వేలమంది చిన్నారులకు ఆతృత, హైరానా. అంతకు రెట్టింపు సంఖ్యలో వారి తల్లిదండ్రులకు ఉద్వేగం, ఆదుర్దా. ఉన్నత విద్యాసౌధానికి పునాది
రాయవరం : వేలమంది చిన్నారులకు ఆతృత, హైరానా. అంతకు రెట్టింపు సంఖ్యలో వారి తల్లిదండ్రులకు ఉద్వేగం, ఆదుర్దా. ఉన్నత విద్యాసౌధానికి పునాది వంటి పదో తరగతి పరీక్షలు మరో నాలుగు రోజుల్లో (ఈ నెల 21 నుంచి) ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇదీ ఊరూవాడా అనేక ఇళ్లలో కనిపించే పరిస్థితి. పరీక్షలు వచ్చే నెల 7 వరకూ జరుగుతాయి. ఇదిలా ఉండగా.. పదో తరగతి పరీక్షల్లో గతేడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించేందుకు జిల్లా అధికార యంత్రాంగం తీవ్రమైన కసరత్తు చేస్తోంది.
గతేడాది పదవ తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. 2014 పదో తరగతి ఫలితాల్లో జిల్లా మొదటిస్థానాన్ని సాధించింది. ఈ ఏడాదీ ఆ విజయూన్నే జిల్లాకు సొంతం చేయూలన్నది అధికారుల తపన. జిల్లాలో మొత్తం 70,529 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో 33,522 మంది బాలురు, 34,144 మంది బాలికలు రెగ్యులర్ విద్యార్థులుగా పరీక్షలు రాయనుండగా, 2,863 మంది ప్రైవేటుగా పరీక్షలకు హాజరవుతున్నారు. 317 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల సక్రమ నిర్వహణకు సుమారు 3,800 మంది ఇన్విజిలేటర్లను నియమించనున్నారు.
100 రోజుల కార్యాచరణ ప్రణాళిక..
పదో తరగతిలో ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు జిల్లా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేసింది. డిసెంబరు మొదటి వారం నుంచి 100 రోజుల ప్రత్యేక ప్రణాళికను అమలు చేశారు. అందులో భాగంగా ప్రతి రోజూ ఉదయం 8.45 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ సాయంత్రం 10 మార్కులకు సబ్జెక్టుల వారీగా స్లిప్ టెస్ట్, వారాంతంలో 25 మార్కులకు గ్రాండ్ టెస్ట్ నిర్వహించారు.
ఈ ఏడాది రెండు సార్లు ప్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహించారు.
ఇప్పటికే పదవ తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాలు సంబంధిత పోలీస్‌స్టేషన్లకు చేరుకుంటున్నాయి. ఇప్పటి వరకూ తెలుగు, హిందీ, ఇంగ్లిషు, గణితం మొదటి పేపర్ సంబంధించిన సెట్ 1, 2 ప్రశ్నాపత్రాలు పోలీస్‌స్టేషన్లకు చేరుకోగా చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు వాటిని తీసుకుని ఆ స్టేషన్లలో భద్రపర్చారు. ఈ నెల 19, 23 తేదీల్లో మిగిలిన సబ్జెక్టులకు సంబంధించిన సెట్ 1, 2 ప్రశ్నాపత్రాలు ఆయా పోలీస్‌స్టేషన్లకు చేరుకోనున్నాయి.
10 గ్రేడ్ పాయింట్లు సాధించాలని..
10కి 10 గ్రేడు పాయింట్లు సాధించాలనే లక్ష్యంతో చదువుతున్నాను. ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రత్యేక సూచనలు, సలహాలతో అనుకున్న సాధిస్తాననే నమ్మకం ఉంది.
- జి.విమల, 10వ తరగతి విద్యార్థిని, సోమేశ్వరం
పరీక్షలకు పూర్తిగా సన్నద్ధమయ్యా..
పదవ తరగతి పరీక్షలకు పూర్తిగా సన్నద్ధమయ్యాను. మంచి గ్రేడు సాధించేందుకు ఉపాధ్యాయుల పర్యవేక్షణలో అన్ని సబ్జెక్టుల్లో తీర్చిదిద్దారు. మంచి గ్రేడ్ సాధిస్తా.
- వై.మనోజ్‌యాదవ్, 10వ తరగతి విద్యార్థి, రాయవరం