దేశ భవిష్యత్తు యువత ఆధారపడి ఉందని, యువత భవిష్యత్తు చదువుతో ముడిపడి ఉందని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మె ల్సీ చుక్కా రామయ్య అన్నారు.
సారంగాపూర్, న్యూస్‌లైన్ :
దేశ భవిష్యత్తు యువత ఆధారపడి ఉందని, యువత భవిష్యత్తు చదువుతో ముడిపడి ఉందని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మె ల్సీ చుక్కా రామయ్య అన్నారు. మండలంలోని కౌట్ల(బి) గ్రామంలోని రైతు పరస్పర పొదుపు సంఘం(మాక్స్)ను ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థి తన చిన్నతనం నుంచి మంచి నడవడిక కలిగి ఉండాలన్నారు.
తద్వారా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని తెలిపారు. కౌట్ల(బి)లో రైతులు తమకు తామే సహాయ సహకారాలు అందించుకుంటూ జాతీయ స్థాయిలో మాక్స్ పేరును నిలపడం గర్వకారణమని ప్రశంసించారు. ఇక్కడి రైతుల్లోనూ చాలామంది పట్టభద్రులు ఉండటం ఆనందంగా ఉందని అన్నారు. కార్మిక, ఉపాధికల్పన శాఖ అధికారి ముత్యంరెడ్డి, డీసీఎంఎస్ అధ్యక్షుడు అయిర నారాయణరెడ్డి, మాక్స్ అధ్యక్షుడు వంగ రాంరెడ్డి పాల్గొన్నారు.