స్వైన్‌ఫ్లూపై ఆందోళన వద్దు

Doctor Vara Sundaram Said Don't Fear About Swine Flu in PSR Nellore - Sakshi

నివారణకు అన్ని చర్యలు చేపడుతున్నాం

డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వరసుందరం

నెల్లూరు(బారకాసు): స్వైన్‌ఫ్లూ పై ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేద ని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వరసుందరం పేర్కొన్నారు. నగరంలోని జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వైన్‌ఫ్లూ నివారణకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్వైన్‌ఫ్లూ సోకిన వారికి ప్రత్యేకంగా వైద్యం అందించేందుకునగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశామన్నారు. అలాగే వైద్యబృందం, అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కాబట్టి ఎవరకైనా రెండు, మూడు రోజులుగా జ్వరం, జలుబు తగ్గకుండా స్వైన్‌ఫ్లూ లక్షణాలని అనుమానం వస్తే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే అక్కడా అవసరమైన పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారించి తగిన చికిత్స అందజేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 11 మందికి స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకిందని వారంతా పలు కార్పొరేట్‌ హాస్పిటల్స్‌లో వైద్యం పొందుతూ ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేశారు.

వీరిలో నెల్లూరు నగరం, చిట్టమూరు, సౌత్‌మోపూరు, బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన వారని తెలిపారు. ఈ ఏడాదిలో స్వైన్‌ఫ్లూతో మృతి చెందిన కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదన్నారు. ఇప్పటికే జిల్లాలో ప్రధాన రైల్వేస్టేషన్, ఆర్టీసీ బస్టాండ్‌లలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు స్వైన్‌ఫ్లూపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. కరపత్రాలు పంపిణీ, ముఖ్య కూడల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామన్నారు. పీఎంపీ, ఆర్‌ఎంపీలు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు స్వైన్‌ఫ్లూపై అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులను చేయాలని ఆదేశించామన్నారు. తమ కార్యాలయంలో ప్రత్యేకంగా ఫీవర్‌ సెల్‌ ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఎక్కడైనా జ్వరాలు కానీ, స్వైన్‌ఫ్లూ లక్షణాలు కన్పిస్తే వెంటనే సెల్‌ 9618232115, ల్యాండ్‌ 0861–2300310కు ఫోన్‌ చేయాలని కోరారు. తమ వైద్య సిబ్బంది స్పందించి అవసరమైన వైద్య చికిత్స అందజేస్తారని పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top