‘డౌట్’సెట్! | Sakshi
Sakshi News home page

‘డౌట్’సెట్!

Published Mon, Dec 1 2014 1:40 AM

Dietcet counselling doubt in telangana

* తెలంగాణ, ఏపీల మధ్య మరో వివాదం
* కళాశాలలకు ‘ఫైర్ సేఫ్టీ’ సర్టిఫికెట్ తప్పనిసరి చేసిన హైకోర్టు
* ఆ సర్టిఫికెట్లు లేకుండానే గుర్తింపు పొడిగించిన తెలంగాణ విద్యాశాఖ..
* ప్రవేశాల సమయంలో ధ్రువపత్రాలు తీసుకోవాలని డైట్ కన్వీనర్‌కు సూచన
* దానితో తమకు సంబంధం లేదంటున్న ‘డైట్’ కన్వీనర్
* ఇలాగైతే కౌన్సెలింగ్ నిర్వహించలేమని స్పష్టీకరణ
* తెలంగాణ, ఏపీ అధికారుల భిన్నవాదనలు.. ఆందోళనలో 2.19 లక్షల విద్యార్థులు

సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే ఎంసెట్, ఇంటర్ పరీక్షల వ్యవహారాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుండగా... తాజాగా డైట్‌సెట్ కౌన్సెలింగ్ అంశంతో మరో వివాదం మొదలైంది. హైకోర్టు ఆదేశాల మేరకు డైట్ కళాశాలలకు ‘ఫైర్‌సేఫ్టీ’ సర్టిఫికెట్ లేకుంటే కౌన్సెలింగ్ నిర్వహించలేమంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న డైట్‌సెట్ కన్వీనర్ చేతులెత్తేశారు. అసలు తెలంగాణలోని 253 డైట్‌కళాశాలల్లో ఏ ఒక్క కళాశాలకు కూడా ‘ఫైర్‌సేఫ్టీ’ సర్టిఫికెట్ లేకపోవడంతో ఈ వివాదం రేకెత్తింది.

డైట్‌సెట్ రాతపరీక్ష జరిగి ఆరు నెలలు గడిచినా ఇంకా కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటించలేదు. ఇరు రాష్ట్రాల పాఠశాల విద్యాశాఖల నుంచి కళాశాలల జాబితాలు డైట్‌సెట్ కన్వీనర్‌కు అందించడంలో జరుగుతున్న జాప్యమే దీనికి కారణమని బయటకు పేర్కొంటున్నా... కళాశాలలకు అనుమతుల జారీలో లోగుట్టుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత డైట్‌సెట్ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న సురేందర్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖకు కేటాయించారు.

ఏపీలో 476, తెలంగాణలో 257 కళాశాలలు కలిపి ఇరు రాష్ట్రాల్లో 733 డైట్ కళాశాలలు ఉండగా.. వాటిల్లో మొత్తం 38,850 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారానే ఇరు రాష్ట్రాల్లోని సీట్లను భర్తీ చేయాల్సి ఉంది. ఈ కాలేజీల్లో సౌకర్యాలపై ఏటా కౌన్సెలింగ్‌కు ముందు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (ఎస్‌సీఈఆర్‌టీ) నేతృత్వంలోని అఫిలియేషన్ కమిటీ తనిఖీలు నిర్వహిస్తుంది. ఈ కమిటీ సిఫారసుల ఆధారంగా ఆయా కాలేజీల గుర్తింపును పొడిగిస్తారు.

రాష్ట్ర విభజన అనంతరం తాజాగా ఏపీ ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని 413 కళాశాలల గుర్తింపును పునరుద్ధరిస్తూ కొద్దిరోజుల కింద ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కళాశాలల జాబితా ఇంకా డైట్ కన్వీనర్‌కు అందకపోయినా... వీటిలో దాదాపు అన్ని కాలేజీలకూ ‘ఫైర్ సేఫ్టీ’ సర్టిఫికెట్ ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో... తెలంగాణలోని 253 కళాశాలల గుర్తింపును పునరుద్ధరించిన ఇక్కడి పాఠశాల విద్యాశాఖ... ఆ కళాశాలల జాబితాను శని వారం సాయంత్రం డైట్ కన్వీనర్‌కు పంపించింది. అయితే అందులో ఏ ఒక్క కళాశాలకు ‘ఫైర్ సేఫ్టీ’ సర్టిఫికెట్ లేదు.

