తూర్పు కనుమల్లో ఎర్రదండు | erradandu in Eastern Ghats | Sakshi
Sakshi News home page

తూర్పు కనుమల్లో ఎర్రదండు

Sep 15 2014 2:26 AM | Updated on Oct 4 2018 7:55 PM

తూర్పు కనుమల్లో ఎర్రదండు - Sakshi

తూర్పు కనుమల్లో ఎర్రదండు

ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లోని జైళ్లలో మగ్గుతున్న అమాయకులను వెంటనే విడుదల చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ విశాఖ జిల్లా కోరుకొండ దళ కార్యదర్శి విజయలక్ష్మి డిమాండ్ చేశారు.

- జైళ్లలో ఉన్న ఆదివాసీలను విడుదల చేయాలి
- మావోయిస్టు పార్టీ డిమాండ్
- దుర్గం అటవీప్రాంతంలో భారీ బహిరంగసభ నిర్వహణ
మల్కన్‌గిరి(ఒడిశా):
ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లోని జైళ్లలో మగ్గుతున్న అమాయకులను వెంటనే విడుదల చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ విశాఖ జిల్లా కోరుకొండ దళ కార్యదర్శి విజయలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ రెండు రాష్ట్రాల పోలీసులు మావోయిస్టులన్న సాకుతో ఆమాయక గిరిజనులను అరెస్టు చేసి జైళ్లలో పెడుతున్నారని ఆరోపించారు. జైళ్లలో బందీలుగా ఉన్న ఆదివాసీలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 13 నుంచి 19 వరకు మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.

అందులో భాగంగా ఆంధ్ర ఒడిశా సరిహద్దు (ఏవోబీ) జోన్ పరిధిలో ఒడిశా రాష్ట్రానికి చెందిన మల్కన్‌గిరి జిల్లా కుడుముల గుమ్మ సమితి రల్లెగెడ్డ పంచాయతీ పరిధిలోని దుర్గం అటవీ ప్రాంతంలో శనివారం సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించారు. అటవీ ప్రాంతంలో భారీ బ్యానర్లు కట్టారు. చుట్టుపక్కల అటవీ గ్రామాల నుంచి మావోయిస్టు సానుభూతిపరులతోపాటు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఊరేగింపుగా తరలివచ్చారు. జననాట్యమండలి కళాకారులు పలు ప్రదర్శనలు చేశారు. విప్లవ గీతాలను ఆలపించారు.

ఈ సభలో మాట్లాడిన విజయలక్ష్మితోపాటు పలువురు నాయకులు రెండు రాష్ట్రాల్లో మావోయిస్టుల పేరుతో అమాయకులను అరెస్టు చేసి జైళ్లలో బందీలుగా ఉంచారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, ఒడిశాలోని మల్కన్‌గిరి, కొరాపుట్, గజపతి జిల్లాలకు చెందిన వందలాదిమంది ఆదివాసీలు జైళ్లలో మగ్గుతున్నారన్నారు. సంపాదించే వ్యక్తి జైలు పాలు కావడంతో వారి కుటుంబాలన్నీ ఆకలితో అలమటిస్తున్నాయన్నారు. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement