అన్నింటా విద్యాశాఖ వెనుకంజ | Education department setback in all government schemes | Sakshi
Sakshi News home page

అన్నింటా విద్యాశాఖ వెనుకంజ

Oct 26 2013 4:40 AM | Updated on Sep 1 2017 11:58 PM

ప్రభుత్వం విద్యాశాఖలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలులో, విద్యార్థులకు చదువు చెప్పడంలో విద్యాశాఖ వెనుకంజలో ఉందని కలెక్టర్ అహ్మద్ బాబు అభిప్రాయపడ్డారు.

కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రభుత్వం విద్యాశాఖలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలులో, విద్యార్థులకు చదువు చెప్పడంలో విద్యాశాఖ వెనుకంజలో ఉందని కలెక్టర్ అహ్మద్ బాబు అభిప్రాయపడ్డారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంఈవోలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడల్ స్కూల్స్, స్కాలర్‌షిప్‌లు, విద్యార్థుల ఆధార్ అనుసంధానం, ఎంఈవోల పనితీరు, కేజీబీవీ, తదితర వాటిపై సమీక్షించారు.
 
జిల్లాకు 27 లక్షల 96 వేల 703 పాఠ్యపుస్తకాలు రాగా, ఇంకా 3 లక్షల 50 వేల పాఠ్యపుస్తకాలు గోదాంలోనే ఉన్నాయని పేర్కొన్నారు. 3,360 పాఠశాలకు మరుగుదొడ్లు మంజూరైనా ఇప్పటివరకు 1,327 పాఠశాలల్లో ఇంకా పూర్తి కాలేదన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, ఎంఈవో, స్పెషల్ ఆఫీసర్లు జాయింట్ అకౌంట్‌లో డబ్బులు జమ చేసి పనులను వారికి అప్పగించాలన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఎం-బుక్‌లో నమోదు చేయాలని సూచించారు. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.35 వేలు కేటాయించారని పేర్కొన్నారు. తిర్యాణి మండలానికి 108 మరుగుదొడ్లు మంజూరు కాగా, అందులో 8 మాత్రమే పూర్తి చేశారని సంబంధిత ఎంఈవో కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వీడీసీ, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ, ఉపాధ్యాయులు కలిసి పూర్తి చేయాలని ఎంఈవోకు సూచించారు.
 
వివరాలన్నింటినీ మండల ప్రత్యేక అధికారులకు సమర్పించాలని ఎం ఈవోలను ఆదేశించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారంగా పాఠశాలలు సమయం పాటించాలని సూచించారు. ఈ సంవత్సరం పరీక్షల్లో కాపీయింగ్ జరగకుండా చూస్తానని పేర్కొన్నారు. పోలీసులు, అధికారులతో సెంటర్ల వద్ద బందోబస్తు ఉంటుందని తెలిపారు. వసతిగృహాల మరమ్మతు కోసం రూ.58 లక్షలు  కేటాయించారని, 34 వసతి గృహాల్లో మరమ్మతులు చేపట్టినట్లు కనిపించడం లేదన్నారు. పాఠశాలలో వంట స్టోర్ రూమ్, వంట షెడ్ నిర్మాణాలు చేపట్టినా ఇంకా పూర్తి చేయడం లేదన్నారు. నిబంధనలు అతిక్రమించే ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు జేసీ వెంకటయ్య, డీఈవో అక్రముల్లాఖాన్, నిర్మల్ ఆర్డీవో అరుణశ్రీ, ఎంఈవోలు, అధికారులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement