సమస్యగా మారిన సంతానలేమి

Doctors Rally on Infertility Awareness in Vijayawada - Sakshi

ఒకప్పుడు 3 శాతం ఉండగా, నేడు 8 శాతానికి చేరిన వైనం

ఒత్తిళ్లే కారణం

ఐయూఐ, ఐవీఎఫ్‌ సెంటర్‌లకు క్యూకడుతున్న దంపతులు

నవ్యాంధ్ర రాజధాని జిల్లాలో సంతానలేమి సమస్య రోజురోజుకు పెరుగుతోంది. ఉరుకులు పరుగుల జీవన విధానం, పనిఒత్తిళ్లు, శారీరక శ్రమ లేకపోవడమే కారణంగా వైద్యులు చెబుతున్నారు. మధుమేహం, హైపర్‌ టెన్షన్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు, ఆ జాబితాలో సంతానలేమి సమస్య కూడా చేరింది.

లబ్బీపేట(విజయవాడ తూర్పు): నవ్యాంధ్ర రాజధాని జిల్లాలో సంతానలేమి సమస్య రోజురోజుకు పెరుగుతోంది. ఉరుకులు పరుగుల జీవన విధానం, పనిఒత్తిడిలు, శారీరక శ్రమ లేకపోవడం కారణంగా చెబుతున్నారు. మధుమేహం, హైపర్‌ టెన్షన్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు, ఆ జాబితాలో సంతానలేమి సమస్య కూడా చేరింది. సంతాన లేమి సమస్యను ఎదుర్కొంటున్న వారిలో 80 శాతం మందిలో జీవన విధానం ప్రధాన కారణంగా తేలింది. ఆలస్య వివాహాలు, పెళ్లయి కొంతకాలం వరకు పిల్లలు వద్దనుకోవడం కూడా సంతానలేమికి సమస్యగా మారింది. జీవన విధానం కారణంగా మహిళలు, పురుషుల్లో హార్మోన్లు అసమతుల్యత ఎక్కువుగా ఉంటుంది. దీంతో మహిళల్లో అండం విడుదల కాకపోవడం, పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

ఇవీ కారణాలు
మహిళల్లో ప్రధానంగా హార్మోన్స్‌ ఇన్‌బ్యాలెన్స్, ట్యూబల్‌ బ్లాక్స్, లో ఓవేరియన్‌ డిఫెక్ట్, గర్భాశయ, ఎండో మెట్రియాసిస్‌ సమస్య సంతానలేమికి కారణాలుగా నిలుస్తున్నాయి. ఒబెసిటీ, ఒత్తిళ్ల కారణంగా హార్మన్ల అసమతుల్యత, ఆ ఫలితంగా అండం సరైన సమయంలో విడుదల అవ్వకపోవడం జరుగుతుంది. నీటి బుడగలు(పీసీఓడీ), ఇవి కొందరిలో 12, 13 ఏళ్ల వయస్సులోనే వస్తుంటాయి. పెళ్లి అయిన  తర్వాత పెరిగిపోయి గర్భధారణ రాకుండా చేస్తాయి. ఈ సమస్య 30 శాతం మందిలో ఉంటుంది. కొందరిలో ట్యూబల్‌ బ్లాక్స్‌ ఉంటాయి. ఇవి పుట్టుకతోనే కొందరిలో ఉంటే, మరికొందరిలో సెప్టిక్‌ అబార్షన్స్, ఇతర ఇన్‌ఫెక్షన్‌ల కారణంగా బ్లాక్స్‌ ఏర్పడతాయి. థైరాయిడ్, పొలాక్టిన్‌ హార్మన్ల అసమతుల్యతగా చెబుతున్నారు. గర్భాశయంలో లోపాలు ఉన్న వారికి గర్భం వచ్చినా అబార్షన్‌ అయిపోతుంటుంది.

పురుషుల్లో సంతాన సమస్యలు
వీర్యం నాణ్యత, శుక్రకణాలు(కౌంట్‌) తక్కువుగా ఉండడం, వృషణ, వృషణ నాళాలకి సంబంధించిన వ్యాధులు, పురుషుల హార్మోన్‌ వ్యాధులు, జన్యు సంబంధమైన వ్యాధులు ఎక్కువుగా వస్తున్నాయి. ప్రొఫెషన్‌లో ఎదుర్కొంటున్న ఒత్తిడి కూడా కారణమే. మద్యం, పొగతాగడం, పొగాకు ఉత్పత్తులు వినియోగించే వారిలో సంతానలేమి సమస్యలు పెరుగుతాయి.

