వణికిస్తున్న డయేరియా | Sakshi
Sakshi News home page

వణికిస్తున్న డయేరియా

Published Wed, Feb 6 2019 6:34 AM

Diarrhea in Gottivada Visakhapatnam - Sakshi

విశాఖపట్నం, కోటవురట్ల(పాయకరావుపేట):  గొట్టివాడ గ్రామాన్ని డయేరియా వణికిస్తోంది.  ఈ వ్యాధి బారిన పడిన పలువురు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. గ్రామంలో  25 మంది వరకు డయేరియా బారిన పడి పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. స్థానిక సీహెచ్‌సీలో పది మంది రోగులు చికిత్స పొందుతుండగా నర్సీపట్నం, తుని, అనకాపల్లి, విశాఖలో  ప్రైవేటు ఆస్పత్రుల్లో మరికొంత మంది  చేరారు. రెండు రోజులుగా డయేరియా విజృంభిస్తుండగా రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతోంది. గొట్టివాడతో పాటు పక్క గ్రామాల్లో కూడా డయేరియాతో పలువురు బాధపడుతున్నారు.  తాగునీరు కలుషితం కావడం వల్లే రోగుల సంఖ్య పెరుగుతున్నట్టు తెలుస్తోంది.

సీహెచ్‌సీలో గొట్టివాడలోని ఒకే కుటుంబానికి చెందిన సుంకర అప్పలనాయుడు, నూకరత్నం, చంద్రశేఖర్, ప్రవల్లిక చికిత్స పొందుతున్నారు. వీరితో పాటు బాలెం గోవిందమ్మ, బండి లక్ష్మి, సమ్మంగి నూకరత్నం, రాజుపేటకు చెందిన మొల్ల నాగేశ్వరరావు చికిత్స పొందుతున్నారు. రోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి ఆర్‌.ఎస్‌.సీతారామరాజు సీహెచ్‌సీకి వెళ్లి రోగులను పరామర్శించారు.  మెరుగైన వైద్యం అందించాలని, గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి డయేరియాను అదుపులోకి తీసుకురావాలని కోరారు. 

Advertisement
Advertisement