౌండ్లు పూర్తి

నేడు ఫైనల్‌ పోటీ  

సాక్షి,విజయవాడ : ప్రతిష్టాత్మకమైన ఎస్‌1హెచ్‌2ఓ పవర్‌ బోటు రేసింగ్‌కు రెండవ రోజు ఉత్సాహంగా సాగింది. రేసింగ్‌ను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబర్చారు. శనివారం జరిగిన కాలిఫైయింగ్‌ తొలిరౌండ్‌లో 19 జట్లు పాల్గొనగా అందులో 12 జట్లు అర్హత సాధించాయి. రెండవ క్వాలిఫైయింగ్‌ రౌండ్‌ పూర్తయిన తరువాత 6 జట్లు అర్హత సాధించాయి. ఇందులో అమరావతి బోటు కూడా అర్హత సాధించింది. ఆదివారం ఫైనల్‌ పోటీలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జరిగే ఏడు పోటీలు పూర్తయిన తరువాత చాంపియన్స్‌ను ప్రకటిస్తారు. 

నదుల్లో బోటింగ్‌ కొంత ఇబ్బందే
సముద్రంలో జరిగే ఈ రేస్‌లు నదిలో నిర్వహించడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని రేసర్లను విలేకర్లు ప్రశ్నించినప్పుడు కొంత ఇబ్బందిగానే ఉందని వారు చెప్పారు. ముఖ్యంగా నదిపై వచ్చే గాలి వల్ల, నీటి ప్రవాహం వల్ల బోట్లు నడపడం కొంచెం ఇబ్బందిగా ఉంటోదని పేర్కొన్నారు. చాకచక్యంగా, వేగవంతంగా నడుపుతున్నామని రేసర్లు చెబుతున్నారు. 

ప్రజాప్రతినిధుల చేతుల్లో పాస్‌లు
వీవీఐపీ పాన్‌లను పర్యాటక శాఖ సిద్ధం చేసింది. ఈ పాస్‌లన్నీ అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల చేతికి, పర్యాటక శాఖ ఉన్నతాధికారుల చేతికి వెళ్లిపోయాయి. బోట్‌ రేసింగ్‌ పై ఆసక్తితో తిలకించడానికి వచ్చే వారికి పాస్‌లు లేకపోవడంతో దుర్గాఘాట్‌లోనూ, భవానీఘాట్‌లోనూ కూర్చుని తిలకించాల్సి వచ్చింది. పాఠశాల, కళాశాలకు చెందిన విద్యార్థులను పెద్దఎత్తున తరలించారు. ఉదయం వచ్చిన విద్యార్థులు సాయంత్రం వరకు కూర్చోలేక రేస్‌ ప్రారంభం కాకముందే వెళ్లిపోవడం దర్శనమిచ్చింది.

సౌకర్యాలు నిల్‌
పున్నమి ఘాట్‌కు వచ్చిన సందర్శకులకు కావాల్సిన ఏర్పాటు చేయడంలో నిర్వహకులు పూర్తిగా విఫలమయ్యారు. మంగళగిరి చెందిన కొంతమంది యువతులు గ్యాలరీ 5కు చెందిన పాస్‌లు తీసుకువస్తే ఆ గ్యాలరీ ఎక్కడో చెప్పేవారే కరువయ్యారు. చివరకు రెండవ నెంబర్‌ గ్యాలరీ ఖాళీగా వుందని తెలుసుకుని అక్కడకు వెళ్లి కూర్చుని రేస్‌లను తిలకించారు. ఏ గ్యాలరీ ఎక్కడ ఉందో అధికారులే చెప్పలేకపోతున్నారని ప్రజ్ఞ సాక్షికి వివరించింది. రేస్‌ల గురించి సమాచారం చెప్పేవారే కరువయ్యారు. 

ఆఖరి రోజుపైనే అందరి దృష్టి
రెండవ రోజు తగినంత మంది సందర్శకులు రాకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆదివారం అదే పరిస్థితి ఉంటే ప్రతిష్ట దెబ్బతింటుందని భారీగా ప్రేక్షకుల్ని తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పవిత్ర సంగమం వద్దకు రేస్‌లు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం తొలుత చెప్పింది. వాస్తవంగా భవానీఘాట్‌ వరకు మాత్రమే బోట్లు నడుస్తున్నాయి. పవిత్ర సంగమం వద్దకు వచ్చిన వారు రేస్‌లు సరిగా కనపడటం లేదని చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top