అరణ్యరోదన.. | East Godavari People Suffering With 108 Delayed | Sakshi
Sakshi News home page

అరణ్యరోదన..

Apr 17 2019 12:11 PM | Updated on Apr 17 2019 12:11 PM

East Godavari People Suffering With 108 Delayed - Sakshi

108లో జన్మించిన చిన్నారి

తూర్పుగోదావరి  ,రంపచోడవరం: గిరిజనుల ఆరోగ్య పరిరక్షణకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వాలు, ఆచరణలో మాత్రం చేతులెత్తేస్తున్నాయి. కనీస వైద్య సేవలు అందక గిరిజనం మృత్యువాతపడుతున్నారు. ఇప్పటికీ నాటు వైద్యం, చెక్క మందులు తమను రక్షిస్తాయని ఆదివాసీలు నమ్ముతున్నారంటే ప్రభుత్వ ఆసుపత్రుల దారుణ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైద్యుల కొరత, మందులు అందుబాటులో లేకపోవడం, లేబొరేటరీలు లేకపోవడం వంటి పరిస్థితుల్లో గిరిజనం రోగాలతో అల్లాడుతోంది. కాళ్లవాపు, తదితర వ్యాధులతో అనేక మంది ఆదివాసీలు ప్రాణాలు వదులుతున్నా టీడీపీ సర్కారు పట్టించుకున్న పాపాన పోలేదు.

ఏరియా ఆసుపత్రిలో అందని వైద్య సేవలు
రంపచోడవరం ఏరియా ఆసుపత్రి రోగులకు వైద్య సేవలు అందడం లేదు. అత్యవసర వైద్యం కోసం వచ్చే వారిని రాజమహేంద్రవరం, కాకినాడ జీజీహెచ్‌లకు రిఫర్‌ చేస్తున్నారు.అక్కడికి వెళ్లినా వారిని పట్టించుకునే నాథుడే లేరు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులు లేకపోవడంతో అత్యవసర వైద్యం అందడం లేదు. ప్రసూతి వైద్య సేవలు అసలు అందుబాటులోనే లేవు. ఇందుకు ఆదివారం చోటు చేసుకున్న సంఘటనే  నిదర్శనం. రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామానికి చెందిన దబ్బా మాధురి రెండో కాన్పు కోసం రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో చేరింది.

వైద్యులు పరీక్షించి రక్తం తక్కువ ఉందని రక్తం ఎక్కించారు. ఆదివారం రాత్రి నొప్పులు రావడంతో ఏరియా ఆసుపత్రిలో కాన్పు కష్టమవుతోందని రాజమహేంద్రవరం రిఫర్‌ చేశారు. స్థానికంగా 108 అందుబాటులో లేకపోవడంతో మారేడుమిల్లి నుంచి 108 వాహనం వచ్చిన తరువాత ఆ వాహనంలో తరలించారు. మార్గం  మధ్యలోనే నొప్పులు ఎక్కువ కావడంతో సీఎంటీ అబ్దుల్‌ హమీద్, ఫైలట్‌ ప్రసాద్‌ సహాయంతో సుఖప్రసవం జరిగింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఇలాంటి సంఘటనలు అనేకం జరిగిన ప్రభుత్వ యంత్రాంగంలో ఎలాంటి చలనం లేదు. మాతాశిశు మరణాల సంఖ్య పెరిగిపోతున్నా ప్రసూతి సేవలు మెరుగుపర్చలేదు. ఏజెన్సీ 11 మండలాలకు చెందిన గిరిజనులు అత్యవసర వైద్యం కోసం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి వస్తారు. ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులు కొరత ఏళ్ల తరబడి వేధిస్తోంది. పేరుకు మాత్రం వంద పడకల ఆసుపత్రైనా అందుకు తగిన వసతులును మాత్రం ఏర్పాటు చేయలేదు.

అందుబాటులో లేని అంబులెన్స్‌లు
రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పరిధిలో 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఎనిమిది చోట్ల అంబులెన్స్‌ సదుపాయం ఉంది. మిగిలిన చోట్ల పీహెచ్‌సీకి వచ్చిన అత్యవసర కేసులను ఏరియా ఆసుపత్రికి పంపేందుకు 108పై ఆధారపడాల్సి ఉంది. ఏజెన్సీలో రంపచోడవరంలో మినహా అన్ని చోట్ల 108 అంబులెన్స్‌లు తిరిగే పరిస్థితి లేదు. నాలుగు లక్షలు కిలోమీటర్లు పైబడి తిరగడంతో మరమ్మతులకు గురయ్యాయి. ఏడాది కాలం నుంచి 108 అంబులెన్స్‌లో కనీసం ఆక్సిజన్‌ కూడా అందుబాటులో ఉండడం లేదు. రంపచోడవరం ఐటీడీఏలో రెండు అంబులెన్స్‌లకు ఒకటి మాత్రమే పనిచేస్తోంది. ఇటువంటి దుర్భర పరిస్థితిలో వైద్య సేవలను మెరుగుపరచాలనే ఆలోచనలో అటు అధికారుల్లో, ఇటు పాలకుల్లో లేకపోవడం విచారకరం. పీహెచ్‌సీలకు ఆయిల్‌ ఖర్చు కోసం నెలకు రూ.10వేలు కేటాయించారు. నెలలో మూడు నుంచి నాలుగు కేసులను తరలించేందుకే సరిపోతుంది. తరువాత వచ్చిన కేసులను ఏరియా ఆసుపత్రికి పంపే పరిస్థితి కష్టమవుతోంది.

పేరుకే పెద్దాసుపత్రి
చింతూరు ఏరియా ఆసుపత్రి పేరుకే పెద్దాసుపత్రి అన్నట్టుగా తయారైంది. కోట్లు ఖర్చు పెట్టి ఆసుపత్రి నిర్మించినా పూర్తి స్థాయిలో వైద్యసిబ్బందిని నియమించలేదు. వైద్యం కోసం గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర కేసులను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి రిఫర్‌ చేస్తున్నారు. అక్కడి నుంచి రాజమహేంద్రవరం, కాకినాడ తరలిస్తున్నారు. వైద్యం అందేలోపే ప్రాణాలు పోతున్నాయి.– సోడె బాయమ్మ, ఎంపీటీసీ,చింతూరు

డయాలసిస్‌ సెంటర్‌ ఊసే లేదు
విలీన మండలాల్లో కాళ్లవాపు వ్యాధితో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నా అందుకు గల కారణాలను తెలుసుకోలేకపోయారు. కాళ్లవాపు వ్యాధిగ్రస్తులకు డయాలసిస్‌ అవసరమని చింతూరు ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటుకు చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. నేటికీ చింతూరు ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్యులు, డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement