ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ ఐక్యకూటమి గెలుపు

EU United Alliance victory in RTC recognition Election - Sakshi

     ఈయూ, వైఎస్సార్‌ సీపీ, కార్మిక పరిషత్, ఎస్‌డబ్లు్యఎఫ్‌ కలసి పోటీ

     2,399 ఓట్ల మెజార్టీతో ఈయూ ఐక్య కూటమి గెలుపు

     అధికార టీడీపీకి చెంపపెట్టులా ఎన్నికల ఫలితాలు

     మంత్రులు ప్రచారం చేసినా తప్పని పరాభవం

సాక్షి, అమరావతి: హోరాహోరీగా జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎంప్లాయిస్‌ యూనియన్‌(ఈయూ) ఐక్యకూటమి గెలుపొందింది. 2,399 ఓట్ల మెజార్టీతో నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ (ఎన్‌ఎంయూ)పై ఈయూ ఐక్యకూటమి విజయం సాధించింది. విపక్షాలు మద్దతు ఇచ్చిన ఈయూ ఐక్యకూటమి విజయ కేతనం ఎగురవేయగా టీడీపీ మద్దతిచ్చిన ఎన్‌ఎంయూ పరాజయం పాలైంది. ఈయూ ఐక్యకూటమి కింద ఎంప్లాయిస్‌ యూనియన్, వైఎస్సార్‌ సీపీ మజ్దూర్‌ యూనియన్, కార్మిక పరిషత్, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్లు కలిసి పోటీ చేశాయి. 

చెల్లిన ఓట్లు 49,430 
గురువారం ఉదయం 5 గంటలకే మొదలైన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు బ్యాలెట్‌ విధానంలో సాయంత్రం 6 గంటల వరకు జరిగాయి. మొత్తం 50,213 ఓట్లకుగానూ 49,682 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్‌ 98.12 శాతం నమోదైంది. రాష్ట్ర స్థాయి గుర్తింపులో 49,430 ఓట్లు చెల్లినట్లు గుర్తించారు. వీటిలో ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఐక్య కూటమికి 25,771 ఓట్లు రాగా, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌కు 23,372 ఓట్లు దక్కాయి. రాష్ట్ర స్థాయి గుర్తింపు కోసం పోటీ చేసిన బహుజన్‌ వర్కర్స్‌ యూనియన్‌కు 208 ఓట్లు, కార్మిక సంఘ్‌కు 34 ఓట్లు, ఏపీఎస్‌ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌కు 45 ఓట్లు వచ్చాయి. 

జిల్లా ఫలితాల్లోనూ ఈయూ ఐక్య కూటమిదే హవా...
ఆర్టీసీ కార్మికులు జిల్లా గుర్తింపు, రాష్ట్ర గుర్తింపు ఎన్నికలకు గాను ఈ ఎన్నికల్లో రెండు ఓట్లు వినియోగించుకున్నారు. రాష్ట్ర స్థాయి గుర్తింపు ఎన్నికల్లో ఈయూ ఐక్య కూటమి 2,399 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించగా, జిల్లా స్థాయి గుర్తింపు ఎన్నికల్లోనూ ఈయూ ఐక్య కూటమి హవా చాటింది. విశాఖ, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాల్లో నేషనల్‌ మజ్దూర్‌ యూనియన(ఎన్‌ఎంయూ) గెలుపొందగా, మిగిలిన పది జిల్లాల్లోనూ ఈయూ ఐక్య కూటమి విజయం సాధించింది. రెండేళ్ల క్రితం జరిగిన గుర్తింపు ఎన్నికల్లో ఎన్‌ఎంయూ 709 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా ఈదఫా ఈయూ ఐక్య కూటమి 2,399 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందడం గమనార్హం. 

ఎన్‌ఎంయూ సర్కారు తొత్తులా వ్యవహరించింది: ఈయూ
నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ ప్రభుత్వానికి తొత్తులా వ్యవహరించిందని ఈయూ ఐక్య కూటమి నేతలు విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల తరఫున పోరాడకుండా సీఎం చంద్రబాబు, రవాణా మంత్రి అచ్చెన్నాయుడు, ఆర్టీసీ ఛైర్మన్‌ వర్ల రామయ్యలకు సన్మానాలతో సరిపెట్టిందని ధ్వజమెత్తారు. ఐక్య కూటమిని అడ్డుకునేందుకు ప్రభుత్వం చేసిన కుట్రలను భగ్నం చేసి కార్మికులు తమ కూటమికి పట్టం కట్టారని ఈయూ ఐక్య కూటమి నేతలు వైవీ రావు, పద్మాకర్, దామోదరరావు, సుందరయ్య, వి.వి.నాయుడులు హర్షం వ్యక్తం చేశారు. 

మంత్రులు రంగంలోకి దిగినా తప్పని ఓటమి
ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు అధికార టీడీపీకి చెంపపెట్టులా మారాయి. ఎన్‌ఎంయూ తరపున మంత్రులు రంగంలోకి దిగి ప్రచారం చేసినా  ఓటమి తప్పలేదు. రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆర్టీసీ ఛైర్మన్‌ వర్ల రామయ్య తిరుపతిలో పర్యటించి ఎన్‌ఎంయూని గెలిపించాలని ప్రచారం చేశారు. వీరి ప్రచారాన్ని ఆర్టీసీ కార్మికులు ఏ మాత్రం పట్టించుకోలేదనేందుకు ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే అధికార పార్టీ కుట్రలను అడ్డుకునేందుకు కార్మికులంతా కలిసికట్టుగా ఎన్‌ఎంయూని ఓడించారు. తాము అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఇచ్చిన హామీ కార్మికుల్లో ప్రభావం చూపిందని ఆర్టీసీ వర్గాలు పేర్కొనడం గమనార్హం.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top