‘పచ్చ’పాతంపై మహిళాగ్రహం

Dwcra Groups Womens Slams Panchayat Officer In Kurnool - Sakshi

 టీడీపీ కండువా వేసుకుంటేనే చెక్కులిస్తామంటున్న నేతలు

ఆత్మకూరులో పోలీస్‌స్టేషన్‌కు   చేరిన పసుపు–కుంకుమ చెక్కుల పంచాయితీ

ధర్నాలు, రాస్తారోకోలతో పొదుపు మహిళల నిరసన

డీఎస్పీ హామీతో నిరసన విరమణ

కర్నూలు, ఆత్మకూరు: ‘పచ్చ’పాతంపై డ్వాక్రా మహిళల నిరసనాగ్రహం కొనసాగుతోంది. టీడీపీ కండువా వేసుకుంటేనే పసుపు–కుంకుమ చెక్కులు ఇస్తామని టీడీపీ నేతలు, అధికారులు చెప్పడంపై గురువారం నగర పంచాయతీ కార్యాలయాన్ని దిగ్బంధించి ఆందోళన చేపట్టారు. అయితే శుక్రవారం కూడా నిరసనలతో హోరెత్తించారు. చెక్కులు ఇస్తామని హామీ ఇచ్చిన అధికారులు, ప్రజాప్రతినిధులు రోజుల తరబడి నిర్లక్ష్యం చేస్తుండడం, ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేయడం, కార్యాలయాలకు అధికారులు రాకపోవడంతో ఆందోళన ఉధృతం చేశారు. చెక్కులు ఇస్తారన్న ఉద్దేశంతో ఉదయం తొమ్మిది గంటలకు నగర పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. 11 గంటలయినా కమిషనర్‌ రాలేదు.

ఆయన చాంబర్‌కు తాళం వేసి ఉండటంతో కమిషనర్‌ రాకపై అక్కడున్న అధికారులను అడిగారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో కమిషనర్, సీఓ వచ్చి చెక్కులు పంచే వరకు అధికారులెవరూ కార్యాలయంలో కూర్చోవద్దంటూ అందరినీ బయటకు పంపి కార్యాలయానికి తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు.  అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరారు. ఎమ్మెల్యే బుడ్డా, సీఎం డౌన్‌..డౌన్‌... అని నినాదాలు చేస్తూ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయం, కొత్తపేట మసీదు, నంద్యాల టర్నింగ్, పోలీస్‌ స్టేషన్‌ మీదుగా గౌడ్‌ సెంటర్‌కు చేరుకున్నారు. మానవహారంగా ఏర్పడి రహదారిని దిగ్బంధించారు.  చెక్కులు ఇచ్చేవరకు కదిలేది లేదని స్పష్టం చేశారు. సీఐ కృష్ణయ్య వచ్చి చెక్కులు ఇచ్చేలా అధికారులతో మాట్లాడతానని చెప్పినా మహిళలు వినలేదు. దీంతో స్టేషన్‌ వద్దకు అధికారులను పిలిపిస్తానని, చెక్కులను ఇప్పిస్తాననడంతో అందరూ అక్కడికి బయలుదేరారు.

డీఎస్పీ హామీతో ఆందోళన విరమణ..
పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకున్న మహిళలు తమ చెక్కులు ఇప్పించాలంటూ పట్టుబట్టారు. దీంతో డీఎస్పీ వెంకటరావు స్పందిస్తూ సోమవారం తాము దగ్గరుండి అధికారులతో చెక్కులు పంపిణీ చేయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు.  

నువ్వు అమ్ముడుపోయి మమ్మల్ని వేధిస్తావా?
ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ఫ్యాన్‌ గుర్తుపై గెలిచారు. మేమే ఓటు వేశాం. మా ఓట్లతో ఆయన గెలిచి టీడీపీకి అమ్ముడుపోయారు. మాకు రూ.4కోట్లు ఇస్తే ఆ పార్టీ కండువాలు వేసుకుంటాం. పార్టీ ఫిరాయించి ఓటు వేసిన మహిళలను బజారుకు ఈడ్చుతారా.. మా బాధ అర్థం కాదా.. మహిళలను రోడ్ల వెంట తిప్పడం సమంజసమా.. చెక్కులు ఇచ్చే వరకు ఆందోళన చేస్తాం.– విజయలక్ష్మి, పొదుపు మహిళ, ఆత్మకూరు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top