తెల్ల కోటు.. వేసుకుంటే ఒట్టు

Doctors Negligence on Coat Kurnool Hospital - Sakshi

పెద్దాసుపత్రిలో డ్రెస్‌ కోడ్‌ పాటించని వైద్యులు, సిబ్బంది

అయోమయానికి గురవుతున్న రోగులు, బంధువులు

దర్జాగా అపరిచిత వ్యక్తుల సంచారం

చోద్యం చూస్తున్న సెక్యూరిటీ సిబ్బంది

శుభ్రంగా డ్రెస్‌ వేసుకుని, నీట్‌గా షేవింగ్‌ చేసుకుని కర్నూలుపెద్దాసుపత్రిలో తిరిగితే చాలు రోగులు, వారి కుటుంబసభ్యులు మాకు వైద్యం చేయండని వెంటపడతారు. ఇక్కడ డాక్టర్‌ ఎవరో.. సాధారణ వ్యక్తి ఎవరో అర్థం గాని పరిస్థితి నెలకొంది. వైద్యుల్లో చాలా మంది డ్రెస్‌ కోడ్‌ పాటించడం లేదు. వారిని చూసి జూనియర్‌ వైద్యులూ తెల్లకోటు జోలికి వెళ్లరు. ఫలితంగా ఎవరు ఎవరికి వైద్యం చేస్తున్నారో అర్థం గాని పరిస్థితి. ఈ క్రమంలోనే అగంతకులు మోసాలకు పాల్పడుతున్నారు.

కర్నూలు (హాస్పిటల్‌): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 400 మంది దాకా వైద్యులు (ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు), అంతకు రెట్టింపు సంఖ్యలో జూనియర్‌ వైద్యులు, హౌస్‌ సర్జన్లు కలిసి రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఆసుపత్రికి ప్రతిరోజూ 3 వేల మంది ఓపీ రోగులు, 1500 మంది దాకా ఇన్‌ పేషంట్లు చికిత్స పొందుతున్నారు. అటు కేసీ కెనాల్‌ నుంచి ఇటు హంద్రీనది వరకు దాదాపు రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో సువిశాల ప్రాంతంలో ఏర్పాటైన ఈ బోధనాసుపత్రిలో పాత, కొత్త భవనాలు 30కి పైగా ఉన్నాయి. ఇంత పెద్ద ఆసుపత్రిలో ఎవరు, ఎక్కడ ఉంటారో, ఏ వార్డు ఎక్కడో తెలుసుకోవడం ఒక్కోసారి ఏళ్లకొద్దీ ఆసుపత్రిలో పనిచేసే వారికే సరిగ్గా అర్థం కాదు. ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ పనిచేసే వారిని గుర్తించడమూ కష్టమే.  

డ్రెస్‌ కోడ్‌కు నీళ్లొదిలారు...!
సాధారణంగా ప్రతి చిన్న ఆసుపత్రిలో, ప్రైవేటు కార్యాలయాల్లో డ్రెస్‌ కోడ్‌ ఉంటుంది. కార్పొరేట్‌ ఆసుపత్రులు, సంస్థల్లో అయితే ఇది తప్పనిసరి. డ్రెస్‌ కోడ్‌ లేకపోతే హాజరు కూడా తీసుకోరు. వారు చేసే పనిని బట్టి దుస్తులు, ఐడీ కార్డు ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా ఉండాలి. అయితే నేషనల్‌ అక్రిడేషన్‌ బోర్డు ఆఫ్‌ హాస్పిటల్‌(ఎన్‌ఏబీహెచ్‌) గుర్తింపు కోసం వెళ్తున్న కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో డ్రెస్‌ కోడ్‌కు నీళ్లొదిలారు. మెజారిటీ వైద్యులు సాధారణ వ్యక్తుల్లాగే ఆసుపత్రిలో తిరుగుతుంటారు. అలాగే రోగులకు వైద్యం అందిస్తుంటారు. వారికి ఎలాంటి డ్రెస్‌ కోడ్‌ ఉండదు. కొందరు వైద్యుల మెడలో స్టెత్‌ ఉండటాన్ని బట్టి వారిని డాక్టర్‌ అనుకోవాలి. మరికొందరైతే అసలు స్టెత్‌ కూడా వాడరు. సాధారణ డ్రెస్‌లో వెళ్లి రోగులను పలకరించి వైద్యం సూచించి వెళ్తుంటారు. యథా రాజా తదా ప్రజా అన్నట్లు వీరిని చూసి పీజీ వైద్య విద్యార్థులు, హౌస్‌సర్జన్లు సైతం అధిక శాతం డ్రెస్‌ కోడ్‌ పాటించడం లేదు. హౌస్‌సర్జన్లకు, పీజీ వైద్యులకు వేర్వేరుగా ఆప్రాన్‌(తెల్లకోటు) ఉంటుంది. కానీ వారు తెల్లకోటు వాడరు. మరికొందరైతే టీ షర్ట్‌ ధరించి చేతిలో స్టెత్‌ పట్టుకుని తిరుగుతూ వైద్యం చేస్తుండటం అత్యవసర విభాగాల్లోనూ కనిపిస్తుంది. డ్రెస్‌ కోడ్‌ పాటించాలని అటు ఉన్నతాధికారులు గానీ, ఇటు వారి చీఫ్‌లు గానీ గట్టిగా చెప్పకపోవడం గమనార్హం.  