విద్యార్థుల భద్రత దృష్ట్యా ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ ఉంటేనే కళాశాలలకు అనుమతులు జారీ చేయాలని హైకోర్టు గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాల నేపథ్యంలో కౌన్సెలింగ్ సమయంలోనే ఆయా కళాశాలల యాజమాన్యాల నుంచి ‘ఫైర్ సేఫ్టీ’ సర్టిఫికెట్ తీసుకుని ప్రవేశాలు జరపాలని తెలంగాణ విద్యా శాఖ డైట్‌సెట్ కన్వీనర్‌కు సూచించింది. కానీ దీనిపై డైట్‌సెట్ కన్వీనర్ సురేందర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాగైతే కౌన్సెలింగ్ నిర్వహించలేమని స్పష్టం చేశారు.

ఎవరి వాదన వారిదే!
‘ఫైర్ సేఫ్టీ’ వివాదంపై తెలంగాణ ఎస్‌సీఈఆర్‌టీ డెరైక్టర్ జగన్నాథరెడ్డి, డైట్‌సెట్ కన్వీనర్ సురేందర్‌రెడ్డి భిన్న వాదనలు వినిపిస్తున్నారు. అగ్నిమాపకశాఖ ఎన్‌వోసీ లేకపోయినా కళాశాలలకు గుర్తింపు పొడిగింపుతో తమకు సంబంధం లేదని, బెంగళూరులోని జాతీయ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ (ఎన్‌సీటీఈ) ఈ అఫిలియేషన్లు జారీ చేసిందని జగన్నాథరెడ్డి చెబుతున్నారు. కానీ ఈ వాదనను డైట్‌సెట్ కన్వీనర్ సురేందర్‌రెడ్డి తోసిపుచ్చారు. కొత్త డైట్ కళాశాలలు ప్రారంభించడానికే ఎన్‌సీటీఈ అనుమతులు జారీ చేస్తుందని.. మరుసటి ఏడాది నుంచి గుర్తింపు పునరుద్ధరణను ఆయా రాష్ట్రాల విద్యాశాఖల నేతృత్వంలోని అఫిలియేషన్ కమిటీలే చూడాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. పరీక్షల నిర్వహణ, కౌన్సెలింగ్ జరపడం వరకే తమ బాధ్యత అని... కళాశాలల అనుమతులకు సంబంధించిన అంశాలతో తమకు సంబంధం లేదన్నారు. ఈ వ్యవహారంలో న్యాయ నిపుణుల సలహా తీసుకుని తెలంగాణ విద్యాశాఖకు తెలియజేస్తామని సురేందర్‌రెడ్డి చెప్పారు.

విద్యార్థుల ఎదురుచూపులు..
డైట్‌సెట్‌కు ఏప్రిల్ 29న ప్రకటన జారీకాగా జూన్ 29న పరీక్ష నిర్వహించారు. దాదాపు 3.47 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయగా.. జూలై 1న ప్రకటించిన ఫలితాల్లో 2.19 లక్షల మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరి ర్యాంకులను సైతం జూలై 31వ తేదీనే ప్రకటించారు. అయితే.. ఉమ్మడి రాష్ట్రంలో కళాశాలల గుర్తింపు పునరుద్ధరణ విషయంలో ఉన్నతస్థాయి వర్గాలు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో బేరసారాలు నడిపినట్లు ఆరోపణలు వచ్చాయి. అందువల్లే గుర్తింపు పునరుద్ధరణ ప్రక్రియను సాగదీస్తున్నారనే విమర్శలూ వచ్చాయి.

కానీ, రాష్ట్ర విభజన జరిగి ఇరు రాష్ట్రాల్లో వేర్వేరు ప్రభుత్వాలు ఏర్పడినా కళాశాలలకు గుర్తింపు జారీ ప్రక్రియలో మాత్రం మార్పు రాలేదు. ఇరు రాష్ట్రాల విద్యాశాఖలు తమ రాష్ట్రాల్లోని కళాశాలల గుర్తింపు పొడిగింపు ప్రక్రియను సాగదీయడంతో ఇప్పటి వరకు కౌన్సెలింగ్ జరగలేదు. దీంతో రెండు లక్షల మందికిపైగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వీరిలో చాలా మంది విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరకుండా డైట్ ప్రవేశాల కోసమే ఎదురుచూస్తున్నారు.

Advertisement
Advertisement