రోగుల ప్రాణాలతో చెలగాటం..

Expired Medicines Using In Balijipeta PHC - Sakshi

బలిజిపేట పీహెచ్‌సీలో కాలం చెల్లిన మాత్రల పంపిణీ?

ఆందోళనలో రోగులు

సాక్షి, బలిజిపేట (విజయనగరం): ప్రభుత్వ వైద్యశాలల సిబ్బంది రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కాలం చెల్లిన మాత్రలు రోగులకిస్తూ నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారు. సీజనల్‌ వ్యాధి అయిన డయేరియా నివారణకు మెట్రోజోల్‌ మాత్రలు ఇస్తుంటారు. అయితే ఎక్స్‌పైరీ అయిన మెట్రోజోల్‌ మాత్రలను సిబ్బంది అందజేస్తున్నారంటే వారికి రోగుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి కాలం చెల్లిన మాత్రలు పీహెచ్‌సీల్లో ఉంటే వాటిని కాల్చివేయాలి. కాని సిబ్బంది అస్సలు పట్టించుకోకుండా రోగులకు ఎక్స్‌పైరీ అయిన మాత్రలను ఇస్తున్నారు. బలిజిపేట పీహెచ్‌సీలో డయేరియా రోగులకు కాలం చెల్లిన మాత్రలు ఇచ్చారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. 2018 అక్టోబర్‌ నాటికి ఎక్స్‌పైరీ అయిన మెట్రోజోల్‌ మాత్రలను సిబ్బంది ఇచ్చారు. ఇవేమీ తెలియని రోగులు ఆ మాత్రలు మింగేస్తున్నారు. ఇప్పుడు అసలు విషయం తెలుసుకున్న రోగులు తమకేదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.

సాధారణంగా వచ్చే రోగులు
పీహెచ్‌సీకి ఎక్కువగా గర్భిణులు, బాలింతలు, కాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు, సుగర్, బీపీ రోగులు ఎక్కువగా వస్తుంటారు.  వీరితో పాటు డయేరియా, వైరల్‌ జ్వరాల బారిన పడ్డవారు కూడా పీహెచ్‌సీని ఆశ్రయిస్తుంటారు. ఇప్పుడు కాలం చెల్లిన మాత్రలు ఇస్తున్నారంటూ బయటకు పొక్కడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు.

మూడు నెలలకు ఒకసారి ఇండెంట్‌
పీహెచ్‌సీ ఆధారంగా ఇండెంట్‌ పెడుతుంటారు. పీహెచ్‌సీలకు సంబంధించిన మందులు జిల్లా కేంద్రాస్పత్రికి వెళ్లి అక్కడ నుంచి తిరిగి వస్తాయి. బలిజిపేట పీహెచ్‌సీకి మూడు నెలలకొకసారి రూ. 1.50 లక్షలతో ఇండెంట్‌ పెడతారు.

పర్యవేక్షిస్తాం..
బలిజిపేట పిహెచ్‌సీలో కాలం చెల్లిన మందులు లేవు.  ఒకవేళ ఉంటే అటువంటి వాటిని గుర్తించి పక్కన పెట్టస్తాం.  దీనిపై పర్యవేక్షణ జరుపుతాం.
– మహీపాల్, వైద్యాధికారి, బలిజిపేట పీహెచ్‌సీ.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top