ఆర్పీ ఠాకూర్‌పై సంచలన ఆరోపణలు

Endowment Former JC Chandra Shekhar Allegations On RP Thakur - Sakshi

సాక్షి,  విజయవాడ : మాజీ ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్‌ కారణంగా అక్రమ కేసుల్లో ఇరుక్కున్న అధికారులపై నమోదైన కేసుల్లో పారదర్శక విచారణ జరిపించాలని దేవాదాయ శాఖ మాజీ జాయింట్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. శుక్రవారమిక్కడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆర్పీ ఠాకూర్‌ బాధితుల సంఘం నేతలు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ ఆజాద్‌ మాట్లాడుతూ..‘ అధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు నియమ నిబంధనలు పాటించాలి. మొదట సదరు అధికారులపై విచారణ జరిపి అనంతరం చర్యలు తీసుకోవాలి. అయితే ఆర్పీ ఠాకూర్ తన సొంత ప్రాభవం కోసం.. మీడియా దృష్టిని ఆకర్షించడం కోసం నిబంధనలు పాటించలేదు. విచారణ చేయకుండా చర్యలు తీసుకోవాలని కింది స్థాయి అధికారులను ఇబ్బందులకు గురిచేసేవారు. సీఎం దగ్గర మెప్పు కోసం అధికారులను టార్గెట్ చేశారు. తనకు నచ్చిన మీడియాను తీసుకు వచ్చి ఆస్తుల విలువను పెంచి చూపేవారు. అధికారులను అల్లరిపాలు చేసేవారు. అక్రమాస్తుల కేసులలో సదరు వ్యక్తి పూర్వాపరాలు పరిశీలించకుండా, ఎవరు ఫిర్యాదు చేశారో కూడా పట్టించుకోకుండా చర్యలు తీసుకునేవారు’ అని ఆర్పీ ఠాకూర్‌పై ఆరోపణలు చేశారు.

వాళ్లను టార్గెట్‌ చేసి..
‘కింది స్థాయి అధికారులకు టార్గెట్లు పెట్టి మరీ ఇబ్బందులు పెట్టేవారు. వివిధ శాఖల్లో నెంబర్ 2 స్థాయిల్లో ఉన్నవారిని టార్గెట్ చేసేవారు. సుప్రీంకోర్టు తీర్పు అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటే 6 నెలల్లోగా తిరిగి నియామకం జరగాలి. కానీ ఆ తర్వాత కూడా పోస్టు ఇవ్వకుండా ఠాకూర్‌ అడ్డుతగిలేవారు.దీంతో సంవత్సరాలు గడిచినా ఆస్తులు ఆటచ్ అయ్యి, పోస్టులు లేక అధికారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. స్పెషల్ కోర్టుల ఆక్ట్ ప్రకారం జప్తు చేసిన ఆస్తులను కేసు పరిష్కారమయ్యే వరకు.. ప్రభుత్వ అవసరాలకు ఆ ఆస్తులను వాడుకునే అవకాశం ఉంటుంది. చట్ట ప్రకారం అవినీతి అధికారులకు శిక్ష పడాలి. కానీ ఆర్పీ ఠాకూర్‌.. కింది స్థాయి అధికారులకు టార్గెట్లు పెట్టడం వలన తప్పు చేయని వారిపై కేసులు పెట్టారు. కాబట్టి నిజాయితీ గల అధికారులకు న్యాయం చేయాలి’ అని చంద్రశేఖర్‌ ఆజాద్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు విఙ్ఞప్తి చేశారు.

కాగా డీజీపీ కావడానికి ముందు ఏసీబీ డీజీగా ఆర్పీ ఠాకూర్‌ పని చేశారు. డీజీపీగా పదవి చేపట్టిన తర్వాత కూడా ఠాకూర్‌ ఏసీబీని తన ఆధ్వర్యంలోనే ఉంచుకున్నారు. చంద్రబాబు ఆదేశాలతో ఏసీబీ డీజీగా కొనసాగుతూ చరిత్రలో ఎన్నడూ లేని సంప్రదాయానికి తెరతీశారు. ఈ క్రమంలో టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాగే పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top