
విధుల్లో ఉన్న అటెండర్ అరుణ
విశాఖపట్నం, చీడికాడ(మాడుగుల): అది మండలంలోని ఏకైక హోమియో వైద్యశాల. అక్కడ పనిచేసే సిబ్బంది ఏడాదిన్నర క్రితం బదిలీపై వెళ్లి పోవడంతో డాక్టర్ నుంచి స్వీపర్ వరకు అన్నీ విధులు అటెండర్ అరుణే నిర్వహించవలసి వస్తోం ది. వివరాలలోకి వెళితే మండలంలోని ఖండివరం హోమియో వైద్యశాలకు ఖండివరంతో పాటు చుట్టు పక్కల గ్రామాలైన శిరిజాం, వి.బి.పేట, ఎల్.బి.పట్నం, బి.సింగవరంతో పాటు మండలం నలుమూలల నుంచి వృద్ధులు,దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు వచ్చి వైద్యసేవలు పొందుతారు. ప్రతిరోజు 35 నుంచి 40 మంది మంది అవుట్‌పేషంట్లు ఉంటారు. ఈ వైద్యశాలలో ఒక డాక్టర్, ఒక ఫార్మసిస్ట్,ఒక అటెండర్,ఒక స్వీపర్ ఉండాలి. ఇక్కడి డాక్టర్, ఫార్మసిస్ట్ ఏడాదిన్నర క్రితం సాధారణ బదిలీల్లో వేరే వైద్యశాలకు వెళ్లారు.
వారి స్థానంలో ప్రభుత్వం ఇంతవరకు ఎవరినీ నియమించలేదు. అయితే ఇదే వైద్యశాలకు అటెండర్ అరుణ బదిలీపై వచ్చింది. నాటి నుంచి ఈ ఆస్పత్రిలో అన్ని సేవలు ఆమే నిర్వహిస్తోంది. తనకు తెలిసిన మేరకు రోగులకు మందులు అందిస్తోంది. అయితే పూర్తి స్థాయిలో వైద్యం అందక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారని గ్రామపెద్దలు సుంకర శ్రీను,షేక్ సూర్యనారాయణ, మోసూరి సన్నిబాబులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆస్పత్రికి అధిక సంఖ్యలో రోగులు వస్తున్నారని, డాక్టర్ లేక పోవడంతో నిరాశతో వెనుదిగుతున్నారని తెలి పారు. వెంటనే వైద్యుడిని నియమించాలని వా రు కోరారు. అటెండర్ అరుణ మాట్లాడుతూ జీతం, ఇతర బిల్లులు పెట్టడానికి మాత్రమే ఇన్‌చార్జిని ఇచ్చారని, వైద్యం కోసం ఎవరినీ నియమించలేదని తెలిపింది. ఏడాదిన్నర నుంచి ప్రతి రోజు రోగులు వచ్చి నిరాశతో వెనక్కి వెళ్లిపోతుంటే బాధగా ఉందని, రోగులకు సమాధానం చెప్పలేక పోతున్నానని తెలిపింది.