ఎన్నికల కమిషన్ కొరడా | Election Commission whip | Sakshi
Sakshi News home page

ఎన్నికల కమిషన్ కొరడా

Aug 6 2014 12:30 AM | Updated on Sep 2 2017 11:25 AM

తెలంగాణ ప్రభుత్వ అదేశాలు లేనిదే తాము ఎన్నికల విధులు నిర్వర్తించబోమని మొండికేసిన అధికారులపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. తమ ఆదేశాలు ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని

సాక్షి, రాజమండ్రి :తెలంగాణ  ప్రభుత్వ అదేశాలు లేనిదే తాము ఎన్నికల విధులు నిర్వర్తించబోమని మొండికేసిన అధికారులపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. తమ ఆదేశాలు ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ అధికారులను హెచ్చరించడంతో ఖమ్మం కలెక్టర్  సూచనల మేరకు ఎంపీపీల ఎన్నిక నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయగా తదుపరి ఏర్పాట్లను అధికారులు మంగళవారం కొనసాగించారు. సోమవారం సాయంత్రమే ఎంపీటీసీ సభ్యులకు ఎన్నికల నోటీసులు అందజేశారు. దీంతో తూర్పుగోదావరి జిల్లా అధికారుల పర్యవేక్షణలో చింతూరు, కూనవరం, విఆర్‌పురం మండలాల ఎంపీపీ ఎన్నికలు బుధవారం నిర్వహించేందుకుఅడ్డంకులు తొలగిపోయాయి.
 
 కఠిన చర్యలుంటాయి
 విలీన మండలాల ఎన్నికలను తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం నిర్వహించాలని గత నెలలో ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా పరిషత్ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. కూనవరం ఎంపీపీ ఎన్నికలకు చింతూరు ఆర్‌అండ్ బీ డీఈ లాల్‌సింగ్, చింతూరు మండల పరిషత్ ఎన్నికలకు  పంచాయతీరాజ్ డీఈ వెంకటరెడ్డి, వీఆర్‌పురం ఎన్నికలకు ఆర్‌డబ్ల్యూస్ డీఈ వెంకటేశ్వర్లును నియమిస్తూ తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సీఈఓ సూర్యభగవాన్ ఆదేశాలు జారీచేశారు. అయితే వీరు తమ తెలంగాణ  ప్రభుత్వం చెబితేనే విధులు నిర్వర్తిస్తామని ఆదివారం వరకూ మొండికేశారు. ఈ విషయాన్ని సీఈఓ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్‌కు నివేదించగా, ఆమె ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు.
 
 ఈ విషయాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. తమ ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు ఉంటాయని ఎన్నికల సంఘ కమిషనర్ నవీన్‌మిట్టల్ హెచ్చరించారు. ఈ మేరకు ఇరు జిల్లాల అధికారులకు హెచ్చరికలు జారీచేశారు. ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులకు మరో సారి నోటీసులు జారీ చేయాలని, అయినా వాటిని ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకోవాలని, తూర్పుగోదావరి జిల్లా నుంచి డివిజన్ స్థాయి అధికారులను హుటాహుటిన రంగంలోకి దింపి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. దీంతో ఖమ్మం జిల్లా కలెక్టర్ ఇలంబర్తి ఎన్నికల విధులు నిర్వహించే అధికారులను పిలిపించి వివరించడంతోవారు ఎన్నికల నిర్వహణకు అంగీకరించారు.
 
 ఎన్నికలు జరిగే ప్రాంతాలివే
 ఖమ్మం జిల్లాలోని చింతూరు, భద్రాచలం, కూనవరం, వీఆర్ పురం మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. భద్రాచలం మండలంలో భద్రాచలం తెలంగాణ లోనే ఉండడంతో మిగిలిన గ్రామాలకు నెల్లిపాకలను మండల కేంద్రంగా చేసేందుకు నిర్ణయించారు. దీంతో ఈ మండలానికి ఎన్నికలు నిర్వహించడం లేదు. మిగిలిన మూడు మండలాల్లో బుధవారం ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు మండలాల ఎంపీపీల ఎన్నికల నిర్వహణ బాధ్యతను ఎన్నికల సంఘం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి అప్పగించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement