అవినీతిని సహించం..!

Dwama PD Hari Haranath Reddy Special Interview - Sakshi

ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తాం

వలసల నియంత్రణే లక్ష్యం

రూ. 270 కోట్లు ఖర్చు చేశాం

వారం రోజుల్లో వేతన బకాయిల చెల్లింపు

‘సాక్షి’తో డ్వామా పీడీ హరి హరనాథ్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, కడప : ఉపాధి హామీ పథకం జిల్లాకు వరం. నాలుగేళ్లుగా జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో  వలసలు నియంత్రించేందుకు ప్రతి ఒక్కరికీ పని కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. ఇందుకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. రోజూ లక్ష పని దినాలు నమోదయ్యేలా క్షేత్ర సిబ్బంది ని నిత్యం పర్యవేక్షిస్తున్నాం. ఈ పథకం పరిధిలో ఏ స్థాయిలో కూడా అవినీతిని సహించేది లేదు. అవినీతికి ఎవరైనా పాల్పడుతున్నట్లు తెలిస్తే నేరుగా నాకు ఫిర్యాదు చేయొచ్చు. ఎవ్వరిని వదిలిపెట్టం. కఠిన చర్యలు తీసుకుంటాం.’ అని జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) పీడీ వై హరి హరనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 270 కోట్లు ఖర్చు చేశామని ఇందులో సింహభాగం కూలీలకే చెల్లించామని ఆయన వివరించారు. జిల్లాలో ఉపాధి, వాటర్‌షెడ్ల పనుల నిర్వహణ, సిబ్బంది పనితీరు..అక్రమాలు.. వంటి వాటిపై ‘సాక్షి’ ఆయనతో ముఖాముఖి నిర్వహించింది. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

ప్రతి కూలీకి పనికల్పిస్తాం..
ప్రతి కూలీకి పని కల్పించడమే కర్తవ్యంగా పెట్టుకున్నాం. ఆ దిశగా క్షేత్రస్థాయి సిబ్బందిని సమాయత్తం చేస్తున్నాం. కూలీలు అడిగినా పనులు కల్పించకపోతే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించాం. ఇప్పుడిప్పుడు పని దినాల సంఖ్య పెరుగుతోంది. రోజూ 80 వేల మంది దాకా కూలీలు పనులకు వస్తున్నారు. ఈ సంఖ్యను లక్షకుపైగా పెంచాలనేది లక్ష్యం. రాజంపేట, జమ్మలమడుగు, పులివెందుల ప్రాంతాల్లో పొలం పనులు జరుగుతున్నాయి. రానున్న రెండు మూడు రోజుల్లో పని దినాల సంఖ్య లక్షకుపైగా పెరిగే అవకాశం ఉంది. అలాగే 2018–19 ఆర్థిక సంవత్సరానికి 1.30 కోట్ల పని దినాలు   లక్ష్యంగా పెట్టుకున్నాం.

∙రూ.270 కోట్లు ఖర్చు చేశాం..
ఈ ఆర్థిక సంవత్సరంలో పని దినాల నమోదు లక్ష్యం 1.39 కోట్లు. ఇప్పటికే 1.08 కోట్ల పని దినాలను పూర్తి చేశాం. మిగిలిన పని దినాలను మార్చి నాటికి పూర్తి చేస్తాం. ఈ ఏడాది ఉపాధి హామీ కింద రూ.330 కోట్లు ఖర్చు చేయాలన్నది లక్ష్యం. ఇప్పటి దాకా రూ.270 కోట్లు ఖర్చు చేశాం. ఇందులో కూలీలకే రూ.157 కోట్లు చెల్లించాం. సామగ్రి కొనుగోలు కింద మరో రూ.87 కోట్లు వ్యయం చేశాం. వేతనాలకు రూ.18 కోట్లు వెచ్చించాం.

∙బాధ్యతతో పనిచేయాలి..
క్లస్టర్‌లో సహాయ పీడీలు విధుల పట్ల ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించరాదు. కేవలం సిబ్బందిపై కర్ర పెత్తనం చేస్తామంటే కుదరదు. సమష్టిగా పని చేస్తేనే ఫలితాలు సాధ్యం. ఇదే విషయాన్ని ప్రతి వారం సమీక్షల్లో చెబుతున్నాం.

రూ.2.36 కోట్ల అవినీతి జరిగింది..
పదమూడేళ్ల కిందట ఈ పథకం మొదలైంది. మొత్తం 12 విడతల సామాజిక తనిఖీలు జరిగాయి. ఉపాధి, వాటర్‌షెడ్ల పనుల్లో దాదాపు రూ.9.84 కోట్ల అక్రమాలు జరిగినట్లు సామాజిక తనిఖీ బృందాలు తేల్చాయి. ఇందులో రూ.4.86 కోట్లు విచారణ తర్వాత రద్దు చేశాం. మరో రూ.2.36 కోట్ల మేర వసూలు చేశాం. ఆర్‌ఆర్‌ చట్టం కింద రూ.1.53 కోట్లు, మిగిలిన రూ.96 లక్షలు వేతనాల రికవరీ కింద వసూలు చేయాల్సి ఉంది.

అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు..
ఉపాధి, వాటర్‌షెడ్ల పనుల్లో ఏస్థాయి అధికారైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి. ఏ స్థాయిలో అవినీతిని సహించేది లేదు. అధికారులెవరైనా అవినీతికి పాల్పడుతున్నట్లు తెలిస్తే.. నేరుగా నాకు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. అవినీతి ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం.

పీఓలపై పని ఒత్తిడి ఉన్నది వాస్తవమే..
ఉపాధి హామీ పథకంలో ఎంపీడీఓలే పీఓలుగా పనిచేస్తున్నారు. వీరు సరిగా పనిచేయలేదన్నది వాస్తవం కాదు. నేను వచ్చిన తర్వాత తరచూ వారితో మాట్లాడుతున్నా.. మండల కంప్యూటర్‌ కేంద్రాల్లో ఎంపీడీఓలు ఉండి ప్రతి లావాదేవీని వారే చేస్తున్నారు. అయితే వారు ఇతర పనుల పట్ల దృష్టి సారించడంతో   పని ఒత్తిడి ఉన్న మాట వాస్తమే. అలాగని వారు ఉపాధి పనిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయడం లేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top