ఆలస్య వివాహాలు కారణమే
ఇటీవల కాలంలో ఆలస్య వివాహాలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగింది. సంతానలేమి సమస్యకు ఇది కూడా ఒక కారణమే. పురుషులు 30 ఏళ్లలోపు, మహిళలు 25 ఏళ్లలోపు వివాహాలు చేసుకుంటే సంతానానికి సరైన సమయంగా చెప్పవచ్చు. మరికొందరు వివాహమైనా పిల్లల పుట్టకుండా వాయిదా వేస్తూ వస్తున్నారు. కొంతకాలం తర్వాత వారు పిల్లలు కావాలనుకున్నా పుట్టని పరిస్థితి నెలకొంటుంది. అందుకే ఏ వయస్సులో చేయాల్సినవి ఆ వయస్సులో చేయాలని గతంలో పెద్దలు అనేవారు. ఇప్పుడు వైద్యులు కూడా అదే సూచిస్తున్నారు.

చింతన వద్దు..
లబ్బీపేట(విజయవాడతూర్పు): సంతనం కలగని వారు చింతించాల్సిన అవసరం లేదని, ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని రిటైర్డ్‌ వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ రమాదేవి అన్నారు. సంతాన సాఫల్య వైద్య నిపుణుల సమాఖ్య(ఇసార్‌) ఆధ్వర్యంలో సంతాన సాఫల్యతపై అవగాహన కలిగించేందుకు విజయవాడలో వాక్‌థాన్‌ ఆదివారం నిర్వహించారు. సిద్ధార్థ ఆడిటోరియం వద్ద ప్రారంభమైన అవగాహన నడక పిన్నమనేని పాలీ క్లినిక్‌ రోడ్డు, బెంజిసర్కిల్‌ వరకూ కొనసాగింది. ఈ వాక్‌థాన్‌ను డాక్టర్‌ ఆర్‌ఎస్‌ రమాదేవి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సకాలంలో సంతానం కలగలేదని దంపతులు నాటు వైద్యం చేయించుకోవడం మానుకోవాలన్నారు. సంతానం కలగక పోవడానికి గల స్పష్టమైన సమాచారం నిపుణుల వద్ద నుంచి పొంది, తగు పరిష్కారాలను పొందాలన్నారు. సంతాన సాఫల్యం కోసం మారుతున్న కాలానికి అనుగుణంగా అనేక వైద్య విధానాలు, ఔషధాలు లభిస్తున్నాయన్నారు. సంతాన సాఫల్యతలో నిష్ణాతులైన వైద్యులందరూ కలిసి ఇసార్‌ పేరుతో ఒక సమైక్య సంఘాన్ని ఏర్పాటు చేసి, రోగులకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. పెళ్లయిన దంపతులకు జీవన విధానంలో ఒక అమరిక, తగు ఆహారపు అలవాట్లు, వ్యాయామం తప్పనిసరి అన్నారు. కార్యక్రమంలో ఇసార్‌ ఏపీ చాప్టర్‌ అధ్యక్షురాలు డాక్టర్‌ పద్మజ, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ చందన వీరమాచినేని, డాక్టర్‌ స్వప్న, డాక్టర్‌ అనిత తదితరులు పాల్గొన్నారు.

కారణం తెలుసుకోవడం ముఖ్యం
సంతానలేమితో తమ వద్దకు వచ్చిన దంపతులకు ముందుగా,  అందుకు గల కారణాలను తెలుసుకుంటాం. సమస్య భార్యలో ఉందా..భర్తలో ఉందో తెలుసుకుంటాం. సమస్య తలెత్తడానికి గల కారణం తెలుసుకుని దాని పరిష్కారానికి అవసరమైన సూచనలిస్తాం. దీంతో చాలా మంది కొద్దిరోజుల్లోనే గర్భం దాల్చడం జరగుతుంది. మందులతో గర్భధారణ లేని వారికి ఐవీఎఫ్, ఐయూఐ పద్దతులను అనుసరిస్తాం.
– డాక్టర్‌ చందన వీరమాచినేని, ప్రసూతి, సంతాన సాఫల్య నిపుణురాలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top