అడుగులో అడుగేస్తూ.. | Sakshi
Sakshi News home page

అడుగులో అడుగేస్తూ..

Published Wed, Sep 26 2018 7:16 AM

Dharmana Prasada Rao Padayatra For Support YS Jagan - Sakshi

వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మూడువేల కిలోమీటర్ల మైలురాయిని దాటిన నేపథ్యంలో ఆయనకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు మంగళవారం పాదయాత్ర చేశాయి. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్‌కు మద్దతుగా నినాదాలు చేశారు.

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి సంఘీభావంగా గార మండలంలో పార్టీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు పాద యాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులను రూపకల్పనచేసి వన్నెతెచ్చినది దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అయితే ప్రాజెక్టులను నేనే తెచ్చానని.. నేనే పూర్తి చేయగలనని డబ్బాలు కొట్టుకుని తిరగడం చంద్రబాబుకి తగదన్నారు. అన్ని ప్రాజెక్టుల పనులు రాజశేఖరరెడ్డిహయాంలోనే 70 శాతానికి పైగా పూర్తయ్యావన్నారు. అయితే కమీషన్ల కక్కుర్తికి అంచనాలు పెంచేసి ఉన్న కొద్దిపాటి పనులను కూడా చంద్రబాబు నేటికీ పూర్తిచేయలేకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి నీరుపారించే సత్తాఉన్న నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనన్నారు. జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి టీడీపీ నేతల గుండెల్లో గుబులు రేగిందన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ గొండు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఆమదాలవలస నియోజకవర్గంలోని సరుబుజ్జిలి మండలం శాస్త్రులపేట నుండి సరుబుజ్జిలి జంక్షన్‌ వరకు శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనపై జనం విసిగెత్తి ఉన్నారన్నారు. త్వరలోనే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ఎంపీపీ కె.సత్యనారాయణ, జెడ్పీటీసీ ప్రతినిధి ఎస్‌.నాగేశ్వరరావు పాల్గొన్నారు.

నరసన్నపేట నియోజకవర్గం పరిధి  పోలాకి మండలంలోని రాజారాంపురం నుంచి గుప్పడిపేట వరకూ పార్టీ పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్‌ పాదయాత్ర చేశారు. అధికసంఖ్యలో ప్రజలు భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా కృష్ణదాస్‌ మాట్లాడుతూ నవరత్నాలతో తమ పార్టీ అందరినీ ఆదుకుంటుందన్నారు. కార్యక్రమంలో ధర్మాన రామదాస్, ధర్మాన కృష్ణ చైతన్య , కరిమి రాజేశ్వరరావు పాల్గొన్నారు.

పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో సమస్వయకర్త రెడ్డి శాంతి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి జాతీయ రహదారి మీదగా కొరసవాడ గ్రామం వరకూ పాదయాత్ర చేశారు.   కొత్తూరు, హిరమండలం, ఎల్‌.ఎన్‌.పేట మండలాల పార్టీ  కన్వీనర్లు సారిపల్లి ప్రసాదరావు, అల్లు శంకరరావు, కిల్లారి త్రినాథరావులు పాల్గొన్నారు.

పాలకొండ నియోజకవర్గం పరిధి భామిని మండలం ఘనసరలో ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి సంఘీభావ యాత్ర చేశారు. మహిళలు భారీగా పాల్గొన్నారు. పార్టీ మండల కన్వీనర్‌ పి.సింహచలం, పాలకొండ మండల నాయకులు రణస్థలం రాంబాబు, రామచంద్ర నాయుడు   పాల్గొన్నారు.

రాజాం ఎమ్మెల్యే కంబాలి జోగులు  మారేడుబాక నుంచి బొద్దాం జంక్షన్‌ వరకు పాదయాత్ర చేశారు. అనంతరం బొద్దాంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ జగన్‌ పాదయాత్రకు వస్తున్న జనస్పందన చూసి టీడీపీ నేతల్లో భయం పట్టుకుందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్‌ పాల్గొన్నారు.

ఇచ్ఛాపురం మండలం డొంకూరు గ్రామం నుంచి ఈదుపురం గ్రామం వరకు సమన్వయకర్త పిరియా సాయిరాజ్‌ ఆధ్వర్యంలో పాదయాత్ర జరిగింది. ఇచ్ఛాపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిలక రాజలక్ష్మి, కంచిలి ఎంపీపీ ఇప్పిలి లోలాక్షి, జెడ్పీటీసీ సభ్యురాలు జామి జయ పాల్గొన్నారు.

టెక్కలి మండలం పరశురాంపురం గ్రామం నుంచి పెద్దసాన, రాధావల్లభాపురం, పోలవరం గ్రామాల మీదుగా లింగాలవలస గ్రామం వరకు నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూపొందించిన నవరత్నాల పథకాలే పార్టీ విజయానికి పునాదులన్నారు.

ఎచ్చెర్ల మండలం పొన్నాడ పంచాయతీ పరిధి తెప్ప రేవు నుంచి బొంతలకోడూరు వరకు నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్‌ పది కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. మొక్కలు నాటి పాదయాత్ర ప్రారంభించారు. అధికసంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.

పలాస నియోజకవర్గం పరిధి మందస మండలంలో సమన్వయకర్త సీదిరి అప్పలరాజు పాదయాత్ర చేశారు.  కొత్తపల్లి గ్రామంలోని శ్రీఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అప్పలరాజు కొత్తపల్లి నుంచి ముకుందపురం, బాలాజీపురం, సొండిపూడి, సిద్ధిగాం, శ్రీరాంపురం, శ్రీరాంపురం, హొన్నాళి, బెల్లుపటియా, మహదేవుపురం, సిరిపురం, పొత్తంగి వరకు చేశారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి జుత్తు ధనలక్ష్మి, జిల్లా కార్యదర్శులు మెట్ట కుమారస్వామి, డొక్కరి దానయ్య, బల్ల గిరిబాబు పాల్గొన్నారు.

Advertisement
Advertisement