దర్జాగా అపరిచిత వ్యక్తుల సంచారం
ఆసుపత్రిలో పారిశుధ్య కార్మికులకు, సెక్యూరిటీ గార్డులకు వేర్వేరుగా డ్రెస్‌ కోడ్‌ పాటిస్తున్నారు. వీరితో పాటు నర్సులు, నర్సింగ్‌ విద్యార్థినిలు డ్రెస్‌ కోడ్‌ అమలు చేస్తున్నారు. వీరు మినహా రెగ్యులర్‌ వైద్యులు, ఉద్యోగులు, పారామెడికల్‌ సిబ్బందితో పాటు నాల్గవ తరగతి సిబ్బంది సైతం డ్రెస్‌ కోడ్‌ పాటించడం లేదు. ఈ కారణంగా ఆసుపత్రిలో ఇటీవల కాలంలో అపరిచిత వ్యక్తుల సంచారం అధికమైంది. రెండు రోజుల క్రితం ఓ అపరిచిత వ్యక్తి వైద్యునిగా చెప్పుకుంటూ నేరుగా క్యాజువాలిటీలోనే తిరిగాడు. కొందరు రోగులకు వైద్యం చేస్తున్నట్లు నటించాడు. శరీన్‌నగర్‌కు చెందిన లక్ష్మిదేవి అనే మహిళకు వైద్యం చేస్తున్నట్లు నటించి, ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసును అపహరించి ఉడాయించాడు. ఇతనే కాదు ఆసుపత్రిలో అపరిచితుల సంచారం ఇటీవల అధికమైంది. ఆసుపత్రి సిబ్బంది మాదిరిగా ఇక్కడ తిరుగుతూ రోగులు, వారి కుటుంబీకుల నుంచి అందినకాడికి దండుకుని పారిపోతున్నారు. ఆసుపత్రిలో అధిక శాతం డ్రెస్‌ కోడ్‌ ఎవరూ పాటించకపోవడంతో ఎవరు ఆసుపత్రికి చెందిన వారో ఎవరు పరాయి వ్యక్తులో రోగులకు, వారి కుటుంబీకులకు గుర్తించడం కష్టం అవుతోంది. ఫలితంగా అపరిచిత వ్యక్తుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది.  

అన్ని విభాగాల్లో డ్రెస్‌ కోడ్‌ అమలు చేస్తాం
ఎన్‌ఏబీహెచ్‌ నిబంధనల ప్రకారం ఆసుపత్రిలో ప్రతి ఒక్కరూ డ్రెస్‌ కోడ్‌ పాటించాలి. వారి వారి వృత్తి, హోదాను బట్టి డ్రెస్‌ ధరించాలి. దీంతో పాటు ప్రతి ఒక్కరి మెడలో గుర్తింపు కార్డు (ఐడీ కార్డు) ఉండాలి. ఈ మేరకు సోమవారం నుంచి ఆయా విభాగాల వారీగా వైద్యులతో సమావేశమై ఆదేశాలు జారీ చేయనున్నాము.   –డాక్టర్‌ పి. చంద్రశేఖర్, ఆసుపత్రి సూపరింటెండెంట్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top