సమాజ సేవ ప్రతి ఒక్కరి బాధ్యత

Everyone is responsible for community service - Sakshi

స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ వార్షికోత్సవంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పిలుపు

మన ఎదుగుదలకు తోడ్పడిన సమాజానికి తిరిగి సేవ చేయాలి 

స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ సేవలు అభినందనీయం 

వేడుకలకు హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,గవర్నర్‌ నరసింహన్‌

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సమాజ సేవను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని పనిచేయాలని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పిలుపునిచ్చారు. మన ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన సమాజానికి తిరిగి సేవ చేయాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని సూచించారు. తద్వారా సమాజంలోని పేద విద్యార్థులకు, ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌  శుక్రవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. చెన్నై నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా నెల్లూరు నగరంలోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకున్న రామ్‌నాథ్‌ కోవింద్, సవితా కోవింద్‌ దంపతులకు రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ స్వాగతం పలికారు. గవర్నర్‌తోపాటు రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ ఉన్నారు. ఆనంతరం అక్కడి నుంచి రాష్ట్రపతి దంపతులు నగరంలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడి నివాసానికి చేరుకున్నారు.

అక్కడ అల్పాహారం ముగించిన తర్వాత వెంకటాచలం మండలంలోని అక్షర స్కూల్‌కు చేరుకున్నారు. అక్కడ ఎర్పాటు చేసిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్కూల్‌ను పరిశీలించారు. అక్కడి నుంచి స్వర్ణభారత్‌ ట్రస్ట్‌కు చేరుకొని అక్కడ మొక్క నాటారు. ట్రస్ట్‌ 18వ వార్షికోత్సవ వేడుకల్లో రామ్‌నాథ్‌ కోవింద్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ట్రస్ట్‌ ఎండీ, వెంకయ్య నాయుడి కుమార్తె దీపా వెంకట్‌ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ద్వారా చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ప్రధానంగా విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో శిక్షణ, ఉపాధి కార్యక్రమాలను అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 

తెలుగు సంస్కృతి గురించి బాగా చెప్పే వ్యక్తి వెంకయ్య 
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వెంకయ్య నాయుడు అజాత శత్రువు, రాజ్యసభ చైర్మన్‌గా ఏంతో సమర్థవంతంగా సభను నిర్వహిస్తున్నారని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొనియాడారు. తనకు ఢిల్లీలో వెంకయ్య నాయుడు ఆంధ్రా వంటకాలను రుచి చూపించారని, అలాగే తెలుగు సంస్కృతి గురించి ఢిల్లీలో బాగా చెప్పే వ్యక్తి అని అన్నారు. వెంకయ్యకు సేవా కార్యక్రమాల్లో స్ఫూర్తి అయిన భారతరత్న నానాజీ దేశ్‌ముఖ్‌ ట్రస్ట్‌ను గత నెలలోనే తాను సందర్శించానని, మళ్లీ ఇప్పుడు అలాంటి ట్రస్ట్‌ అయిన స్వర్ణభారత్‌ను సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... ఢిల్లీలో మినహా మిగిలిన దేశంలో ఎక్కడా భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి దంపతులు కలిసి ఒకే కార్యక్రమంలో పాల్గొనలేదని, అలాంటి అరుదైన అవకాశం స్వర్ణభారత్‌ ట్రస్ట్‌కు దక్కిందని చెప్పారు. ట్రస్ట్‌ను ఆశీర్వదించడానికి వచ్చిన రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజలకు సేవ చేయడం తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. అందుకే స్నేహితుల సహకారంతో 18 ఏళ్ల క్రితం మొదలైన ట్రస్ట్‌ నేడు నెల్లూరుతోపాటు అమరావతి, హైదరాబాద్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తోందన్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం ట్రస్ట్‌ కృషి చేస్తోందని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ వారివారి ప్రాంతాల్లో స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ తరహాలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సతీమణి ఉషా నాయుడు,  రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్, రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, ట్రస్ట్‌ చైర్మన్‌ కె.విష్ణురాజు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top